నిఘా నీడలో టీవీవీ మహాసభలు | Conference under surveillance TVV | Sakshi
Sakshi News home page

నిఘా నీడలో టీవీవీ మహాసభలు

Published Fri, Jan 30 2015 2:27 AM | Last Updated on Sat, Sep 2 2017 8:29 PM

నిఘా నీడలో టీవీవీ మహాసభలు

నిఘా నీడలో టీవీవీ మహాసభలు

  • నల్లగొండలో మొదలైన సమావేశాలు
  • అనుమతికి ససేమిరా అన్న పోలీసులు
  • హరగోపాల్ జోక్యంతో అనుమతి
  • నల్లగొండ అర్బన్: నల్లగొండ వేదికగా గురువారం ప్రారంభమైన తెలంగాణ విద్యార్థి వేదిక(టీవీవీ) రాష్ట్ర 4వ మహాసభలు నిఘానీడలో కొనసాగాయి. తొలుత అసలు మహాసభల నిర్వహణకే అంగీకరించని పోలీసులు, ఆ తర్వాత అనేక నాటకీయ పరిణామాల మధ్య అనుమతినిచ్చారు. కానీ  పట్టణంలోని అమరవీరుల స్థూపం నుంచి సభావేదిక వసుంధర ఫంక్షన్‌హాల్ వరకు ర్యాలీకి అంగీకరించలేదు. దీంతో  రెండు రోజులపాటు జరిగే ఈ మహాసభలు గురువారం ఆలస్యంగా ప్రారంభమయ్యాయి.

    ముఖ్య వక్త ఖరగ్‌పూర్ ఐఐటీ ప్రొఫెసర్ ఆనంద్ తేల్‌తుంబ్డే మాట్లాడుతూ సభకు అనుమతివ్వకుండా పోలీసులు ఇబ్బంది పెట్టడం దురదృష్టకరమన్నారు. ఇది భార త రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. దేశంలో ఒకే సంస్కృతి, ఒకే మతం అనే విధంగా మోదీ సర్కారు పాలన సాగిస్తోందని విమర్శించారు. ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, ఫాసిజాలను తలపిం చే విధంగా పరిపాలిస్త్తున్నారని దుయ్యబట్టారు.

    ప్రజాస్వామిక విలువల కోసం విద్యార్థులు, యువకులు పోరాడాలని పిలుపునిచ్చారు. మహాసభలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కాశీం, సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి, టీవీవీ రాష్ట్ర అధ్యక్షుడు డి.విజయ్, టీపీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మద్దిలేటి, ప్రొఫెసర్ అన్వర్‌ఖాన్, ఎ.నర్సింహ్మారెడ్డి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజా కళామండలితో పాటు ఆర్.నారాయణమూర్తి కూడా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు.
     
    హరగోపాల్ చొరవతో..

    తెలంగాణ విద్యార్థి వేదిక రాష్ట్ర మహాసభల నిర్వహణకు స్థానిక పోలీసులు ససేమిరా అన్నారు.  మహాసభ నిర్వహించాల్సిన ఫంక్షన్‌హాల్‌కు పోలీసులు తాళం వేశారని నిర్వాహకులు ఆరోపిం చారు. మహాసభల నిర్వహణలో అసాంఘిక శక్తుల ప్రమేయం ఉందన్న నెపంతో అడ్డుకునే ప్రయత్నం చేశారని మండిపడ్డారు.  మహాసభలు నిర్వహించుకునే స్వేచ్ఛ కూడా లేదా అని టీవీవీ నేతలు ప్రశ్నిం చారు. కాగా, నిర్వాహకులను పిలిపించి సభకు సంబంధించిన అన్ని వివరాలను జిల్లా పోలీస్ అధికారులు తీసుకున్నట్లు సమాచారం.

    అంతకుముందు హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ చొరవ కారణంగానే సభకు పోలీసులు అనుమతినిచ్చినట్లు తెలుస్తోంది. ఆయన హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డితో ఈ విషయమై ఫోన్‌లో మాట్లాడినట్టు సమాచారం. అయితే, వేదిక వద్ద పోలీసులు పెద్ద ఎత్తున పహారా కాశారు. మఫ్టీలో నిఘా పెట్టారు. మహాసభల నిర్వహణను వీడియో తీయించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement