Rituals-beliefs
-
టూకీగా ప్రపంచ చరిత్ర 69
ఆచారాలు-నమ్మకాలు వైదికకర్మ ప్రాధాన్యతకు భిన్నంగా ‘భక్తి’ని సారాంశంగా మలుచుకున్న రచన భాగవతం. ఐనా, భాగవతంలో దేవతలకు ఆలయాలున్న విరివి కనిపించదు. క్రీ.పూ. 400 కాలానిదైన పాణిని వ్యాకరణం ద్వారా ‘వాసుదేవుని ఆరాధన’ ప్రజల్లో చొరబడినట్లు సూచనలగా తెలుస్తుంది. మౌర్య చంద్రగుప్తుని పాలనలో స్థానికసంస్థలు నిర్వహించే బాధ్యతల జాబితాలో దేవాలయాల నిర్వహణ కూడా ఒక అంశంగా ‘ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ’వారి హిందూదేశ చరిత్రలో మాటమాత్రంగా కనిపించడం మినహా, ఆ వంశం రాజులు దేవాలయాలు నిర్మించినట్టు ఆధారాలు లేవు. క్రీ.శ. 213లో ఇక్ష్వాకు వంశానికి (ఇది రామాయణ ఇక్ష్వాకువంశం కాదు) చెందిన ఎహువళ శాంతమూలుడు అనే రాజు కట్టించిన ‘పుష్కభద్రస్వామి’ దేవాలయం (నందికొండ, నల్గొండ జిల్లా) భారతదేశంలోనే మరో నాలుగు ఆలయాలు కూడా నిర్మాణమైనట్టు చరిత్రకు తెలుస్తూంది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి సమీపంలోని ‘గుడిమల్లం’ గ్రామానికి చెందిన శివాలయం భారతదేశానికి మొదటిదని మరికొందరి వాదన. ఇవి కాకపోతే మరొకటో మరొకటో మొట్టమొదటి దేవాలయంగా వెలుగుచూసే అవకాశం దక్షిణ భారతదేశానికే ఉంది. దానికి కారణాలు రెండు. పడమటి నాగరికతలతో సింధూనాగరికతకు బలిష్టమైన వ్యాపారసంబంధాలు చిరకాలంగా కనొసాగినా, తాత్విక సంప్రదాయాలను వాళ్ల నుండి అది స్వీకరించకపోవడం మొదటిది. ఆ తరువాతి కాలంలో విగ్రహారాధన ఇచ్చగించని ఆర్యసంప్రదాయం సింధూనది పొడవునా పటిష్టమైన కోటగోడగా నిలవడం రెండవది. అందువల్ల ఉత్తరభారతదేశంలో దేవాలయాల స్థాపనకు ఆస్కారం లేకుండా పోయింది. అటువంటి అవరోధం దక్కన్ (దక్షిణ) పీఠభూమికి లేదు. సముద్రమార్గంలో దక్కన్కు పడమటి వైపుండే మెసొపొటేమియాతోనూ, తూర్పు వైపుండే ఆగ్నేయ ఆసియాలోని ఇండోనేషియా, మలేషియా, థాండ్లాండ్, కాంబోడియా తదితర దేశాలతోనూ క్రీ.పూ. 1500 నాటి నుండే నిరవధికమైన వ్యాపార సంబంధాలు కొనసాగాయి. ద్రవిడ నాగరికత ఏ కారణంగానో మెసొపొటేమియా నుండి దేవాలయాల సంస్కృతిని స్వీకరించింది. ఆ సంస్కృతి దక్షిణభారతదేశంలో నెరుసుకున్న తరువాత ఉత్తర భారతదేశంలో క్రీ.శ. 12వ శతాబ్దం దాకా ఆలయనిర్మాణం జరిగిన దాఖలాలు చరిత్రకు దొరకలేదు. ఆగ్నేయ ఆసియాలోని థాయిలెండ్, కాంబోడియా వంటి దేశాల్లోని దేవాలయాలు దక్కన్లోని ఆలయాల నమూనాకు నకళ్లు మాత్రమే. ఇంతదాకా ప్రస్తావించిన నాగరికతలకు దూరంగా, వెలుపలిగా ఎదిగిన నాగరికత చైనాది. పడమటి సరిహద్దుగా దుర్గమమైన పర్వతాలూ, తూర్పున పసిఫిక్ మహాసముద్రాల అవరోధంవల్ల, ప్రాచీనకాలంలో ఆ దేశానికి ఇతర నాగరికతలతో సంబంధాలు పరిమితం. క్రీ.పూ. 3000 నాటికే, ‘పట్టుమార్గం’ (సిల్క్ రూట్) ద్వారా ఇతర ప్రదేశాలకు చైనా నుండి పట్టుబట్టల రవాణా జరిగేదని చరిత్రకు కొన్ని ఆధారాలున్నాయి. పట్టుబట్టలకు ‘చీనాంబరాలు’గా గుర్తింపు మన ప్రాచీన సాహిత్యంలోనూ కనిపిస్తుంది. రావాణా మార్గమంటూ ఏర్పడిన తరువాత ఎగుమతులూ ఉంటాయి, దిగుమతులూ ఉంటాయి. ఈ మార్గాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానం, సంస్కృతుల బదిలీలు జరుగుతాయి. ఐనా, చిత్రమేమిటంటే, ఇతర ప్రాచీనసంస్కృతుల్లోని ఏవొక్క దానితో ఏమాత్రం పోలికలేనిది చైనీయుల తాత్వికచింతన. రచన: ఎం.వి.రమణారెడ్డి -
టూకీగా ప్రపంచ చరిత్ర - 65
ఆచారాలు-నమ్మకాలు అతని గుహాచిత్రాల విషయానికొస్తే - రాతియుగం చివరి దశకి చెందిన చిత్రాల్లో గూడా కేవలం తనకు ఇష్టమైన వేట జంతువులే కనిపిస్తాయి తప్ప, చెట్లూ గుట్టలూ, కొండలూ వాగులూ, సూర్యుడూ చంద్రుడూ వంటి చిత్రీకరణ కనిపించదు. కనీసం తనకు భయాన్ని కలిగించే క్రూర జంతువుల బొమ్మలైనా కనిపించవు. చెట్లూ గుట్టలవంటి జడ పదార్థాలుగానీ, సూర్యుడూ చంద్రుడూ వంటి ప్రకృతి శక్తులు గానీ అతనికి సర్వసాధారణమైన దృశ్యాలే తప్ప, తన ప్రయోజనానికి ఏ మాత్రం పనికొచ్చేవి కావని అతని భావన. అతని కుండేది కడుపు నింపుకోవాలనే ఆశ, తనను తాను కాపాడుకునే ఉపాయం. గుహల చీకట్లలో బొమ్మ వేస్తే, అలాంటి జంతువు తనకు వేటగా దొరుకుతుందని అతడి నమ్మకం. నమ్మకానికి హేతువుతో నిమిత్తం లేదు; తను ఆశించిన ఫలితానికీ సంప్రాప్తించిన ఫలితానికీ పొంతన ఉందో లేదో విశ్లేషించుకోవడం అతనికి చేతగాదు. వీటిని బట్టి మనకు తెలిసేది పునాది దశలో ఆచారమూ నమ్మకమూ వేరు వేరని. ఆచారానికి పూనాది ఆత్మీయత; నమ్మకానికి పునాది ఆశ. కాలక్రమేణా ఆశతో ‘భయం’ జతగట్టి, నమ్మకమనేది ఆశలూ భయాల సమ్మేళనంగా రూపొందింది. నమ్మకానికి హేతువుతో నిమిత్తం లేదు; తను ఆశించిన ఫలితానికీ సంప్రాప్తించిన ఫలితానికీ పొంతన ఉందో లేదో విశ్లేషించుకోవడం అతనికి చేతగాదు. వీటిని బట్టి మనకు తెలిసేది పునాది దశలో ఆచారమూ నమ్మకమూ వేరు వేరని. ఆచారానికి పూనాది ఆత్మీయత; నమ్మకానికి పునాది ఆశ. ‘భయం’ అనేది ఎప్పుడు పుట్టుకొచ్చింది? పాత రాతియుగం మానవునికి భయమనేది లేదా? - ఎందుకులేదు; తప్పకుండా ఉంది. ఒకసారి వలను తప్పించుకున్న పిట్టలు మరోసారి ఆ ప్రదేశంలో వాలవు. ఒకసారి ఉచ్చులు తప్పించుకున్న జంతువు తిరిగి ఆ తావుకు వెళ్ళక తప్పనప్పుడు జంకుతుంది. బెదురు అనేది పక్షుల్లో, పశువుల్లోనే తెలుస్తూంటే, మరి మనిషికి అది ఉండదని ఎలా అనుకోగలం? జోగాడే పాప మెట్లమీదికి చకచకా పాకిపోతుంది. దిగే వాటం తెలిసిందాకా దిగటానికి జింక కెవ్వున ఏడుస్తుంది. మేధోపరంగా పక్షులూ, పశువులూ, పసికూనల కంటే ఎదిగిన ఆ మానవునికి భయం ఎందుకుండదు? క్రూరజంతువులంటే భయం; పాము కాటేస్తుందని భయం; అలవిగానంత పెద్దదిగావుండే ఏనుగు నలగదొక్కుతుందనే భయం - ఇలాంటి ఎన్నెనో భయాలు ఉండేవుంటాయి. కానీ, భయానికి కారణమైన జంతువులేవీ అతని చిత్రాల్లో కనిపించవు. అలాంటి ప్రమాదాలు తనకు ఎదురవ్వాలని అతని కోరిక కాకపోవడంతో చిత్రించేందుకు సమ్మతిపడి ఉండకపోవచ్చు; లేదా, చెట్టూ గుట్టలూ తదితర నిరుపయోగమైన దృశ్యాలకు మల్లే, ప్రమాదాలను గూడా సర్వసాధారణమైనవిగా భావించాడో ఏమో! కాలక్రమేణా వేటాడే పరికరాల్లో నాణ్యత, వైవిధ్యం పెరిగింది. వేటాడే పద్ధతులూ, నైపుణ్యం పెరిగింది. పెద్దపెద్ద జంతువులను వేటాడే సమయంలో వేటగాళ్ళ గుంపుకు దిశానిర్దేశం ఇచ్చేందుకు తగినంత అనుభవం సంపాదించిన నాయకత్వం అవసరమయింది. మేధోసంపత్తిలో వ్యక్తికీ వ్యక్తికీ మధ్య పెద్దగా తారతమ్యం ఏర్పడని కాలంలో ఆ నాయకత్వం సహజంగా వయసులో పెద్దవాడైన వ్యక్తికి దక్కుతుంది. ఇంటాబయటా ఆ గుంపు కొన్ని కట్టుబాట్లతో నడుచుకునేలా అదుపు చేసే బాధ్యత కూడా అతని భుజానికే ఎత్తుంటారు. దానివల్ల, ఆ పెద్దమనిషి పట్ల ప్రత్యేకమైన గౌరవం ఏర్పడి వుండక తప్పదు. అతనికి వేటలో పాల్గొనే శక్తి ఉడిగినా, సలహాలూ హెచ్చరికల రూపంలో అతని అనుభవం గుంపుకు ప్రయోజనకరంగా ఉన్నప్పుడు, అతని స్థానం ఎప్పటిలాగే కొనసాగక తప్పదు. భాషకు విస్తృతి పెరగడం వల్ల, అతని విశ్రాంతి సమయం పిల్లలకు వేట అనుభవాన్ని మాటల ద్వారానూ ఆటల ద్వారానూ నేర్పించే కాలక్షేపంతో, ఆ వృద్ధుడు గురువుగా పరిణమించాడు. పితామహుడు, నాయకుడు, గురువు స్థానాలన్నిటికీ ఒకడే కావటంతో, తదుపరి కాలంలో ఆ స్థానానికి ఒక హోదా ఏర్పడి ఉండాలి. అతనికి ఇవ్వవలసిన గౌరవ మర్యాదలు ఆచారాల పేరుకు రెండవ వాయి కూర్పుగా చేరుండాలి. రచన: ఎం.వి.రమణారెడ్డి రచయిత ఫోన్: 9440280655; email: mvrr44@gmail.com -
టూకీగా ప్రపంచ చరిత్ర - 64
ఆచారాలు-నమ్మకాలు ‘శవసంస్కారం’ ప్రధానంగా మూడు పద్ధతుల్లో కనిపిస్తుంది. మొదటిది శవాన్ని చెట్టుమీదికి చేర్చడం. మహాభారతం విరాటపర్వంలోని ‘శమీవృక్ష సంఘటన’ ద్వారా ఇలాంటి పద్ధతి ఒకటుండేదని మనకు తెలుస్తుంది. టిబెట్-నేపాల్ సరిహద్దుల్లో ఇప్పటికీ ఈ పద్ధతి కొనసాగుతుందని వినికిడి. నేలను తవ్వేందుకు తగిన సాధనాలు లేకనో, తవ్వకానికి ఆ నేల అనుకూలించకనో ఈ ఆచారం ఏర్పడి వుండొచ్చు. రెండవది, ఆర్య సంతతి అనుసరించే శవదహనం. లోతైన గోతిని తొలిచే అవకాశం లేక, లోతు తక్కువైన గోతిలో పాతిపెడితే, పై మట్టిని కుక్కలూ నక్కలూ తేలిగ్గా తొలగించి, శవాన్ని పూర్తిగానో ముక్కలుముక్కలుగానో ఎత్తుకొచ్చి కొరుకుతున్న బీభత్సానికి తీవ్రమైన ప్రతీకారంగా శవాన్ని దహించటానికి చేసుకున్న నిర్ణయంతో ఈ పద్ధతి ఉనికిలోకి వచ్చి వుండొచ్చు. ఇక మూడవది, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక జనాభా అనుసరించే శవఖననం. అంటే, నక్కల వంటి జంతువులకు తోడే ఆస్కారం లేనంత లోతుగా శవాన్ని పాతిపెట్టడం. ఆచారం వేరు, నమ్మకం వేరు; దాని పునాది వేరు, దీని పునాది వేరు. వంశపారంపర్యంగా అనసరించేది ఆచారం. ఇది ఎన్నోతరాల పరంపరగా, వ్యక్తిగత వైరుధ్యాలకు పెద్దగా చోటివ్వకుండా కొనసాగే చర్యల సమ్మేళనం. సమ్మకం లేదా విశ్వాసం అనేది సంపూర్ణంగా వ్యక్తిగతమైన వ్యవహారం. ఒకే కుటుంబంలోని సభ్యులందరివల్ల ఆచారాలు ఒకే రకంగా పాటించబడొచ్చుగానీ, నమ్మకాలు మాత్రం వేరు వేరుగా ఉండగలవు. ‘శవసంస్కారం’లో పై మూడు పద్ధతులే కాక, మరో విచిత్రమైన పద్ధతి కూడా భారతదేశంలో కనిపిస్తుంది. ఇది అతి తక్కువ సంఖ్యాకులైన పారసీలు లేదా పారసీకులు ఇప్పటికీ ఆచరిస్తున్న పద్ధతి. వీళ్ళు పూనా, బొంబాయి నగరాల్లోనూ, వాటి పరిససరాల్లోనూ నివసిస్తున్నారు. ప్రార్థనా సంబంధమైన కార్యక్రమాల్లో వాళ్ళు ఉచ్చరించే మంత్రాలు అవెస్టాలోనికి కావడం వల్ల, వీళ్ళను ఒకనాటి జొరాస్ట్రియన్లుగా భావించొచ్చు. శవాన్ని ఎత్తై భవనం పైకప్పుకు చేర్చి, దాన్ని రాబందులకు ఆహారం అయ్యేలు వదిలెయ్యడం వీళ్ళ ఆచారం. చనిపోయిన తరువాత గూడా తన శరీరం ఏదోవొక ప్రాణికి ఉపయోగపడాలన్న సంకల్పం ఇందులో కనిపిస్తుంది. తీవ్రమైన ప్రతీకార ధోరణిగా కనిపించే ఆర్యుల ‘దహన’ పద్ధతికి సంపూర్ణమైన విరుద్ధదృవంగా కనిపించేది పారసీల పద్ధతి. మొత్తంమీద, పద్ధతి ఏదైనా, శవసంస్కారమనే ఆచారం మూలంగా మానవుడు జంతువు నుండి సంపూర్ణంగా వేరుపడి, తన స్థాయిని ఎన్నో అంతస్తులు పెంచుకున్నాడు. ఆచారం వేరు, నమ్మకం వేరు; దాని పునాది వేరు, దీని పునాది వేరు. వంశపారంపర్యంగా అనుసరించేది ఆచారం. ఇది ఎన్నోతరాల పరంపరగా, వ్యక్తిగత వైరుధ్యాలకు పెద్దగా చోటివ్వకుండా కొనసాగే చర్యల సమ్మేళనం. సమ్మకం లేదా విశ్వాసం అనేది సంపూర్ణంగా వ్యక్తిగతమైన వ్యవహారం. ఒకే కుటుంబంలోని సభ్యులందరివల్ల ఆచారాలు ఒకే రకంగా పాటించబడొచ్చుగానీ, నమ్మకాలు మాత్రం వేరు వేరుగా ఉండగలవు. ఆచారాలూ నమ్మకాలూ కలగాపులగంగా పెన వేసుకున్న దశలో జీవిస్తున్న మనకు వాటిలో ఒకదాన్నుండి మరొకదాన్ని విడదీయడం సులభం కాకపోయినా, చరిత్రలో మానవుని తొలిమెట్టుకు వెనుదిరిగితే వాటి విడివిడి పునాదులు స్పష్టంగా గోచరిస్తాయి. గరిష్టమైన స్థాయికి ఎదిగిన మెదడుకన్నా, దాని సామర్థ్యాన్ని సంపూర్ణంగా వినియోగించుకునే అవసరం ఆ మానవునికి కలుగలేదు. ‘ఇదిగో జింక - దీన్ని పడగొట్టడం ఎలా ? అదిగో ఉడుత - దాన్ని పట్టుకోవడం ఎలా?’ వంటి తక్షణ ప్రయోజనాలూ, ‘అది కీకారణ్యం. అందులో క్రూరమృగాలుండొచ్చు; ఇది చిక్కటి పొద. ఇందులో పాము దాక్కోనుండొచ్చు’ వంటి జాగ్రత్తలకు మాత్రమే అతని ఆలోచన పరిమితం. ఐనా, అతనికి జ్ఞాపకాలూ, కలలూ ఉండేవని అతడు ఆచరించిన శవసంస్కారం, అతడు వేసిన గుహాచిత్రాలు నిరూపిస్తున్నాయి. రచన: ఎం.వి.రమణారెడ్డి రచయిత ఫోన్: 9440280655; email: mvrr44@gmail.com -
టూకీగా ప్రపంచ చరిత్ర - 63
ఆచారాలు-నమ్మకాలు సింహం కలలోకొచ్చిన ఏనుగు, తిరిగి మెలకువలోకి రాకుండా, అదే నిద్రలో చనిపోతుందనేది ఒక నమ్మకం. ఏనుగు కాదుకదా, మాటలొచ్చిన మనిషైనా నిద్రలో హఠాత్తుగా చనిపోతే, తను ఏ కల కారణంగా అంతటి అవాంతరానికి గురయ్యాడో చెప్పుకోలేడు. పైగా, జంతువులకు కలలుగనే స్థోమత ఉందో లేదో మనకు తెలీదు. కలలు కనాలంటే అనేక సోపానాలుగా పనిచేయగల స్థాయికి మెదడు ఎదిగుండాలి. మైకంలోకి జారిపోయిన మనిషికి ‘ఉలుకూ లేదు, పలుకూ లేదు’ అంటుంటాం. పలుకు అనేది స్పృహలో ఉంటే తప్ప జరగని చర్య. ఉలుకు అంటే అసంకల్పిత చర్య. బాగా నిద్రలో వున్న మనిషికి ఎక్కడైనా ఏదైనా చురుకు తగిలితే మెలకువలోకి రాకుండానే దూరంగా సర్దుకుంటాడు. లేదా చేత్తో రుద్దుకుంటాడు. అది అసంకల్పిత చర్య. ఈ రెండు చర్యలు మెదడు అనే పదార్థం శరీరంలో ఏర్పడిన ప్రతి జీవిలో కనిపిస్తాయి. సందర్భ శుద్ది లేకుండా ఎవరైనా మాట్లాడితే - ‘మన లోకంలో ఉండే మాట్లాడుతున్నావా?’ అంటాం. లేదా ‘స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా?’ అంటాం. అంటే మాట్లాడడం అనే చర్య స్పృహలోనూ జరుగుతుంది, స్పృహ తగ్గినప్పుడూ జరుగుతుంది కానీ, స్పృహ కోల్పోయినప్పుడు జరగదు అని మనందరికీ తెలుసు. దీన్నిబట్టి, మనిషి మెదడు స్పృహ, మగత, లేదా మత్తు, మైకం అనే సోపానాల్లో పనిచేయగల స్థాయికి ఎదిగిపోయిందని తెలుస్తుంది. ఏళ్ల తరబడి సంపాదించిన అనుభవాలను విశ్లేషించి, ప్రోగు చేసుకుని, ఎన్నో ఏళ్లు గడిచేదాకా దాచుకుని, అవసరమైన ప్రతి సందర్భంలోనూ ఆలోచనతో అనుసంధానం చేసే ప్రక్రియ ‘స్పృహ’. ఆలోచనా సంబంధంగా కాకుండా, దాచుకున్న సమాచారాన్ని అస్తవ్యస్తంగా వెళ్లగక్కే ప్రక్రియ ‘మగత’. ఇది కలలో దృశ్యంగానూ జరగొచ్చు, ప్రేలాపనలోనూ జరగచ్చు. ఈ రెండే కాకుండా మరిన్ని సోపానాల్లో ఆరోహణ, అవరోహణ చేయగల సమర్థత మనిషిలోని పెద్దమెదడుకు ఏర్పడింది. అందువల్లే మనిషికి ‘కల’ అనే ఒక అవస్థ సాధ్యపడింది. ఉదాహరణకు - మందలో తనతోటి జంతువొకటి చనిపోతే, ఆ ఎడబాటు మందలో మిగతా జంతువులకు ఎంతసేపు గుర్తుంటుందో చెప్పలేం. చావును వాసనబట్టే శక్తి ఉందిగాబట్టి అది చనిపోయిందని తెలుసుకోగలవు. అయినా దాన్ని అక్కడే వదిలేసి దూరంగా తొలగిపోతాయి. చంటిబిడ్డ చనిపోయినప్పుడు, చావు వాసన తెలిసికూడా, కడుపు తీపితోనో లేక తిరిగి ప్రాణం తెచ్చుకుంటుందనే ఆశతోనో రెండు మూడు రోజులదాకా శవం దగ్గరే కాపలా కాచే జంతువులు కూడా కనిపిస్తాయి. ఆ స్వల్పమైన వ్యవధి దాటిపోయిన తరువాత ఆ జంతువు జ్ఞాపకాల్లో ఆ బిడ్డ ఎన్నిరోజులు నిలుస్తుందో మనకు అర్థం కాదు. ఆ విషయంగా జంతువు ప్రవర్తనకూ, మనిషి ప్రవర్తనకూ పోలిక లేనంత వ్యత్యాసం కనిపిస్తుంది. ఈ వ్యత్యాసం పాత రాతియుగం కాలానికే ఏర్పడిందని మనం కచ్చితంగా చెప్పుకోవచ్చు. సన్నిహితుల్లో ఎవరైనా చనిపోతే, వాళ్ల జ్ఞాపకాలు మనిషిని ఏళ్ల తరబడి వెంటాడడమే కాదు,అడపాదడపా వాళ్లు కలలో కనిపించడం కూడా కద్దు. పాత రాతియుగం మనిషి కూడా చనిపోయిన నేస్తానికి తిరిగి ప్రాణం వస్తుందనే ఆశతో కొంతకాలం దాకా కాచుకుని గడిపి వుండొచ్చు. నిరాశతో శవాన్ని వదిలేసి ముందుకు సాగిపోయిన తరువాత కూడా జ్ఞాపకాల దాడిని తట్టుకోలేక శవమున్న చోటికి తిరిగిరాగానే - కుక్కలూ, నక్కలూ, కాకులూ, గద్దలూ ఛిద్రం చేసిన దృశ్యాన్ని సహించలేక, తనకు కావలసినవారి మృతదేహం వాటి బారిన పడకుండా చూసే మార్గాలను ఆలోచించే అవసరం అప్పుడు కలిగుండొచ్చు. ఆ ఆలోచన ఫలితంగా పుట్టిన ఆచారమే ‘శవసంస్కారం’. ఈ సంస్కారం ప్రధానంగా మూడు పద్ధతుల్లో కనిపిస్తుంది. (సశేషం) రచన: ఎం.వి.రమణారెడ్డి రచయిత ఫోన్: 9440280655; email: mvrr44@gmail.com