Nimrah Cafe: సిటీ స్పాట్స్‌.. సెల్ఫీ షాట్స్‌ | Best Selfie Shots In Nimrah Cafe | Sakshi
Sakshi News home page

Nimrah Cafe: సిటీ స్పాట్స్‌.. సెల్ఫీ షాట్స్‌

Published Thu, Sep 19 2024 6:32 AM | Last Updated on Thu, Sep 19 2024 1:11 PM

Best Selfie Shots In Nimrah Cafe

మనిషి జీవనశైలిలో వచ్చిన అధునాతన మార్పుల్లో సెల్ఫీకి ప్రత్యేక స్థానముంది. ప్రస్తుత జీవన విధానంలో సోషల్‌ మీడియా కీలకపాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా ఎక్స్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్, వాట్సాప్‌.. ఇలా ఎన్నో వేదికలపై సెల్ఫీ అజరామరంగా వెలుగుతోంది. 2012 తర్వాత సెల్ఫీ అనే వ్యాపకం గ్లోబల్‌ వేదికగా తన ప్రశస్తిని పెంచుకూంటూ వస్తోంది. అయితే.. ప్రస్తుతం నగరంలోని ఓల్డ్‌ సిటీ సెల్ఫీ స్పాట్స్‌గా గుర్తింపు పొందుతోంది. తమని తాము మాత్రమే కాకుండా తమ వెనుక ఓ చారిత్రక కట్టడం, వారసత్వ వైభవాన్ని క్లిక్‌మనిపించడం ఈ తరానికి ఓ క్రేజీ థాట్‌గా మారింది. ఇందులో భాగంగానే పాతబస్తీలోని కొన్ని ప్రాంతాలు సెల్ఫీ స్పాట్స్‌కు హాట్‌స్పాట్స్‌గా మారాయి..!  

ప్రస్తుతం హైదరాబాద్‌ అంటే ఐటీ, మోడ్రన్‌ లైఫ్‌ వంటి విషయాలు మదికి వస్తాయేమో కానీ.., గతంలో మాత్రం చార్మినార్‌ గుర్తొచ్చేది. ఇప్పటికీ కూడా హైదరాబాద్‌ను మొదటిసారి సందర్శించిన ప్రతి ఒక్కరూ చార్మినార్‌ను చూడాలనే అనుకుంటారు. 

అనుకోవడమే కాదు.. నగరానికొచ్చి చార్మినార్‌తో సెల్ఫీ తీసుకోలేదంటే ఏదో అసంతృప్తి. ఇలా సిటీలో బెస్ట్‌ సెల్ఫీ స్పాట్‌గా చార్మినార్‌ అందరినీ దరిచేర్చుకుంటుంది. ఉదయం వాకింగ్‌ మొదలు అర్ధరాత్రి ఇరానీ ఛాయ్‌ ఆస్వాదించే వారి వరకు ఈ చార్మినార్‌తో సెల్ఫీ అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఓల్డ్‌సిటీ ఇప్పటికీ తన వైభవాన్ని సగర్వంగా నిలుపుకుంటుంది అంటే చార్మినార్‌ వల్లే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మధ్య కాలంలో అర్ధరాత్రి నగరవాసులు అతి ఎక్కువగా సందర్శిస్తున్న ప్రాంతాల్లో ఈ సెల్ఫీ స్పాట్‌ ఒకటి.  

ఓల్డ్‌సిటీ షాపింగ్‌ అంటే లక్షల క్లిక్కులే..  
ఓల్డ్‌ సిటీ అంటే ఒక్క చార్మినార్‌ మాత్రమే కాదు.. ఇక్కడ దొరికే మట్టి గాజులకు అంతర్జాతీయ ఖ్యాతి ఉంది. షాపింగ్‌ అంటే నో చెప్పని యువతులు ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో. యువతుల మనస్సును హత్తుకునే ఎన్నో అలంకరణ వస్తులు, గాజులు, డ్రెస్‌ మెటీరియల్స్‌ ఇక్కడ విరివిగా లభ్యమవుతాయి. రంజాన్‌ సీజన్‌లో ఇక్కడ షాపింగ్‌ చేయడానికి వివిధ ప్రాంతాల నుంచి సైతం రావడం విశేషం. ఈ సమయంలో ఇక్కడే లక్షలసెల్ఫీలు క్లిక్, క్లిక్‌మంటుంటాయి.  

చింత చెట్టు కింద సెల్ఫీ.. 
హైదరాబాద్‌ నగరంలో 1908లో వచ్చిన వరదలకు దాదాపు 15 వేల మందికి పైగా మరణించారు. ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంతాల్లో చాలా ప్రాణనష్టం జరిగింది. ఈ తరుణంలో అఫ్జల్‌గంజ్‌లోని ఉస్మానియా హాస్పిటల్‌కు సమీపంలో ఉన్న చింతచెట్టు దాదాపు 150 మంది ప్రాణాలను కాపాడింది. వరదల్లో చిక్కుకుని ప్రాణాపాయ స్థితిలో ఉన్న నగరవాసులు ఈ చెట్టు ఎక్కి తమ ప్రాణాలను దక్కించుకున్నాను. అయితే ఇప్పటికీ ఈ చెట్టు పటిష్టంగా ఉంది. ఈ చరిత్ర తెలిసిన వారు ఆ సమీపంలోకి వెళ్లినప్పుడు ఓ సెల్ఫీ తీసుకోవడం మాత్రం మరిచిపోరు.  

ఈ వీధులన్నీ సెల్ఫీలమయమే.. 
పాతబస్తీలోనే కొలువుదీరిన సాలార్‌జంగ్‌ మ్యూజియం, వందేళ్ల సిటీ కాలేజ్, హైకోర్టు పరిసర ప్రాంతాలు, పురానాపూల్, చార్మినార్‌ చౌరస్తా కేంద్రంగా నాలుగు దిక్కుల్లోని విధుల్లో నిర్మించిన కమాన్‌లు కూడా సెల్ఫీ స్పాట్‌లుగా మారాయి.  

మిడ్‌ నైట్‌ స్పాట్‌.. నిమ్హ్రా 
చార్మినార్‌ పక్కనే ఉన్న నిమ్హ్రా కేఫ్‌ కూడా ది బెస్ట్‌ సెల్ఫీ స్పాట్‌గా మారింది. ఇక్కడ టీ తాగుతూ సెల్ఫీ తీసుకోవడం, అది కూడా అర్ధరాత్రి ఛాయ్‌కి రావడం ఇక్కడి ప్రత్యేకత. పాతబస్తీకి వచ్చిన ప్రతి ఒక్కరినీ ఛాయ్‌ ఆహా్వనించడం నిమ్హ్రా కేఫ్‌ ప్రత్యేకత. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్‌ సిద్దికీ ఇదే కేఫ్‌లో సెల్ఫీ దిగి అక్కడే ఫోన్‌ మర్చిపోయి ఎయిర్‌పోర్ట్‌ వెళ్లాడు. అయితే అంతే జాగ్రత్తగా తన ఫోన్‌ తనకు తిరిగి రావడంతో నగరవాసులపై గౌరవం పెరిగిందని చెప్పుకున్నారు. దీనికి సమీపంలోని షాగౌస్‌ బిర్యాని తింటూ సెల్ఫీ తీసుకుని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం ఓ ట్రెండ్‌. ఇలా పిస్తాహౌజ్, ఇరానీ ఛాయ్, పాయా సూప్‌ తదితర ఫుడ్‌ స్పాట్‌లు సెల్ఫీ స్పాట్‌లుగా మారాయి.

మొదటి ‘సెల్ఫీ’.. 
సెల్ఫీ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఆ్రస్టేలియాలోని ఓ న్యూస్‌ వెబ్‌సైట్‌లో వాడారు. కానీ సెల్ఫీ అనే పదం ప్రాచూర్యం పొందింది మాత్రం 2012 తర్వాతే అని చెప్పాలి. సోషల్‌ మీడియా ఊపందుకుంటున్న 2013లో ఈ సెల్ఫీ అనే కొత్త పదం విపరీతంగా చక్కర్లు కొట్టింది. ముఖ్యంగా ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియాలో ఈ పదం బాగా ప్రాచూర్యంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆక్స్‌ఫర్డ్‌ ఇంగ్లిష్‌ డిక్షనరీ సెల్ఫీ అనే పదాన్ని ‘వర్డ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా ఎంపిక చేసింది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement