టూకీగా ప్రపంచ చరిత్ర -28
వెనుక తరాలు
రచన: ఎం.వి.రమణారెడ్డి
హార్మోన్ల ప్రేరణ కేవలం జీవి శరీరానికి మాత్రమే పరిమితం గాదు; అవి మెదడును గూడా ప్రచండంగా శాసిస్తాయి. వాటి ప్రోద్బలంతో మెదడు పూనుకునే చర్యలను ‘ఇన్‌స్టింక్ట్స్’ లేదా ‘ఉద్రేకాలు’ అంటారు. ఎదగని మెదడుండే జీవులన్నిట్లో దినచర్యలన్నీ దాదాపుగా ఉద్రేకాల ప్రేరణతోనే నడుస్తుంది. బురద కనిపిస్తే అందులో దిగకుండా ఏదేశానికి చెందిన వరాహమైనా నిగ్రహించుకోలేదు; ఎర్రటి బట్ట కళ్ళముందు పారాడితే కుమ్మకుండా ఏ దేశం ఆబోతైనా మానుకోలేదు; పరిచయంలేని పుంజు ఎదురైతే పోరాడకుండా ఏదేశం కోడిపుంజైనా తప్పుకోలేదు.
మనిషిలో ఈ ఉద్రేకాల ప్రభావం ఏ ఇతర జంతువుకూ తీసిపోదు. అందునా, ప్రపంచజ్ఞానాన్ని అప్పుడప్పుడే సంతరించుకుంటున్న ఆదిమ దశ మానవుని ప్రవర్తన ఆధారపడేది ఆలోచనమీదికంటే ఉద్రేకం మీదే ప్రధానంగా ఉండడం తప్పనిసరి. ఆకలిదప్పులూ, ఆవేశకావేశాలూ, సంతోష దుఃఖాలూ, భయభ్రాంతుల వంటి వైకల్యాలకు మల్లే ప్రబలమైన వాంఛ గూడా ఒక ఉద్రేకమేనని మన అనుభవమే చెబుతుంది. అలాంటి సందర్భాల్లో ‘హార్మోన్లు’ అనే రసాయనిక పదార్థాలు రక్తంలో విజృంభించి మెదడును ప్రేరేపిస్తాయి. ఫలితంగా, అవయవాలను తత్సంబంధిత చర్యలకు మెదడు పురికొల్పుతుంది. నాగరికులైన మనుషుల్లోగూడా అలాంటి ప్రేరణ ఉంటుంది గానీ, వెంటనే మేధస్సు పైచేయి సాధించి ఉద్రేకాన్ని అదుపులోకి తీసుకుంటుంది. ఒకే రకమైన భౌతిక పరిస్థితుల్లో కలిగే సమాంతరమైన ఉద్రేకాల్లో హార్లోన్ల ప్రేరణ ఎలావుంటుందంటే - కూతకూసే ప్రాయానికొచ్చిన కోడి పుంజును చూస్తే మనకే అర్థమౌతుంది.
అది పెట్టకు తన కోరికను తెలియజేసే సందర్భంలో కొద్దిగా ఎడమకు వంగి, ఎడమ రెక్కను నేలమీదికి పరిచి, పంగకాళ్ళతో పక్కపక్కలకు అడుగులేస్తూ పెట్టమీదికి వంగి గిల్లుకుంటుంది. ఈ విషయంలో మన పెరటికోడి ప్రవర్తన ఎలావుంటుందో వాషింగ్టన్ డి.సి. హాచరీలో వుండే పుంజుది కూడా కచ్చితంగా అలాగే ఉంటుంది. కారణం - ఇది హార్మోన్ల ప్రేరణ వల్ల సంభవించే ప్రవర్తనే తప్ప, మరో కోడి నుండి నేర్చుకున్నది కాదుగాబట్టి. ఆ విధంగానే, ఆదిమ మానవుని చిత్రకళ కూడా ‘ఉద్రేక’జనితమే తప్ప, ఒకరి నుండి ఒకరికి విస్తరించిన నమ్మకం కాదు.
చిత్రకళలోనే కాదు, శిల్పాలు చెక్కడంలోనూ అతనికి ప్రావీణ్యత అబ్బింది. ఏనుగు దంతాల మీదా, ఎముకల మీదా, దుప్పి కొమ్ములమీదా చెక్కిన శిల్పాలు కళ పట్ల అతనికుండే ఆసక్తిని వెల్లడిస్తాయి. అయితే, వాటిమీద కూడా అతడు చెక్కిన బొమ్మలు ప్రధానంగా తను వేటాడే జంతువులవీ, లేదా చేపలవీ. మనుషుల శిల్పాల్లో స్త్రీలవి మాత్రమే కనిపిస్తాయి. ఎందుకో అవి చాలా మోటుగా ఉంటాయి. ఆ శిల్పంలో ఆడమనిషి పెద్ద బొజ్జ, పెద్ద పిరుదులు, పెద్దగా సాగిన పాలిండ్లతో విడ్డూరంగా కనిపిస్తుంది. కానీ మన పురాతన సాహిత్యం గుర్తుకు తెచ్చుకుంటే, అందులో బిందెల వంటి పాలిండ్లనూ, ఇసుకతిన్నెలవంటి పిరుదులనూ మాతృత్వానికి చిహ్నాలుగా వర్ణించడం మనకు తెలుసు. అలాగే ఉదరం పెద్దదిగా ఉండడం చూలుకు సంకేతం.
ఇదే తరహా ఆలోచనలు క్రోమాన్యాన్ మానవునికి ఉండే వుంటే, ఆ శిల్పాలు సంతానోత్పత్తి సంబంధమైన తాంత్రిక సాధనాలుగా తయారుజేసుకున్నాడని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. అనాది కాలంలో జన సంఖ్య మరీ పలుచన. ఖండాలన్నీ కలిపినా బహుశా 50 లక్షల జనాభాకు మించకపోవచ్చు. కాబట్టి, అప్పటివాళ్ళను అమితంగా వేధించిన కోరిక ‘సంతానం’. అందుకే పురాతన సంస్కృతుల్లో దేన్ని చూసినా, వాటిల్లో సంతానోత్పత్తికున్నంత ప్రాముఖ్యత మరి ఏ అంశానికీ కనిపించదు. ఒకరిద్దరు బిడ్డలకే పరిమితమైన తల్లి పాతకాలంలో ‘వంధ్య’కిందే - అంటే గొడ్రాలికిందే జమ. ఒకే బిడ్డుండే తల్లిని ‘కదళీ వంధ్య’ అనేవాళ్ళు. కదళి అంటే అరటిచెట్టు. అది వేసేది ఒకే గెల. అలాగే ఇద్దరు బిడ్డలే ఉన్న తల్లి ‘కాక వంధ్య’. అంటే, రెండు గుడ్లు పెట్టి, రెండే పిల్లలుజేసే కాకికి సమానమని. బైబిల్ దీవించినా, వేదం దీవించినా - వందల సంఖ్యలో సంతానాన్ని కనమనేదే అత్యున్నతమైన ఆశీర్వాదం.
క్రోమాన్యాన్ శిల్పసంపదలో ఏనుగుదంతంతో చెక్కిన అమ్మాయి తల ఒక చోటి దొరికింది. ఆమె తలవెంట్రుకలు జడలుజడలుగా అల్లివుండటం గమనిస్తే, స్త్రీలల్లో అలంకారపోషణ ప్రారంభమైనట్టు అర్థమౌతుంది. మరో గుహలో ఆభరణంగా అలంకరించుకునేందుకు పనికొచ్చేలా బెజ్జం చేసిన గవ్వలు కనిపించాయి. జుత్తును జడగా అల్లాలంటే వెంట్రుకలు దువ్వుకోవాలి. కానీ, క్రోమాన్యాన్ పరికరాల్లో దువ్వెనలు కనిపించలేదు. బహుశా చెక్క దువ్వెనలు వాడుకలో ఉండేవుండచ్చు. ముప్ఫై నలబై సంవత్సరాల కిందటి దాకా మన గ్రామసీమల్లో చెక్కదువ్వెనలే వాడేవాళ్ళు.
(సశేషం)
రచయిత ఫోన్: 9440280655; email: mvrr44@gmail.com