టూకీగా ప్రపంచ చరిత్ర 69
ఆచారాలు-నమ్మకాలు
వైదికకర్మ ప్రాధాన్యతకు భిన్నంగా ‘భక్తి’ని సారాంశంగా మలుచుకున్న రచన భాగవతం. ఐనా, భాగవతంలో దేవతలకు ఆలయాలున్న విరివి కనిపించదు. క్రీ.పూ. 400 కాలానిదైన పాణిని వ్యాకరణం ద్వారా ‘వాసుదేవుని ఆరాధన’ ప్రజల్లో చొరబడినట్లు సూచనలగా తెలుస్తుంది. మౌర్య చంద్రగుప్తుని పాలనలో స్థానికసంస్థలు నిర్వహించే బాధ్యతల జాబితాలో దేవాలయాల నిర్వహణ కూడా ఒక అంశంగా ‘ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ’వారి హిందూదేశ చరిత్రలో మాటమాత్రంగా కనిపించడం మినహా, ఆ వంశం రాజులు దేవాలయాలు నిర్మించినట్టు ఆధారాలు లేవు.
క్రీ.శ. 213లో ఇక్ష్వాకు వంశానికి (ఇది రామాయణ ఇక్ష్వాకువంశం కాదు) చెందిన ఎహువళ శాంతమూలుడు అనే రాజు కట్టించిన ‘పుష్కభద్రస్వామి’ దేవాలయం (నందికొండ, నల్గొండ జిల్లా) భారతదేశంలోనే మరో నాలుగు ఆలయాలు కూడా నిర్మాణమైనట్టు చరిత్రకు తెలుస్తూంది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి సమీపంలోని ‘గుడిమల్లం’ గ్రామానికి చెందిన శివాలయం భారతదేశానికి మొదటిదని మరికొందరి వాదన. ఇవి కాకపోతే మరొకటో మరొకటో మొట్టమొదటి దేవాలయంగా వెలుగుచూసే అవకాశం దక్షిణ భారతదేశానికే ఉంది. దానికి కారణాలు రెండు. పడమటి నాగరికతలతో సింధూనాగరికతకు బలిష్టమైన వ్యాపారసంబంధాలు చిరకాలంగా కనొసాగినా, తాత్విక సంప్రదాయాలను వాళ్ల నుండి అది స్వీకరించకపోవడం మొదటిది.
ఆ తరువాతి కాలంలో విగ్రహారాధన ఇచ్చగించని ఆర్యసంప్రదాయం సింధూనది పొడవునా పటిష్టమైన కోటగోడగా నిలవడం రెండవది. అందువల్ల ఉత్తరభారతదేశంలో దేవాలయాల స్థాపనకు ఆస్కారం లేకుండా పోయింది. అటువంటి అవరోధం దక్కన్ (దక్షిణ) పీఠభూమికి లేదు. సముద్రమార్గంలో దక్కన్‌కు పడమటి వైపుండే మెసొపొటేమియాతోనూ, తూర్పు వైపుండే ఆగ్నేయ ఆసియాలోని ఇండోనేషియా, మలేషియా, థాండ్‌లాండ్, కాంబోడియా తదితర దేశాలతోనూ క్రీ.పూ. 1500 నాటి నుండే నిరవధికమైన వ్యాపార సంబంధాలు కొనసాగాయి. ద్రవిడ నాగరికత ఏ కారణంగానో మెసొపొటేమియా నుండి దేవాలయాల సంస్కృతిని స్వీకరించింది. ఆ సంస్కృతి దక్షిణభారతదేశంలో నెరుసుకున్న తరువాత ఉత్తర భారతదేశంలో క్రీ.శ. 12వ శతాబ్దం దాకా ఆలయనిర్మాణం జరిగిన దాఖలాలు చరిత్రకు దొరకలేదు. ఆగ్నేయ ఆసియాలోని థాయిలెండ్, కాంబోడియా వంటి దేశాల్లోని దేవాలయాలు దక్కన్‌లోని ఆలయాల నమూనాకు నకళ్లు మాత్రమే.
ఇంతదాకా ప్రస్తావించిన నాగరికతలకు దూరంగా, వెలుపలిగా ఎదిగిన నాగరికత చైనాది. పడమటి సరిహద్దుగా దుర్గమమైన పర్వతాలూ, తూర్పున పసిఫిక్ మహాసముద్రాల అవరోధంవల్ల, ప్రాచీనకాలంలో ఆ దేశానికి ఇతర నాగరికతలతో సంబంధాలు పరిమితం. క్రీ.పూ. 3000 నాటికే, ‘పట్టుమార్గం’ (సిల్క్ రూట్) ద్వారా ఇతర ప్రదేశాలకు చైనా నుండి పట్టుబట్టల రవాణా జరిగేదని చరిత్రకు కొన్ని ఆధారాలున్నాయి. పట్టుబట్టలకు ‘చీనాంబరాలు’గా గుర్తింపు మన ప్రాచీన సాహిత్యంలోనూ కనిపిస్తుంది. రావాణా మార్గమంటూ ఏర్పడిన తరువాత ఎగుమతులూ ఉంటాయి, దిగుమతులూ ఉంటాయి. ఈ మార్గాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానం, సంస్కృతుల బదిలీలు జరుగుతాయి. ఐనా, చిత్రమేమిటంటే, ఇతర ప్రాచీనసంస్కృతుల్లోని ఏవొక్క దానితో ఏమాత్రం పోలికలేనిది చైనీయుల తాత్వికచింతన.
రచన: ఎం.వి.రమణారెడ్డి