ఆనంద్ తేల్తుంబే, గౌతమ్ నవ్లఖల (ఫైల్)
సాక్షి, హైదరాబాద్: ప్రొఫెసర్ ఆనంద్ తేల్తుంబే, జర్నలిస్ట్ గౌతమ్ నవ్లఖలను అక్రమంగా అరెస్ట్ చేశారని ఫోరమ్ ఫర్ సోషల్ ఛేంజ్(ఎఫ్‌ఎస్‌సీ) పేర్కొంది. భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతూ వీరిని నిర్బంధించారని ఆరోపించింది. మానవ హక్కుల పరిరక్షణ కోసం నిస్వార్థంగా పనిచేస్తున్న ఆ ఇద్దరినీ ఉపా చట్టం కింద అరెస్ట్ చేయడం దారుణమని పేర్కొంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వారిని వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని ఎఫ్‌ఎస్‌సీ డిమాండ్ చేసింది. ఈ మేరకు కన్వీనర్ అల్లం నారాయణ, రమణి, భూమన్, సాంబమూర్తి, ఆర్.వెంకట్‌రెడ్డి, ప్రభాకర్, ఆశాలత, జిట్టా బాల్‌రెడ్డిలతో పాటు మరో 30 మంది వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఒక ప్రకటన విడుదల చేశారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బీమా కోరేగావ్ కేసులో సామాజిక కార్యకర్తలు ప్రొఫెసర్ ఆనంద్ తెల్తుంబ్డే, ప్రకాశ్ అంబేద్కర్, పౌరహక్కుల కార్యకర్త గౌతమ్ నవలఖ మంగళవారం జాతీయ దర్యాప్తు సంస్ధ (ఎన్‌ఐఏ) ఎదుట లొంగిపోయిన సంగతి తెలిసిందే. మావోయిస్టులతో సంబంధాలున్నాయని, ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రపన్నారని ఆరోపిస్తూ తెల్తుంబ్డే, నవలఖతో పాటు పలువురు పౌర కార్యకర్తల ఉపా చట్టం కింద మహారాష్ట్ర పోలీసులు కేసులు నమోదు చేశారు. ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు బాంబే హైకోర్టు నిరాకరించడంతో వారిద్దరూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో మార్చి 17న సుప్రీంకోర్టు కూడా వారి అభ్యర్థనలను తిరస్కరించి మూడు వారాలలోగా లొంగిపోవాలని ఆదేశించింది. వారు లొంగిపోవడానికి ఏప్రిల్ 9న సుప్రీంకోర్టు మరో వారం గడువు పొడిగించింది.
Comments
Please login to add a commentAdd a comment