సమ్‌థింగ్‌ డిఫరెంట్‌ | latest cafe culture in hyderabad | Sakshi
Sakshi News home page

సమ్‌థింగ్‌ డిఫరెంట్‌

Published Sun, Sep 22 2024 7:06 AM | Last Updated on Sun, Sep 22 2024 7:06 AM

latest cafe culture in hyderabad

ఆధునిక కల్చర్‌కు అసలైన చిరునామాగా.. 

ఈవెంట్స్‌కూ, వెరైటీ మీట్స్‌కూ వేదికలు.. 

అత్యాధునిక నగరానికి అద్దం పడుతున్న కార్యక్రమాలు 

వర్క్‌ప్లేస్‌లకూ.. వర్క్‌షాప్స్‌కూ అవే.. 

సరదాగా కాఫీనో, టీనో తాగడానికి కేఫ్స్‌కి వెళ్తున్నారా? ఇష్టమైన వంటకాలు రుచి చూడడానికి వెళ్తున్నారా? అయితే నగరంలో లేటెస్ట్‌ కేఫ్‌ కల్చర్‌ని మీరింకా టేస్ట్‌ చేయలేదన్నట్టే. ఇప్పుడు కేఫ్స్‌ అంటే ఆఫీస్‌.. కేఫ్స్‌ అంటే వెరైటీ ఈవెంట్లకు కేరాఫ్‌గా మారుతున్నాయి.. ఆధునిక కల్చర్‌కు అసలైన చిరునామాగా నిలుస్తున్నాయి నగరంలోని పలు కేఫ్‌లు.  ఈవెంట్స్‌ నుంచి వెరైటీ మీట్స్‌ వరకూ కేఫ్‌లు వేదికలవుతున్నాయి.  వర్క్‌ప్లేస్‌ల నుంచి వర్క్‌షాపుల వరకూ కేఫ్‌లు కేరాఫ్‌ అడ్రస్‌ అవుతున్నాయి. 

టాప్‌ క్లాస్‌ చిత్రకారుని చిత్రాలను వీక్షించడానికో.. ఓ బెస్ట్‌ సాక్సాఫోన్‌ ఆర్టిస్ట్‌ సంగీతాన్ని వినడానికో.. స్టోరీటెల్లర్‌ కథల విందుకో, సెలబ్రిటీల సక్సెస్‌ సీక్రెట్స్‌ వినేందుకో.. ఒకప్పుడైతే ఏదైనా కల్చరల్‌ సెంటర్‌కో లేదా వాటికి ప్రత్యేకించిన మరో చోటుకో వెళ్లేవారు. అయితే ఇప్పుడు వాటితో పాటు అవీ ఇవీ అనే తేడా లేకుండా అన్నీ ఒకే వేదికపై అందుకోడానికి ఒక్క కేఫ్‌కి వెళితే చాలు. ఫుడ్‌కీ, డ్రింక్స్‌కి మాత్రమే పరిమితమైతే కాదు.. రోజుకో ఈవెంట్‌తో తన వెంట తిప్పుకుంటేనే అది కేఫ్‌ అని పునర్‌ నిర్వచిస్తున్నాయి నగరంలోని నయా ట్రెండ్స్‌. 

మ్యూజిక్‌ ఈవెంట్ల.. పంట.. 
పేరొందిన రాక్‌ బ్యాండ్‌ సంగీత ప్రదర్శనలతో కేఫ్స్‌ హోరెత్తుతున్నాయి. బంజారాహిల్స్‌లోని హార్డ్‌రాక్‌ కేఫ్‌ లాంటివి అచ్చంగా వీటికే పేరొందాయి. డ్రమ్స్, ఫ్లూట్స్, సాక్సాఫోన్, వయోలిన్‌.. తదితర విభిన్న రకాల పరికరాలను పలికించడంలో నైపుణ్యం కలిగిన మ్యుజీషియన్స్‌ తరచూ కేఫ్‌ సందర్శకులకు వీనుల విందును పంచుతుంటారు. ఇక గజల్‌ గానామృతాలు, సినీ గాయకుల స్వరమధురిమల సంగతి సరేసరి. ఓ వైపు రుచికరమైన విందును, మరోవైపు పాటలతో వీనుల విందును సైతం అతిథులు ఆస్వాదిస్తున్నారు.

కేఫ్స్‌లో నిర్వహించే ఈవెంట్స్‌లో మ్యూజిక్‌ తర్వాత కామెడీ షోస్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా స్టాండప్‌ కామెడీకి అతిథుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. సిటీలో ఇప్పుడు పదుల సంఖ్యలో స్టాండప్‌ కమెడియన్స్‌ ఉన్నారంటే దానికి కారణం కేఫ్స్‌ యజమానులు వారికి కల్పిస్తున్న అవకాశాలే అని చెప్పొచ్చు. ఇతర నగరాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో పేరొందిన కమెడియన్స్, థియేటర్‌ ఆరి్టస్ట్స్, టీవీ షోస్‌ ద్వారా పాపులర్‌ అయినవారు, సోషల్‌ మీడియా సెలబ్రిటీలు కూడా సిటీ కేఫ్స్‌కు తరలివస్తున్నారు.

వర్క్‌ప్లేస్‌లోనూ..
ఒకప్పుడు సాయంత్రాల్లో, వారాంతాల్లో మాత్రమే కేఫ్స్‌ కళకళలాడేవి అయితే ఆ తర్వాత పగటి పూట, అలాగే అన్ని రోజుల్లోనూ చెప్పుకోదగిన సంఖ్యలోనే కస్టమర్స్‌ కనిపిస్తున్నారు. దీనికి ప్రధానంగా రెండు కారణాలను చెప్పొచ్చు. ఆఫీస్‌ స్పేస్‌ను కూడా కేఫ్స్‌ ఆఫర్‌ చేస్తుండడం ఇందులో ఒకటి. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్, హైబ్రిడ్‌ తదితర కరోనా నేపథ్యంలో పుట్టుకొచ్చిన వర్క్‌ కల్చర్స్‌ వల్ల ఇప్పుడు కేఫ్స్‌లో కూర్చునే ఆఫీస్‌ వర్క్‌ చేసుకోవడం నగరవాసులకు అలవాటైంది. కేవలం ఐటీ నిపుణులు మాత్రమే కాకుండా విభిన్న రకాల వృత్తి వ్యాపకాల్లో ఉన్నవారు కూడా కేఫ్స్‌ను వర్క్‌ప్లేస్‌లుగా వినియోగిస్తున్నారు.

వర్క్‌షాప్స్‌.. 
విందు వినోదాలకు మాత్రమే కాకుండా విభిన్న రకాల అంశాల్లో శిక్షణా తరగతులకు కూడా కేఫ్స్‌ నిలయంగా మారుతుండడం విశేషం. 
గత రెండేళ్లుగా ఈ ట్రెండ్‌ కేఫ్స్‌లో బాగా పెరిగిందని నగరానికి చెందిన ఫుడీస్‌ క్లబ్‌ నిర్వాహకులు సంకల్ప్‌ చెబుతున్నారు. పోటరీ వర్క్‌షాప్, పెయింటింగ్‌ వర్క్‌షాప్, కేక్‌ డెకరేటింగ్, రెసిన్‌ ఆర్ట్, క్యాండిల్‌ మేకింగ్, బేకింగ్‌ తదితర కళలకు సంబంధించిన వర్క్‌షాప్‌లతో నగరవాసులను ఆకర్షిస్తున్నాయి.

డేటింగ్స్‌.. మీటప్స్‌.. 
పలు సంస్థలు, క్లబ్స్‌ తమ మీటప్‌ పాయింట్లుగా కేఫ్స్‌ను ఎంచుకుంటున్నాయి. నిర్వాహకులు వారి కార్యకలాపాలకు తగ్గట్టుగా థీమ్స్‌ను సిద్ధం చేసి మరీ  ఆతిథ్యం అందిస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో నగరంలో ఊపందుకున్న డేటింగ్స్‌కు కూడా పలు కేఫ్స్‌ వారధిగా నిలుస్తున్నాయి. కొన్ని కేఫ్స్‌ ప్రత్యేకంగా ఒంటరి వ్యక్తుల కోసం ఒక రోజును కేటాయిస్తూ ఫ్రెండ్‌షిప్‌ ఈవెంట్స్, పెయిరింగ్‌ ఈవెంట్స్‌ తరహా థీమ్స్‌తో ఆకర్షిస్తున్నాయి. సహజంగానే ఇవి సోలో లైఫ్‌లో ఉన్నవారిని ఆకట్టుకుంటున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement