టూకీగా ప్రపంచ చరిత్ర
సృష్టిలోని సంఘటనల గురించే తప్ప, ‘సృష్టికర్త’ను గురించి తలబాదుకునే ప్రయాసకు చైనీయులు పూనుకోలేదు. సృష్టిని గురించి క్రీ.పూ. 3000 నాటి నుండో అంతకు పూర్వం నుండో కలిగిన ఆలోచనల్లో బాగా ప్రచారంలో ఉండే సిద్ధాంతం కుప్లంగా -
‘‘ఆకాశమూ భూమీ అనే రూపాలు ఏర్పడక ముందు సర్వం నిరాకారంగా, అస్పష్టంగా ఉండేది. అందువల్ల ఆ స్థితిని అనంతమైన ప్రారంభంగా స్వీకరిస్తాం. ఆ అనంత ప్రారంభం నుండి శూన్యం జనించింది. ఆ శూన్యం నుండి విశ్వం ఏర్పడింది. విశ్వం నుండి అన్నిటికీ అధారభూతమైన ‘శక్తి’ కొన్ని పరిమితులకు లోబడి జనించింది. స్పష్టంగా, తేలిగ్గా ఉండేది పైకి తేలి అంతరిక్షం అయింది. చిక్కగా బరువుగా ఉండేది గట్టిపడి భూమిగా ఏర్పడింది. భూమి అంతరిక్షాల సారమే ‘ఎన్, యాంగ్’లు. ఈ రెంటినీ వేరు చేస్తూ మధ్యగా నిలుచున్న శక్తి ‘పాన్ గు’. అతని కాళ్ళు భూమి మీద నిలదొక్కుకున్నాయి. అతని తలమీద ఆకాశం నిలబడింది.’’
ఇందులో గమనించవలసింది ఏమంటే - పాన్ గు సృష్టికర్త కాడు. అనంత ప్రారంభానికి ఒక ప్రతినిధి మాత్రమే. ఇందుకు కొంత భిన్నమైంది రెండవ సిద్ధాంతం. దాని ప్రకారం - ‘‘ఒక తండ్రి, అతని భార్య, నలుగురు సంతానం గల ఒక కుటుంబం ఈ విశ్వాన్ని ఉరువుల ప్రాతిపదికన (ఐటెమ్ వైజ్) విడదీసి, ఆయా స్థానాల్లో నిలబెట్టారు. వాళ్లు ఆ పదార్థాలను చలనంలో పెట్టారు; కాలాన్ని విభజించారు; ఆకాశాన్నీ భూమినీ వేరుచేశారు; పర్వతాలకూ, నదులకూ నామకరణం చేశారు.’’
మూడవది - ‘‘మొదట అంతా చీకటి. సూర్యచంద్రులు పుట్టలేదు. నలుగురు దేవతల వల్ల పర్వతాలూ నదులూ తెలిసేంత వెలుగు ప్రసరించింది. ఆ నలుగురు దేవతలు రుతువులు. మరోసారి దేవతలు జోక్యం చేసుకోవలసి వచ్చింది. సూర్యుడూ చంద్రుడూ వెలిశారు. దేవతలు ఆకాశాన్ని పైకి లేపారు. దాన్ని పట్టుకునేందుకు ఐదు పోట్లను ఏర్పాటుచేశారు. ఆ పోట్లే ఆకుపచ్చ, పసుపుపచ్చ, ఎరుపు, తెలుపు, నలుపు రంగులు. ఆ ఐదుపోట్లే పంచభూతాల పరిణామం.’’
భూమ్యాకాశాలను వేరు చేసి, వాటి మధ్య అనధికారిక ప్రయాణాలను నియంత్రించిన ఘనత ఒక పౌరాణిక చక్రవర్తికి ఆపాదించేది నాల్గవ సిద్ధాంతం. మొత్తంమీద, చైనా పౌరాణిక ప్రతిపాదనల్లో తేడా ఎంతున్నా, కొన్నిట్లో దేవతలకు స్థానం దొరికినా, ఏవొక్క తత్వంలోనూ ‘సృష్టికర్త’కు తావు దొరకలేదు. క్రీ.పూ. 5వ శతాబ్దంలో పుట్టి, బహుళ ప్రాచుర్యాన్ని సంపాదించిన ‘కన్ఫూసియన్’ సిద్దాంతం సామాజిక ప్రవర్తనకు ప్రాధాన్యత ఇచ్చిందేగానీ, జన్మలూ పునర్జన్మలూ దేవతల వంటి విషయాలను తాకదు.
క్రీ.పూ. 3 నుండి క్రీ.శ. 1 దాకా కన్ఫూసియన్ సిద్ధాంతానికి భిన్నంగా సాగిన ‘టావోయిజం’లో వేరు చేసేందుకు వీలుగానంత ముద్దగా పితరులూ, దేవతలూ, దయ్యాల రాసి ఏర్పడింది. కారణం ఏదైనా, క్రీ.శ. 800ల్లో బౌద్ధం ప్రవేశించేదాకా చైనాలో ఆలయాలు అరుదు. ఆ దేశంలో ఇప్పటికి వెలుగుజూసిన దేవాలయాలు రెండే రెండు. మొదటిది క్రీ.పూ. 1600 ప్రాంతంలో ‘షాంగ్ వంశం’నాటి ‘టాయ్‌జోంగ్’ ఆలయం. రెండవది క్రీ.పూ. 206దిగా గుర్తించబడిన ‘హన్ వంశం’ నాటి ‘టియాన్’ ఆలయం.
క్రీ.పూ. 8వ శతాబ్దం పరిసరాల్లో బౌద్ధమతం చైనాలో ప్రవేసించి, అనతికాలంలోనే చైనా మొత్తాన్ని దావానలంలా కబళించింది. ‘సృష్టికర్త’ను ఖాతరు చెయ్యని తన పురాతన తాత్విక నేపథ్యానికి అతి చేరువగా ఉన్న కొత్త సిద్ధాంతం కావడం వల్లనేమో, చైనీయులు బౌద్ధమతాన్ని ఆత్మీయంగా కౌగిలించుకున్నారు.