M.V. Ramanaa Reddy
-
టూకీగా ప్రపంచ చరిత్ర - 65
ఆచారాలు-నమ్మకాలు అతని గుహాచిత్రాల విషయానికొస్తే - రాతియుగం చివరి దశకి చెందిన చిత్రాల్లో గూడా కేవలం తనకు ఇష్టమైన వేట జంతువులే కనిపిస్తాయి తప్ప, చెట్లూ గుట్టలూ, కొండలూ వాగులూ, సూర్యుడూ చంద్రుడూ వంటి చిత్రీకరణ కనిపించదు. కనీసం తనకు భయాన్ని కలిగించే క్రూర జంతువుల బొమ్మలైనా కనిపించవు. చెట్లూ గుట్టలవంటి జడ పదార్థాలుగానీ, సూర్యుడూ చంద్రుడూ వంటి ప్రకృతి శక్తులు గానీ అతనికి సర్వసాధారణమైన దృశ్యాలే తప్ప, తన ప్రయోజనానికి ఏ మాత్రం పనికొచ్చేవి కావని అతని భావన. అతని కుండేది కడుపు నింపుకోవాలనే ఆశ, తనను తాను కాపాడుకునే ఉపాయం. గుహల చీకట్లలో బొమ్మ వేస్తే, అలాంటి జంతువు తనకు వేటగా దొరుకుతుందని అతడి నమ్మకం. నమ్మకానికి హేతువుతో నిమిత్తం లేదు; తను ఆశించిన ఫలితానికీ సంప్రాప్తించిన ఫలితానికీ పొంతన ఉందో లేదో విశ్లేషించుకోవడం అతనికి చేతగాదు. వీటిని బట్టి మనకు తెలిసేది పునాది దశలో ఆచారమూ నమ్మకమూ వేరు వేరని. ఆచారానికి పూనాది ఆత్మీయత; నమ్మకానికి పునాది ఆశ. కాలక్రమేణా ఆశతో ‘భయం’ జతగట్టి, నమ్మకమనేది ఆశలూ భయాల సమ్మేళనంగా రూపొందింది. నమ్మకానికి హేతువుతో నిమిత్తం లేదు; తను ఆశించిన ఫలితానికీ సంప్రాప్తించిన ఫలితానికీ పొంతన ఉందో లేదో విశ్లేషించుకోవడం అతనికి చేతగాదు. వీటిని బట్టి మనకు తెలిసేది పునాది దశలో ఆచారమూ నమ్మకమూ వేరు వేరని. ఆచారానికి పూనాది ఆత్మీయత; నమ్మకానికి పునాది ఆశ. ‘భయం’ అనేది ఎప్పుడు పుట్టుకొచ్చింది? పాత రాతియుగం మానవునికి భయమనేది లేదా? - ఎందుకులేదు; తప్పకుండా ఉంది. ఒకసారి వలను తప్పించుకున్న పిట్టలు మరోసారి ఆ ప్రదేశంలో వాలవు. ఒకసారి ఉచ్చులు తప్పించుకున్న జంతువు తిరిగి ఆ తావుకు వెళ్ళక తప్పనప్పుడు జంకుతుంది. బెదురు అనేది పక్షుల్లో, పశువుల్లోనే తెలుస్తూంటే, మరి మనిషికి అది ఉండదని ఎలా అనుకోగలం? జోగాడే పాప మెట్లమీదికి చకచకా పాకిపోతుంది. దిగే వాటం తెలిసిందాకా దిగటానికి జింక కెవ్వున ఏడుస్తుంది. మేధోపరంగా పక్షులూ, పశువులూ, పసికూనల కంటే ఎదిగిన ఆ మానవునికి భయం ఎందుకుండదు? క్రూరజంతువులంటే భయం; పాము కాటేస్తుందని భయం; అలవిగానంత పెద్దదిగావుండే ఏనుగు నలగదొక్కుతుందనే భయం - ఇలాంటి ఎన్నెనో భయాలు ఉండేవుంటాయి. కానీ, భయానికి కారణమైన జంతువులేవీ అతని చిత్రాల్లో కనిపించవు. అలాంటి ప్రమాదాలు తనకు ఎదురవ్వాలని అతని కోరిక కాకపోవడంతో చిత్రించేందుకు సమ్మతిపడి ఉండకపోవచ్చు; లేదా, చెట్టూ గుట్టలూ తదితర నిరుపయోగమైన దృశ్యాలకు మల్లే, ప్రమాదాలను గూడా సర్వసాధారణమైనవిగా భావించాడో ఏమో! కాలక్రమేణా వేటాడే పరికరాల్లో నాణ్యత, వైవిధ్యం పెరిగింది. వేటాడే పద్ధతులూ, నైపుణ్యం పెరిగింది. పెద్దపెద్ద జంతువులను వేటాడే సమయంలో వేటగాళ్ళ గుంపుకు దిశానిర్దేశం ఇచ్చేందుకు తగినంత అనుభవం సంపాదించిన నాయకత్వం అవసరమయింది. మేధోసంపత్తిలో వ్యక్తికీ వ్యక్తికీ మధ్య పెద్దగా తారతమ్యం ఏర్పడని కాలంలో ఆ నాయకత్వం సహజంగా వయసులో పెద్దవాడైన వ్యక్తికి దక్కుతుంది. ఇంటాబయటా ఆ గుంపు కొన్ని కట్టుబాట్లతో నడుచుకునేలా అదుపు చేసే బాధ్యత కూడా అతని భుజానికే ఎత్తుంటారు. దానివల్ల, ఆ పెద్దమనిషి పట్ల ప్రత్యేకమైన గౌరవం ఏర్పడి వుండక తప్పదు. అతనికి వేటలో పాల్గొనే శక్తి ఉడిగినా, సలహాలూ హెచ్చరికల రూపంలో అతని అనుభవం గుంపుకు ప్రయోజనకరంగా ఉన్నప్పుడు, అతని స్థానం ఎప్పటిలాగే కొనసాగక తప్పదు. భాషకు విస్తృతి పెరగడం వల్ల, అతని విశ్రాంతి సమయం పిల్లలకు వేట అనుభవాన్ని మాటల ద్వారానూ ఆటల ద్వారానూ నేర్పించే కాలక్షేపంతో, ఆ వృద్ధుడు గురువుగా పరిణమించాడు. పితామహుడు, నాయకుడు, గురువు స్థానాలన్నిటికీ ఒకడే కావటంతో, తదుపరి కాలంలో ఆ స్థానానికి ఒక హోదా ఏర్పడి ఉండాలి. అతనికి ఇవ్వవలసిన గౌరవ మర్యాదలు ఆచారాల పేరుకు రెండవ వాయి కూర్పుగా చేరుండాలి. రచన: ఎం.వి.రమణారెడ్డి రచయిత ఫోన్: 9440280655; email: mvrr44@gmail.com -
టూకీగా ప్రపంచ చరిత్ర - 64
ఆచారాలు-నమ్మకాలు ‘శవసంస్కారం’ ప్రధానంగా మూడు పద్ధతుల్లో కనిపిస్తుంది. మొదటిది శవాన్ని చెట్టుమీదికి చేర్చడం. మహాభారతం విరాటపర్వంలోని ‘శమీవృక్ష సంఘటన’ ద్వారా ఇలాంటి పద్ధతి ఒకటుండేదని మనకు తెలుస్తుంది. టిబెట్-నేపాల్ సరిహద్దుల్లో ఇప్పటికీ ఈ పద్ధతి కొనసాగుతుందని వినికిడి. నేలను తవ్వేందుకు తగిన సాధనాలు లేకనో, తవ్వకానికి ఆ నేల అనుకూలించకనో ఈ ఆచారం ఏర్పడి వుండొచ్చు. రెండవది, ఆర్య సంతతి అనుసరించే శవదహనం. లోతైన గోతిని తొలిచే అవకాశం లేక, లోతు తక్కువైన గోతిలో పాతిపెడితే, పై మట్టిని కుక్కలూ నక్కలూ తేలిగ్గా తొలగించి, శవాన్ని పూర్తిగానో ముక్కలుముక్కలుగానో ఎత్తుకొచ్చి కొరుకుతున్న బీభత్సానికి తీవ్రమైన ప్రతీకారంగా శవాన్ని దహించటానికి చేసుకున్న నిర్ణయంతో ఈ పద్ధతి ఉనికిలోకి వచ్చి వుండొచ్చు. ఇక మూడవది, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక జనాభా అనుసరించే శవఖననం. అంటే, నక్కల వంటి జంతువులకు తోడే ఆస్కారం లేనంత లోతుగా శవాన్ని పాతిపెట్టడం. ఆచారం వేరు, నమ్మకం వేరు; దాని పునాది వేరు, దీని పునాది వేరు. వంశపారంపర్యంగా అనసరించేది ఆచారం. ఇది ఎన్నోతరాల పరంపరగా, వ్యక్తిగత వైరుధ్యాలకు పెద్దగా చోటివ్వకుండా కొనసాగే చర్యల సమ్మేళనం. సమ్మకం లేదా విశ్వాసం అనేది సంపూర్ణంగా వ్యక్తిగతమైన వ్యవహారం. ఒకే కుటుంబంలోని సభ్యులందరివల్ల ఆచారాలు ఒకే రకంగా పాటించబడొచ్చుగానీ, నమ్మకాలు మాత్రం వేరు వేరుగా ఉండగలవు. ‘శవసంస్కారం’లో పై మూడు పద్ధతులే కాక, మరో విచిత్రమైన పద్ధతి కూడా భారతదేశంలో కనిపిస్తుంది. ఇది అతి తక్కువ సంఖ్యాకులైన పారసీలు లేదా పారసీకులు ఇప్పటికీ ఆచరిస్తున్న పద్ధతి. వీళ్ళు పూనా, బొంబాయి నగరాల్లోనూ, వాటి పరిససరాల్లోనూ నివసిస్తున్నారు. ప్రార్థనా సంబంధమైన కార్యక్రమాల్లో వాళ్ళు ఉచ్చరించే మంత్రాలు అవెస్టాలోనికి కావడం వల్ల, వీళ్ళను ఒకనాటి జొరాస్ట్రియన్లుగా భావించొచ్చు. శవాన్ని ఎత్తై భవనం పైకప్పుకు చేర్చి, దాన్ని రాబందులకు ఆహారం అయ్యేలు వదిలెయ్యడం వీళ్ళ ఆచారం. చనిపోయిన తరువాత గూడా తన శరీరం ఏదోవొక ప్రాణికి ఉపయోగపడాలన్న సంకల్పం ఇందులో కనిపిస్తుంది. తీవ్రమైన ప్రతీకార ధోరణిగా కనిపించే ఆర్యుల ‘దహన’ పద్ధతికి సంపూర్ణమైన విరుద్ధదృవంగా కనిపించేది పారసీల పద్ధతి. మొత్తంమీద, పద్ధతి ఏదైనా, శవసంస్కారమనే ఆచారం మూలంగా మానవుడు జంతువు నుండి సంపూర్ణంగా వేరుపడి, తన స్థాయిని ఎన్నో అంతస్తులు పెంచుకున్నాడు. ఆచారం వేరు, నమ్మకం వేరు; దాని పునాది వేరు, దీని పునాది వేరు. వంశపారంపర్యంగా అనుసరించేది ఆచారం. ఇది ఎన్నోతరాల పరంపరగా, వ్యక్తిగత వైరుధ్యాలకు పెద్దగా చోటివ్వకుండా కొనసాగే చర్యల సమ్మేళనం. సమ్మకం లేదా విశ్వాసం అనేది సంపూర్ణంగా వ్యక్తిగతమైన వ్యవహారం. ఒకే కుటుంబంలోని సభ్యులందరివల్ల ఆచారాలు ఒకే రకంగా పాటించబడొచ్చుగానీ, నమ్మకాలు మాత్రం వేరు వేరుగా ఉండగలవు. ఆచారాలూ నమ్మకాలూ కలగాపులగంగా పెన వేసుకున్న దశలో జీవిస్తున్న మనకు వాటిలో ఒకదాన్నుండి మరొకదాన్ని విడదీయడం సులభం కాకపోయినా, చరిత్రలో మానవుని తొలిమెట్టుకు వెనుదిరిగితే వాటి విడివిడి పునాదులు స్పష్టంగా గోచరిస్తాయి. గరిష్టమైన స్థాయికి ఎదిగిన మెదడుకన్నా, దాని సామర్థ్యాన్ని సంపూర్ణంగా వినియోగించుకునే అవసరం ఆ మానవునికి కలుగలేదు. ‘ఇదిగో జింక - దీన్ని పడగొట్టడం ఎలా ? అదిగో ఉడుత - దాన్ని పట్టుకోవడం ఎలా?’ వంటి తక్షణ ప్రయోజనాలూ, ‘అది కీకారణ్యం. అందులో క్రూరమృగాలుండొచ్చు; ఇది చిక్కటి పొద. ఇందులో పాము దాక్కోనుండొచ్చు’ వంటి జాగ్రత్తలకు మాత్రమే అతని ఆలోచన పరిమితం. ఐనా, అతనికి జ్ఞాపకాలూ, కలలూ ఉండేవని అతడు ఆచరించిన శవసంస్కారం, అతడు వేసిన గుహాచిత్రాలు నిరూపిస్తున్నాయి. రచన: ఎం.వి.రమణారెడ్డి రచయిత ఫోన్: 9440280655; email: mvrr44@gmail.com -
టూకీగా ప్రపంచ చరిత్ర -28
వెనుక తరాలు రచన: ఎం.వి.రమణారెడ్డి హార్మోన్ల ప్రేరణ కేవలం జీవి శరీరానికి మాత్రమే పరిమితం గాదు; అవి మెదడును గూడా ప్రచండంగా శాసిస్తాయి. వాటి ప్రోద్బలంతో మెదడు పూనుకునే చర్యలను ‘ఇన్స్టింక్ట్స్’ లేదా ‘ఉద్రేకాలు’ అంటారు. ఎదగని మెదడుండే జీవులన్నిట్లో దినచర్యలన్నీ దాదాపుగా ఉద్రేకాల ప్రేరణతోనే నడుస్తుంది. బురద కనిపిస్తే అందులో దిగకుండా ఏదేశానికి చెందిన వరాహమైనా నిగ్రహించుకోలేదు; ఎర్రటి బట్ట కళ్ళముందు పారాడితే కుమ్మకుండా ఏ దేశం ఆబోతైనా మానుకోలేదు; పరిచయంలేని పుంజు ఎదురైతే పోరాడకుండా ఏదేశం కోడిపుంజైనా తప్పుకోలేదు. మనిషిలో ఈ ఉద్రేకాల ప్రభావం ఏ ఇతర జంతువుకూ తీసిపోదు. అందునా, ప్రపంచజ్ఞానాన్ని అప్పుడప్పుడే సంతరించుకుంటున్న ఆదిమ దశ మానవుని ప్రవర్తన ఆధారపడేది ఆలోచనమీదికంటే ఉద్రేకం మీదే ప్రధానంగా ఉండడం తప్పనిసరి. ఆకలిదప్పులూ, ఆవేశకావేశాలూ, సంతోష దుఃఖాలూ, భయభ్రాంతుల వంటి వైకల్యాలకు మల్లే ప్రబలమైన వాంఛ గూడా ఒక ఉద్రేకమేనని మన అనుభవమే చెబుతుంది. అలాంటి సందర్భాల్లో ‘హార్మోన్లు’ అనే రసాయనిక పదార్థాలు రక్తంలో విజృంభించి మెదడును ప్రేరేపిస్తాయి. ఫలితంగా, అవయవాలను తత్సంబంధిత చర్యలకు మెదడు పురికొల్పుతుంది. నాగరికులైన మనుషుల్లోగూడా అలాంటి ప్రేరణ ఉంటుంది గానీ, వెంటనే మేధస్సు పైచేయి సాధించి ఉద్రేకాన్ని అదుపులోకి తీసుకుంటుంది. ఒకే రకమైన భౌతిక పరిస్థితుల్లో కలిగే సమాంతరమైన ఉద్రేకాల్లో హార్లోన్ల ప్రేరణ ఎలావుంటుందంటే - కూతకూసే ప్రాయానికొచ్చిన కోడి పుంజును చూస్తే మనకే అర్థమౌతుంది. అది పెట్టకు తన కోరికను తెలియజేసే సందర్భంలో కొద్దిగా ఎడమకు వంగి, ఎడమ రెక్కను నేలమీదికి పరిచి, పంగకాళ్ళతో పక్కపక్కలకు అడుగులేస్తూ పెట్టమీదికి వంగి గిల్లుకుంటుంది. ఈ విషయంలో మన పెరటికోడి ప్రవర్తన ఎలావుంటుందో వాషింగ్టన్ డి.సి. హాచరీలో వుండే పుంజుది కూడా కచ్చితంగా అలాగే ఉంటుంది. కారణం - ఇది హార్మోన్ల ప్రేరణ వల్ల సంభవించే ప్రవర్తనే తప్ప, మరో కోడి నుండి నేర్చుకున్నది కాదుగాబట్టి. ఆ విధంగానే, ఆదిమ మానవుని చిత్రకళ కూడా ‘ఉద్రేక’జనితమే తప్ప, ఒకరి నుండి ఒకరికి విస్తరించిన నమ్మకం కాదు. చిత్రకళలోనే కాదు, శిల్పాలు చెక్కడంలోనూ అతనికి ప్రావీణ్యత అబ్బింది. ఏనుగు దంతాల మీదా, ఎముకల మీదా, దుప్పి కొమ్ములమీదా చెక్కిన శిల్పాలు కళ పట్ల అతనికుండే ఆసక్తిని వెల్లడిస్తాయి. అయితే, వాటిమీద కూడా అతడు చెక్కిన బొమ్మలు ప్రధానంగా తను వేటాడే జంతువులవీ, లేదా చేపలవీ. మనుషుల శిల్పాల్లో స్త్రీలవి మాత్రమే కనిపిస్తాయి. ఎందుకో అవి చాలా మోటుగా ఉంటాయి. ఆ శిల్పంలో ఆడమనిషి పెద్ద బొజ్జ, పెద్ద పిరుదులు, పెద్దగా సాగిన పాలిండ్లతో విడ్డూరంగా కనిపిస్తుంది. కానీ మన పురాతన సాహిత్యం గుర్తుకు తెచ్చుకుంటే, అందులో బిందెల వంటి పాలిండ్లనూ, ఇసుకతిన్నెలవంటి పిరుదులనూ మాతృత్వానికి చిహ్నాలుగా వర్ణించడం మనకు తెలుసు. అలాగే ఉదరం పెద్దదిగా ఉండడం చూలుకు సంకేతం. ఇదే తరహా ఆలోచనలు క్రోమాన్యాన్ మానవునికి ఉండే వుంటే, ఆ శిల్పాలు సంతానోత్పత్తి సంబంధమైన తాంత్రిక సాధనాలుగా తయారుజేసుకున్నాడని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. అనాది కాలంలో జన సంఖ్య మరీ పలుచన. ఖండాలన్నీ కలిపినా బహుశా 50 లక్షల జనాభాకు మించకపోవచ్చు. కాబట్టి, అప్పటివాళ్ళను అమితంగా వేధించిన కోరిక ‘సంతానం’. అందుకే పురాతన సంస్కృతుల్లో దేన్ని చూసినా, వాటిల్లో సంతానోత్పత్తికున్నంత ప్రాముఖ్యత మరి ఏ అంశానికీ కనిపించదు. ఒకరిద్దరు బిడ్డలకే పరిమితమైన తల్లి పాతకాలంలో ‘వంధ్య’కిందే - అంటే గొడ్రాలికిందే జమ. ఒకే బిడ్డుండే తల్లిని ‘కదళీ వంధ్య’ అనేవాళ్ళు. కదళి అంటే అరటిచెట్టు. అది వేసేది ఒకే గెల. అలాగే ఇద్దరు బిడ్డలే ఉన్న తల్లి ‘కాక వంధ్య’. అంటే, రెండు గుడ్లు పెట్టి, రెండే పిల్లలుజేసే కాకికి సమానమని. బైబిల్ దీవించినా, వేదం దీవించినా - వందల సంఖ్యలో సంతానాన్ని కనమనేదే అత్యున్నతమైన ఆశీర్వాదం. క్రోమాన్యాన్ శిల్పసంపదలో ఏనుగుదంతంతో చెక్కిన అమ్మాయి తల ఒక చోటి దొరికింది. ఆమె తలవెంట్రుకలు జడలుజడలుగా అల్లివుండటం గమనిస్తే, స్త్రీలల్లో అలంకారపోషణ ప్రారంభమైనట్టు అర్థమౌతుంది. మరో గుహలో ఆభరణంగా అలంకరించుకునేందుకు పనికొచ్చేలా బెజ్జం చేసిన గవ్వలు కనిపించాయి. జుత్తును జడగా అల్లాలంటే వెంట్రుకలు దువ్వుకోవాలి. కానీ, క్రోమాన్యాన్ పరికరాల్లో దువ్వెనలు కనిపించలేదు. బహుశా చెక్క దువ్వెనలు వాడుకలో ఉండేవుండచ్చు. ముప్ఫై నలబై సంవత్సరాల కిందటి దాకా మన గ్రామసీమల్లో చెక్కదువ్వెనలే వాడేవాళ్ళు. (సశేషం) రచయిత ఫోన్: 9440280655; email: mvrr44@gmail.com -
మొగసాల
టూకీగా ప్రపంచ చరిత్ర - 7 వెల్లువెత్తిన నదులు ఒండ్రుమట్టినీ, చెట్టూ చేమనూ, జంతు కళేబరాలనూ సముద్రానికి మోసుకెళ్ళడం ఇప్పటికీ మనం చూస్తున్నాం. అలాంటి సరుకంతా నింపాదిగా సముద్రం అడుగున కల్మషంగా పేరుకుని పూడుగా ఏర్పడుతుంది. పైనుండే నీటి ఒత్తిడికి అది అణిగి అణిగి, గట్టి పొరగా కుదించుకుని, చివరకు రాతిపొరగా మారిపోతుంది. అందులో ఇరుక్కున్న చెట్టూచేమా జంతుకళేబరాల వంటి సేంద్రియ పదార్థాలు కూడా ఆ శిలలో ఒదిగిపోయి, తమ ఆనవాళ్ళను శాశ్వతంగా నిలుపుకుంటాయి. తడవతడవకూ అలా కొట్టుకొచ్చిన పదార్థాలతో సముద్రం అడుగు పొరలు పొరలుగా నిర్మాణమౌతుంది. వాటిల్లో అన్నిటికంటే ప్రాచీనమైనది అట్టడుగుపొర కాగా, ఎగువకు జరిగేకొద్దీ వాటి వయస్సు తగ్గుతుంది. అదే విధంగా గాలికి కొట్టుకొచ్చే దుమ్మూ ధూళీ, అగ్నిపర్వతాల బూడిదా, నదులు ముంచెత్తినప్పుడు పేరుకుపోయే మేటలూ తదితర పదార్థాలతో భూమిమీద కూడా నేలలో పొరలు ఏర్పడుతుంటాయి. పొరలంటే ఇవి చీరమడతలంత తేలిగ్గా విడదీసేందుకు వీలయ్యేవిగావు. అట్టగట్టుకుపోయి అనేక సందర్భాల్లో వేరువేరుగా గుర్తించేందుకే అనుమతించనంతగా అతుక్కుపోయిన శిలాఖండాలు. భూకంపం వంటి ప్రకృతి వైపరీత్యాలవల్ల కొన్ని చోట్ల అవి తునాతునకలై, తలకిందులై, వాటిల్లో కొన్ని శిలాఖండాలు ఉపరితలానికి చేరుకోనుంటాయి. అందువల్ల, వాటి కాలాన్ని గుర్తించేందుకు రసాయనిక పరీక్షలు మనకున్న ఏకైకమార్గం. నేల పొరల కాలాన్ని లేదా వయస్సును తెలుసుకునేందుకు ఇప్పుడు అవలంబిస్తున్న పద్ధతిని ‘కార్బన్ డేటింగ్’ అంటారు. అదేమిటో తెలుసుకోవాలంటే ముందుగా మనకు ‘రేడియో యాక్టివ్’ మూలకాల గురించి కొద్దిగా తెలిసుండాలి. అవి చీకట్లో సైతం కనిపిస్తాయన్నంత మేరకు ఇదివరకే మనకు తెలుసు. చీకట్లో సమయాన్ని తెలుసుకునేందుకు అంకెల మీద రేడియం పూసిన గడియారాలు యాభై సంవత్సరాలకు పూర్వం మనదేశంలో పెద్ద సంచలనం. కొంతకాలానికి ఆ పూత నల్లగా మారి చూసేందుకు చీదరగా ఉండడంతో క్రమేణా వాటికి ఆదరణ తగ్గింది. అలా నల్లబడేందుకు కారణం అందులోని రేడియో యాక్టివ్ అణువులకుండే చంచల స్వభావం. అంకెల మీద పూసిన రేడియం కాలం గడిచేకొద్దీ సీసంగా పరివర్తన చెందడంతో అక్కడా ఇక్కడా నల్లమచ్చలు మొదలవుతాయి. ఇదివరకు అణువును గురించి మాట్లాడుకునే సందర్భంలో, దాని గర్భంలో ప్రొటాన్లూ, ఎలెక్ట్రాన్లూ ఉంటాయనుకున్నాం. అంతేగాకుండా, అణుకేంద్రంలో ప్రొటాన్లతోపాటు ‘న్యూట్రాన్లు’ కూడా ఉంటాయని తెలుసుకునే అగత్యం ఇప్పుడు ఏర్పడింది. ఈ రేణువులకు విద్యుత్ స్వభావం లేకపోవడంతో వీటిని ‘న్యూట్రాన్లు’ - అంటే ‘తటస్థమైనవి’ - అన్నారు. వీటి ఉనికివల్లా, సంఖ్యవల్లా అణువుకు భారం పెరుగుతుందే తప్ప గుణం మారదు. రేడియో యాక్టివ్ మూలకాలు ఈ మూడురకాల రేణువులనూ - అంటే, ప్రొటాన్లలనూ ఎలెక్ట్రాన్లనూ న్యూట్రన్లనూ - నిరంతరం విడుదల చేసుకుంటూ అణుభారాన్నీ, సంఖ్యనూ తగ్గించుకుంటూ, తన్మూలంగా లక్షణాలను మార్చుకుంటూ, కొంతకాలానికి మరో పదార్థంగా ఏర్పడుతుంటాయి. ఆవిధంగా విడుదలయ్యే రేణువులే మనకు కాంతి కిరణాలుగా కనిపిస్తాయి. అణుభారాన్నీ స్వభావాన్నీ కోల్పోతూ, మరో నిలకడ కలిగిన పదార్థంగా సంపూర్ణ పరివర్తన చెందేందుకు రేడియో యాక్టివ్ మూలకం తీసుకునే సమయం దాని ఆయుర్ధాయం. ఆ ఆయుర్ధాయం అన్ని రేడియో యాక్టివ్ పదార్థాలకూ ఒకేలా ఉండదు. ‘ప్రొయాక్టినమ్’ అనే పదార్థం బతికుండేది నాలుగే నాలుగు నిమిషాలు కాగా, ‘యురేనియం 238’ ఆయుర్ధాయం తొమ్మిది వందల కోట్ల సంవత్సరాలు. ఏదైనా రేడియో యాక్టివ్ పదార్థం వయసును అంచనావేసేందుకు దాని ‘సగ ఆయుర్ధాయం’ ప్రామాణికంగా తీసుకుంటారు. పూర్తి ఆయుర్ధాయాన్ని తీసుకుంటే ఒక ఇబ్బంది ఎదురవుతున్న కారణంగా అంచనాల కోసం శాస్త్రజ్ఞులు సగం ఆయుర్ధాయాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అంతా సీసంగా మారిన ఒక మూలకం దశను ఉదాహరణగా తీసుకుంటే, ఆ సీసం రేడియో యాక్టివ్ పరివర్తన మూలంగా ఏర్పడిందో, కాక స్వతఃసిద్ధమైందో తెలుసుకునే ఉపాయం మనకు లేదు. ఆయుస్సు పూర్తిగా ముగియకముందైతేనే అది పరివర్తన జనితమని తెలిసొచ్చేది. సగం ఆయుర్దాయాన్నే ప్రామాణికంగా స్వీకరించడంలో దాగుండే రహస్యం ఇదే. ఇలా నేలపొరల్లో దొరికే ఈ పదార్థాల ఆయుర్ధాయం ఆధారంగా ఆయా పొరల వయసును తెలుసుకునే అవకాశం మనకు కలిగింది. ప్రొటాన్లనూ ఎలెక్ట్రాన్లనూ అట్టిపెట్టుకుని, న్యూట్రాన్లను మాత్రమే విడుదల చేసే పదార్థాలు కూడా ప్రకృతిలో ఉన్నాయి కొన్ని. వాటిని ‘ఐసోటోప్స్’గా గుర్తిస్తారు. ఈ తరహా అణువుల్లో న్యూట్రాన్ల సంఖ్య ప్రొటాన్ల నిష్పత్తిని మించడంతో పదార్థ లక్షణం మారకపోయినా, సహజమైన పదార్థం కంటే అణుభారం అధికంగా ఉంటుంది. ఆ భారమైన న్యూట్రాన్లను ఒక్కటొక్కటిగా వదిలేస్తూ ఆ అణువు క్రమంగా సాధారణ మూలకంగా మారేందుకు ప్రయత్నిస్తుంది. ఇలాంటి పదార్థాల వయసును కూడా ‘ఆర్ధాయుస్సు’ పద్ధతిలోనే లెక్కిస్తారు. ఆ సంబంధమైన మూలకాల్లో, విస్తారంగా నేల పొరల్లో లభ్యమయ్యే పదార్ధం ‘రేడియో యాక్టివ్ కార్బన్ (14)’. పొరల వయసును తెలుసుకునేందుకు ఇప్పుడు ప్రధానంగా ఉపయోగపడుతున్నది ఈ రేడియో యాక్టివ్ కార్బనే. దీని అర్దాయువు 5720 సంవత్సరాలే కావడం వల్ల, పొరల వయసును లక్షల సంవత్సరాల బారు (రేంజి)లో కాకుండా చిన్న చిన్న కాలమానాలుగా విభజించుకునే వీలు కలిగింది. రచన: ఎం.వి.రమణారెడ్డి ఆయుర్ధాయం అన్ని రేడియో యాక్టివ్ పదార్థాలకూ ఒకేలా ఉండదు. ‘ప్రొయాక్టినమ్’అనే పదార్థం బతికుండేది నాలుగే నాలుగు నిమిషాలు కాగా, ‘యురేనియం 238’ ఆయుర్ధాయం తొమ్మిది వందల కోట్ల సంవత్సరాలు.