టూకీగా ప్రపంచ చరిత్ర - 65 | MV Ramanaa Reddy story | Sakshi
Sakshi News home page

టూకీగా ప్రపంచ చరిత్ర - 65

Published Thu, Mar 19 2015 12:16 AM | Last Updated on Sat, Sep 2 2017 11:02 PM

MV Ramanaa Reddy story

ఆచారాలు-నమ్మకాలు
అతని గుహాచిత్రాల విషయానికొస్తే - రాతియుగం చివరి దశకి చెందిన చిత్రాల్లో గూడా కేవలం తనకు ఇష్టమైన వేట జంతువులే కనిపిస్తాయి తప్ప, చెట్లూ గుట్టలూ, కొండలూ వాగులూ, సూర్యుడూ చంద్రుడూ వంటి చిత్రీకరణ కనిపించదు. కనీసం తనకు భయాన్ని కలిగించే క్రూర జంతువుల బొమ్మలైనా కనిపించవు. చెట్లూ గుట్టలవంటి జడ పదార్థాలుగానీ, సూర్యుడూ చంద్రుడూ వంటి ప్రకృతి శక్తులు గానీ అతనికి సర్వసాధారణమైన దృశ్యాలే తప్ప, తన ప్రయోజనానికి ఏ మాత్రం పనికొచ్చేవి కావని అతని భావన. అతని కుండేది కడుపు నింపుకోవాలనే ఆశ, తనను తాను కాపాడుకునే ఉపాయం.

గుహల చీకట్లలో బొమ్మ వేస్తే, అలాంటి జంతువు తనకు వేటగా దొరుకుతుందని అతడి నమ్మకం. నమ్మకానికి హేతువుతో నిమిత్తం లేదు; తను ఆశించిన ఫలితానికీ సంప్రాప్తించిన ఫలితానికీ పొంతన ఉందో లేదో విశ్లేషించుకోవడం అతనికి చేతగాదు. వీటిని బట్టి మనకు తెలిసేది పునాది దశలో ఆచారమూ నమ్మకమూ వేరు వేరని. ఆచారానికి పూనాది ఆత్మీయత; నమ్మకానికి పునాది ఆశ. కాలక్రమేణా ఆశతో ‘భయం’ జతగట్టి, నమ్మకమనేది ఆశలూ భయాల సమ్మేళనంగా రూపొందింది.
 
నమ్మకానికి హేతువుతో నిమిత్తం లేదు; తను ఆశించిన ఫలితానికీ సంప్రాప్తించిన ఫలితానికీ పొంతన ఉందో లేదో విశ్లేషించుకోవడం అతనికి చేతగాదు. వీటిని బట్టి మనకు తెలిసేది పునాది దశలో ఆచారమూ నమ్మకమూ వేరు వేరని. ఆచారానికి పూనాది ఆత్మీయత; నమ్మకానికి పునాది ఆశ.

‘భయం’ అనేది ఎప్పుడు పుట్టుకొచ్చింది? పాత రాతియుగం మానవునికి భయమనేది లేదా? - ఎందుకులేదు; తప్పకుండా ఉంది. ఒకసారి వలను తప్పించుకున్న పిట్టలు మరోసారి ఆ ప్రదేశంలో వాలవు. ఒకసారి ఉచ్చులు తప్పించుకున్న జంతువు తిరిగి ఆ తావుకు వెళ్ళక తప్పనప్పుడు జంకుతుంది. బెదురు అనేది పక్షుల్లో, పశువుల్లోనే తెలుస్తూంటే, మరి మనిషికి అది ఉండదని ఎలా అనుకోగలం? జోగాడే పాప మెట్లమీదికి చకచకా పాకిపోతుంది. దిగే వాటం తెలిసిందాకా దిగటానికి జింక కెవ్వున ఏడుస్తుంది.

మేధోపరంగా పక్షులూ, పశువులూ, పసికూనల కంటే ఎదిగిన ఆ మానవునికి భయం ఎందుకుండదు? క్రూరజంతువులంటే భయం; పాము కాటేస్తుందని భయం; అలవిగానంత పెద్దదిగావుండే ఏనుగు నలగదొక్కుతుందనే భయం - ఇలాంటి ఎన్నెనో భయాలు ఉండేవుంటాయి. కానీ, భయానికి కారణమైన జంతువులేవీ అతని చిత్రాల్లో కనిపించవు. అలాంటి ప్రమాదాలు తనకు ఎదురవ్వాలని అతని కోరిక కాకపోవడంతో చిత్రించేందుకు సమ్మతిపడి ఉండకపోవచ్చు; లేదా, చెట్టూ గుట్టలూ తదితర నిరుపయోగమైన దృశ్యాలకు మల్లే, ప్రమాదాలను గూడా సర్వసాధారణమైనవిగా భావించాడో ఏమో!
 
కాలక్రమేణా వేటాడే పరికరాల్లో నాణ్యత, వైవిధ్యం పెరిగింది. వేటాడే పద్ధతులూ, నైపుణ్యం పెరిగింది. పెద్దపెద్ద జంతువులను వేటాడే సమయంలో వేటగాళ్ళ గుంపుకు దిశానిర్దేశం ఇచ్చేందుకు తగినంత అనుభవం సంపాదించిన నాయకత్వం అవసరమయింది. మేధోసంపత్తిలో వ్యక్తికీ వ్యక్తికీ మధ్య పెద్దగా తారతమ్యం ఏర్పడని కాలంలో ఆ నాయకత్వం సహజంగా వయసులో పెద్దవాడైన వ్యక్తికి దక్కుతుంది. ఇంటాబయటా ఆ గుంపు కొన్ని కట్టుబాట్లతో నడుచుకునేలా అదుపు చేసే బాధ్యత కూడా అతని భుజానికే ఎత్తుంటారు. దానివల్ల, ఆ పెద్దమనిషి పట్ల ప్రత్యేకమైన గౌరవం ఏర్పడి వుండక తప్పదు.

అతనికి వేటలో పాల్గొనే శక్తి ఉడిగినా, సలహాలూ హెచ్చరికల రూపంలో అతని అనుభవం గుంపుకు ప్రయోజనకరంగా ఉన్నప్పుడు, అతని స్థానం ఎప్పటిలాగే కొనసాగక తప్పదు. భాషకు విస్తృతి పెరగడం వల్ల, అతని విశ్రాంతి సమయం పిల్లలకు వేట అనుభవాన్ని మాటల ద్వారానూ ఆటల ద్వారానూ నేర్పించే కాలక్షేపంతో, ఆ వృద్ధుడు గురువుగా పరిణమించాడు. పితామహుడు, నాయకుడు, గురువు స్థానాలన్నిటికీ ఒకడే కావటంతో, తదుపరి కాలంలో ఆ స్థానానికి ఒక హోదా ఏర్పడి ఉండాలి. అతనికి ఇవ్వవలసిన గౌరవ మర్యాదలు ఆచారాల పేరుకు రెండవ వాయి కూర్పుగా చేరుండాలి.
రచన: ఎం.వి.రమణారెడ్డి
రచయిత ఫోన్: 9440280655; email: mvrr44@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement