ముంగిలి | Mungili of m.v.ramanareddy story | Sakshi
Sakshi News home page

ముంగిలి

Published Mon, Jan 12 2015 2:41 AM | Last Updated on Sat, Sep 2 2017 7:34 PM

ముంగిలి

ముంగిలి

టూకీగా ప్రపంచ చరిత్ర
తనను గురించి తాను తెలుసుకోవాలనే కుతూహలంలేని మానవుడు ప్రపంచంలో పుట్టి వుండడు. మనిషికి తెలీకుండానే అది ఎదలో పుట్టుకొచ్చే కోరిక. ఆ కోరికే మానవుని ప్రత్యేకత. చరిత్ర గురించి ఆలోచించడం చేతయ్యేది ఒక్క మనిషికి మాత్రమే.
 
మన కళ్ళముందు మెదిలే జంతువులన్నిటికీ ఆలోచన ఉంటుంది. ‘తిండి ఎక్కడ దొరుకుతుంది’, ‘సుఖంగా పడుకునేందుకు చోటు ఎక్కడ దొరుకుతుంది’, ‘ప్రమాదమా కాదా’ అనే పరిమితమైన పరిధిలో మాత్రమే అవి ఆలోచించగలవు. ‘నేను ఎవరు’, ‘ఎప్పుడు పుట్టాను, ఎక్కడ పుట్టాను’, ‘నా అమ్మా నాన్నా ఎవరు’, ‘ఈ వర్షం ఇలానే కురుస్తూ పోతే ఏం జేయాలి’ వంటి భూత భవిష్యత్తులకు సంబంధించిన ఆలోచనలు జంతువులో ఉండవు.
 
‘నిటారుగా నడవడం, మాట్లాడడం వంటి కొన్ని లక్షణాలు అదనంగా వున్నా మనిషి గూడా ఒక జంతువే’ అని ఎవరైనా అంటే, అతడు శాస్త్రజ్ఞుడైనా సరే, అది ఎంత వాస్తవమైనా సరే, వినేందుకు మనకు కష్టంగా ఉంటుంది. ఈ ఇరకాటం ఇటీవలి కాలంలో పుట్టుకొచ్చిందే. మన పూర్వీకులకు తమను జంతువుతో బేరీజు వేసుకునే అవసరమూ కలుగలేదు, ఆలోచనా పుట్టలేదు. మానవజన్మ ఎంతో విశిష్టమైనదనీ, దేవుడు మనిషిని ప్రత్యేకంగా సృష్టించాడనీ వాళ్ళ అభిప్రాయం. హిందువుల ఇతిహాసాల మొదలు పాశ్చాత్యుల ‘బైబిల్’ దాకా ఈ విషయాన్ని ఘంటాపథంగా ప్రకటించాయి.
 
బైబిల్ ప్రకారం ఈ చరాచర ప్రపంచం దేవుని సృష్టి. మొట్టమొదట ఆయన వెలుగు ప్రవేశించేలా ఆజ్ఞాపించి, వెలుతురును పగలుగానూ చీకటిని రాత్రిగానూ విభజించాడు. ఒక పగలూ ఒక రాత్రీ కలిసి ఏర్పడిన సమయాన్ని ‘దినము’ అన్నాడు. అది ఆయన మొదటిరోజు కార్యక్రమం. రెండవరోజు ఆకాశాన్నీ, మూడవరోజు భూమినీ సృష్టించాడు. భూమిమీద చెట్లూ చేమలూ మొలకెత్తేలా ఆజ్ఞాపించాడు. అవి విత్తనాల ద్వారా ఉత్తరోత్తరా స్వయంసమృద్ధి పొందేలా ఏర్పాటు చేశాడు. నాలుగవరోజు సూర్యచంద్రులనూ నక్షత్రాలనూ ఆకాశంలో నిర్మించాడు.

ఐదవ రోజు రకరకాల పక్షులనూ జంతువులనూ సృష్టించాడు. ఉత్తరోత్తరా అవి సంతానోత్పత్తితో భూమి మీద విస్తరించేలా దీవించాడు. ఆరవరోజు తనకు ప్రతిబింబంగా మనిషిని సృష్టించాడు. మిగతా జీవకోటి మీద మనిషికి పెత్తనం అప్పగించాడు. ఏడవ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. ఆ తరువాత, మనిషి ఒంటరితనం పోగొట్టాలనుకున్నాడు. పురుషుని పక్కటెముక తీసి, దాన్ని స్త్రీగా రూపొందించాడు. ఆ ఇరువురిని సంతానోత్పత్తితో విస్తరించేలా దీవించాడు.
 
ఇక హిందువుల విశ్వాసానికి వస్తే - ఆదిమధ్యాంత రహితుడైన పరమాత్ముని బొడ్డులోనుండి పద్మం మొలిచింది. ఆ పద్మంలో పుట్టిన బ్రహ్మ ఈ చరాచర ప్రపంచాన్ని నిర్మించాడు. అందువల్ల బ్రహ్మ మొట్టమొదటి ప్రజాపతి. ఆ పద్మమే భూమి. విషయాంతరాలు అనేకంగా ఉన్నా, సనాతనుల్లో అధికసంఖ్యాకులు అంగీకరించేది ఈ వాదాన్నే.
 
మహాభారతం ఆదిపర్వంలో సృష్టిని వివరించే సందర్భం ఒకటుంది. దాని ప్రకారం, (అలా పద్మంలో ఉద్భవించిన) బ్రహ్మకు మరీచి, అంగిరసుడు, అత్రి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు అనే ఆరుగురు ప్రజాపతులు మానస పుత్రులుగా జన్మించారు. వీళ్ళుగాక, కుడిబొటనవేలు నుండి దక్షుడనే ప్రజాపతి, ఎడమ బొటనవేలి నుండి ధరణి అనే స్త్రీ పుట్టుకొచ్చారు. కుడిచేతి నుండి ‘ధర్మువు’అనే కుమారుడు మనువుగా జన్మించాడు. ఆ మనువుకు సహాయంగా ధాత, విధాత అనే మరో ఇద్దరు పురుషులు బ్రహ్మకు జన్మించారు.

హృదయం నుండి భృగుమహర్షి జన్మించాడు. దక్షునికి ధరణి ద్వారా యాభైమంది (భాగవతంలో అరవైమంది) కుమార్తెలు పుట్టగా, వాళ్ళల్లో పదిమందిని ధర్మువుకూ, ఇరవయ్యేడు మందిని చంద్రునికీ, పదముగ్గురిని మరీచి కుమారుడైన కశ్యపునికీ ఇస్తాడు. వాళ్ల సంతానం ద్వారా మానవజాతి విస్తరిస్తుంది. కశ్యవుని సంతానంలో దేవతలూ, రాక్షసులూ, పక్షులూ, పాములూ, రకరకాల జంతువులూ ఉండడం విశేషం.
 
ఇలా ప్రపంచంలోని ఏ ప్రాచీన సాహిత్యం చూసినా, ఏ ప్రాంతంలోని దేవుళ్ళు ఆ ప్రాంతంలోని మానవులను సృష్టించినట్టు కనిపిస్తుంది. పైన వివరించిన బైబిల్ సమాచారానికీ మహాభారత సమాచారానికీ మధ్య కొద్దిపాటి తేడాలు కనిపించినా, మనిషి ప్రత్యేకంగా సృష్టించబడ్డాడని చెప్పడం వరకు తేడాలేదు. అంతేగాదు, మనిషి పుట్టుకకు ముందు విధిగా భూమి పుట్టుకను గురించి ప్రస్తావించడంలో గూడా తేడాలేదు. సృష్టి సమస్తానికి భూమి కేంద్రమనీ, ఆ భూమి మనిషి కోసం ఏర్పడిందనీ, సూర్యచంద్రులు భూమిచుట్టూ తిరుగుతూ పగటినీ రాత్రినీ కలిగించే ప్రకృతిశక్తులనీ ఆనాటి విశ్వాసం.
 
ఇటీవలి కాలంలో భూమిని మనం గోళంగా చెప్పుకుంటున్నాంగానీ, ప్రాచీనుల అభిప్రాయంలో ఇది బల్లపరుపుగా ఉండే ప్రదేశం. పురాతన భారతీయ సాహిత్యంలో గూడా ‘భూవలయం’, ‘ఇలాతలం’ వంటి మాటలే కనిపిస్తాయిగానీ, ‘గోళం’గా సూచించిన ఆధారాలు కనిపించవు. సాంకేతిక పరికరాల సహాయం లేకుండా భూమిని గోళంగా భావించడం తేలికైన ఆలోచన కాదు. ఎంతదూరం పయనించినా కంటిచూపుకున్న పరిమితులు భూమిని బల్లపరుపుగా భావించేందుకే అనుకూలిస్తాయి.

అందువల్ల, ‘మిట్టలూ పల్లాలూ ఉంటాయేతప్ప, స్థూలంగా భూమి చదునుగా విస్తరించిన ప్రదేశం’ అనుకోవడంలో ఆనాటి మానవునికి ఎలాంటి సందేహం కలుగలేదు. గోళంగా ఉందేమోననే సందేహం మీద క్రీస్తుకు పూర్వం 300 సంవత్సరాలకు ముందే గ్రీకు తత్త్వవేత్తలు చర్చించినట్టు తెలిసినా, మతగ్రంథాలు బల్లపరుపుగా ఉన్నట్టు చెబుతుండడంతో చాలాకాలం దాకా అది విభేదించేందుకు ఏమాత్రం వీలుపడని విశ్వాసంగా కొనసాగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement