Anand teltumbde
-
ఆ ఇద్దరి అరెస్ట్ దారుణం..
సాక్షి, హైదరాబాద్: ప్రొఫెసర్ ఆనంద్ తేల్తుంబే, జర్నలిస్ట్ గౌతమ్ నవ్లఖలను అక్రమంగా అరెస్ట్ చేశారని ఫోరమ్ ఫర్ సోషల్ ఛేంజ్(ఎఫ్ఎస్సీ) పేర్కొంది. భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతూ వీరిని నిర్బంధించారని ఆరోపించింది. మానవ హక్కుల పరిరక్షణ కోసం నిస్వార్థంగా పనిచేస్తున్న ఆ ఇద్దరినీ ఉపా చట్టం కింద అరెస్ట్ చేయడం దారుణమని పేర్కొంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వారిని వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని ఎఫ్ఎస్సీ డిమాండ్ చేసింది. ఈ మేరకు కన్వీనర్ అల్లం నారాయణ, రమణి, భూమన్, సాంబమూర్తి, ఆర్.వెంకట్‌రెడ్డి, ప్రభాకర్, ఆశాలత, జిట్టా బాల్‌రెడ్డిలతో పాటు మరో 30 మంది వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఒక ప్రకటన విడుదల చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బీమా కోరేగావ్ కేసులో సామాజిక కార్యకర్తలు ప్రొఫెసర్ ఆనంద్ తెల్తుంబ్డే, ప్రకాశ్ అంబేద్కర్, పౌరహక్కుల కార్యకర్త గౌతమ్ నవలఖ మంగళవారం జాతీయ దర్యాప్తు సంస్ధ (ఎన్ఐఏ) ఎదుట లొంగిపోయిన సంగతి తెలిసిందే. మావోయిస్టులతో సంబంధాలున్నాయని, ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రపన్నారని ఆరోపిస్తూ తెల్తుంబ్డే, నవలఖతో పాటు పలువురు పౌర కార్యకర్తల ఉపా చట్టం కింద మహారాష్ట్ర పోలీసులు కేసులు నమోదు చేశారు. ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు బాంబే హైకోర్టు నిరాకరించడంతో వారిద్దరూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో మార్చి 17న సుప్రీంకోర్టు కూడా వారి అభ్యర్థనలను తిరస్కరించి మూడు వారాలలోగా లొంగిపోవాలని ఆదేశించింది. వారు లొంగిపోవడానికి ఏప్రిల్ 9న సుప్రీంకోర్టు మరో వారం గడువు పొడిగించింది. -
దళిత ప్రొఫెసర్ ఆనంద్ అరెస్టు అక్రమం
పుణే: దళిత ప్రొఫెసర్ ఆనంద్ తెల్తుంబ్డే అరెస్ట్‌పై పుణే కోర్టు పోలీసులను తప్పుబట్టింది. ఆయన్ను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. గోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ ఆనంద్ తెల్తుంబ్డే శనివారం తెల్లవారు జామున కేరళ నుంచి విమానంలో ముంబై ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే పుణే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2017లో ఎల్గార్ పరిషత్‌లో జరిగిన సమావేశానికి మావోయిస్టులు మద్దతు తెలిపారనీ, ఆ సమావేశంలో వివిధ నేతల రెచ్చగొట్టే ప్రసంగాల కారణంగానే కోరేగావ్–భీమా యుద్ధం స్మారకం వద్ద హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయనేది పోలీసుల ఆరోపణ. తెల్తుంబ్డే మావోయిస్టుల మధ్య సాగిన ఉత్తరప్రత్యుత్తరాల వివరాలు కూడా తమ వద్ద ఉన్నాయంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఈ కేసు అక్రమమంటూ తెల్తుంబ్డే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసు కొట్టివేసేందుకు నిరాకరించిన న్యాయస్థానం.. ఈ నెల 11వ తేదీ వరకు ఆయన్ను అరెస్టు చేయరాదంటూ పోలీసులను ఆదేశించింది. ఆలోగా న్యాయస్థానం నుంచి బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. అయితే, పుణే పోలీసులు ఈలోగానే అరెస్టు చేయడం అక్రమమని అడిషనల్ సెషన్స్ కోర్టు జడ్జి కిశోర్ వదానే పేర్కొన్నారు. -
మతవాదం ప్రమాదం
జెడ్పీ సెంటర్ (మహబూబ్‌నగర్): మతవాదం దేశానికి చాలా ప్రమాదకరమని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మనుమడు ప్రొఫెసర్ ఆనంద్ తెల్తుంబ్డే అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో విప్లవ రచయిత సంఘం (విరసం) 26వ రాష్ట్ర మహాసభలు శనివారం ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు సాగే ఈ మహాసభలను ఆనంద్ ప్రారంభించి మాట్లాడారు. దేశంలో బ్రాహ్మణీయ హిందుత్వ రాజకీయాలు నడుస్తున్నాయని అన్నారు. సుప్రీంకోర్టు హిందుత్వాన్ని ఒక జీవన విధానంగా నిర్వచించడంతో గందరగోళం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. 1920 దశకంలోనే∙దళిత , కమ్యూనిస్టు ఉద్యమాలు వచ్చినట్లు ఆయన తెలిపారు. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు హెగ్డేవార్ ఇటలీలో గడిపిన సమయంలో అక్కడ ఫాసిజం ధోరణిని అధ్యయనం చేసి భారతదేశంలో ప్రవేశ పెట్టారని పేర్కొన్నారు. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్కు అధినేత అయిన గోల్వార్కర్ హిందుత్వం మరింత పాతుకుపోవడానికి ప్రయత్నించారని పేర్కొన్నారు. అలాగే, సావర్కర్ అండమాన్ జైలులో ఉండి వలసవాదులను నిరోధిస్తానని చెప్పి పుణ్యభూమి అనే భావన ద్వారా క్రిస్టియన్లు భారతీయులు కాదని చెప్పారన్నారు. అయితే, హిందుత్వం కేవలం ఆర్ఎస్ఎస్కు మాత్రమే పరిమితం కాలేదని కాంగ్రెస్ స్థాపనతో కూడా ముందుకొచ్చిందని తెలిపారు. మతాన్ని మార్కెట్‌కు ముడిపెట్టిన బీజేపీతో సమానంగా రాహుల్‌గాంధీ కూడా హిందుత్వం కాగడా పట్టుకున్నారని ఆనంద్ విమర్శించారు. ప్రత్యేకించి ముస్లింలపై దాడులు జరుగుతున్నాయని, ఆర్ఎస్ఎస్ శక్తులు ప్రచారంలో దూకుడుగా 2019 ఎన్నికల దిశగా వెళ్తున్నాయని చెప్పారు. ఇప్పటికిప్పుడు సాధ్యం కాకున్నా మున్ముందు హిందూ రాజ్యంగా మార్చడానికి అనేక శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. విరసం లేకుండా తెలుగు సాహిత్యం లేదు: హరగోపాల్ విప్లవ రచయితల సంఘం (విరసం) లేకుండా తెలుగు సాహిత్యాన్ని ఊహించడం కష్టమని మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షుడు, ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. మానవత్వం మీద విశ్వాసముండే పాత్రను ప్రతీ ఒక్కరూ పోషించాలని, ఈ పాత్రను విరసం సభ్యులు బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరముందని తెలిపారు. అలాగే, ప్రజలను సమీకరించడంతోపాటు సమాజాన్ని మార్చే చారిత్రక బాధ్యత విరసంపై ఉందన్నారు. విరసం రాష్ట్ర కార్యదర్శి వరలక్ష్మి, ప్రొఫెసర్లు పాణి, కాశీం, ఎక్బాల్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ పాలనతో పేట్రేగిపోతున్న బ్రాహ్మణీయ హిం దూ ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. సంస్కృతి, మతం పేరుతో దేశంలోని రచయితలు, మేధావులపై ఆర్ఎస్ఎస్, హిందూత్వ శక్తులు దాడులు చేస్తున్నాయని విమర్శించారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క మాట్లాడుతూ విరసం రాష్ట్ర మహాసభలకు తమ సంఘీభావం ప్రకటించారు. అలాగే, కళాకారులతో కలసి అమరవీరుల త్యాగాలు మరువలేమని, గోమాత ఎవరు అనే పాటలు పాడి సభికులను అలరించారు. ఇంకా సభల్లో విరసం సభ్యులు వరవరరావు, బాసిత్, ఎక్బాల్, కాశీం, అరసవెల్లి కృష్ణ, గీతాంజలి, రాంకీ, రాజేంద్రబాబు, రాఘవాచారి, ప్రసాద్‌రావు, చెంచయ్య, ఉదయమిత్ర తదితరులు పాల్గొన్నారు. -
నిఘా నీడలో టీవీవీ మహాసభలు
నల్లగొండలో మొదలైన సమావేశాలు అనుమతికి ససేమిరా అన్న పోలీసులు హరగోపాల్ జోక్యంతో అనుమతి నల్లగొండ అర్బన్: నల్లగొండ వేదికగా గురువారం ప్రారంభమైన తెలంగాణ విద్యార్థి వేదిక(టీవీవీ) రాష్ట్ర 4వ మహాసభలు నిఘానీడలో కొనసాగాయి. తొలుత అసలు మహాసభల నిర్వహణకే అంగీకరించని పోలీసులు, ఆ తర్వాత అనేక నాటకీయ పరిణామాల మధ్య అనుమతినిచ్చారు. కానీ పట్టణంలోని అమరవీరుల స్థూపం నుంచి సభావేదిక వసుంధర ఫంక్షన్‌హాల్ వరకు ర్యాలీకి అంగీకరించలేదు. దీంతో రెండు రోజులపాటు జరిగే ఈ మహాసభలు గురువారం ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య వక్త ఖరగ్‌పూర్ ఐఐటీ ప్రొఫెసర్ ఆనంద్ తేల్తుంబ్డే మాట్లాడుతూ సభకు అనుమతివ్వకుండా పోలీసులు ఇబ్బంది పెట్టడం దురదృష్టకరమన్నారు. ఇది భార త రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. దేశంలో ఒకే సంస్కృతి, ఒకే మతం అనే విధంగా మోదీ సర్కారు పాలన సాగిస్తోందని విమర్శించారు. ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, ఫాసిజాలను తలపిం చే విధంగా పరిపాలిస్త్తున్నారని దుయ్యబట్టారు. ప్రజాస్వామిక విలువల కోసం విద్యార్థులు, యువకులు పోరాడాలని పిలుపునిచ్చారు. మహాసభలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కాశీం, సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి, టీవీవీ రాష్ట్ర అధ్యక్షుడు డి.విజయ్, టీపీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మద్దిలేటి, ప్రొఫెసర్ అన్వర్‌ఖాన్, ఎ.నర్సింహ్మారెడ్డి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజా కళామండలితో పాటు ఆర్.నారాయణమూర్తి కూడా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. హరగోపాల్ చొరవతో.. తెలంగాణ విద్యార్థి వేదిక రాష్ట్ర మహాసభల నిర్వహణకు స్థానిక పోలీసులు ససేమిరా అన్నారు. మహాసభ నిర్వహించాల్సిన ఫంక్షన్‌హాల్‌కు పోలీసులు తాళం వేశారని నిర్వాహకులు ఆరోపిం చారు. మహాసభల నిర్వహణలో అసాంఘిక శక్తుల ప్రమేయం ఉందన్న నెపంతో అడ్డుకునే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. మహాసభలు నిర్వహించుకునే స్వేచ్ఛ కూడా లేదా అని టీవీవీ నేతలు ప్రశ్నిం చారు. కాగా, నిర్వాహకులను పిలిపించి సభకు సంబంధించిన అన్ని వివరాలను జిల్లా పోలీస్ అధికారులు తీసుకున్నట్లు సమాచారం. అంతకుముందు హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ చొరవ కారణంగానే సభకు పోలీసులు అనుమతినిచ్చినట్లు తెలుస్తోంది. ఆయన హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డితో ఈ విషయమై ఫోన్లో మాట్లాడినట్టు సమాచారం. అయితే, వేదిక వద్ద పోలీసులు పెద్ద ఎత్తున పహారా కాశారు. మఫ్టీలో నిఘా పెట్టారు. మహాసభల నిర్వహణను వీడియో తీయించారు.