![Holistic health inspections annually - Sakshi](/styles/webp/s3/article_images/2018/08/9/ktr.jpg.webp?itok=-UMJ_CPq)
మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్
సాక్షి, సిరిసిల్ల: తెలంగాణలోని 3.60 కోట్ల జనాభాకు ఏటా సంపూర్ణ ఆరోగ్య పరీక్షలు ప్రభుత్వమే నిర్వహించే దిశగా ముఖ్యమంత్రి యోచిస్తున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం తెర్లమద్ది గ్రామంలో బుధవారం ఆయన రైతుబీమా బాండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభమయ్యే కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
తాము చేసిన అభివృద్ధి విపక్ష పార్టీల నేతలకు కనబడటం లేదని, అందుకే వారు సైతం కంటి పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉందని ఎద్దేవా చేశారు. రైతులకు భవిష్యత్తుపై నమ్మకం, జీవితానికి ధీమా కల్పించడానికే రైతుబీమా పథకం చేపట్టామని మంత్రి పేర్కొన్నారు. పైసలిచ్చినా పనులెందుకు కావట్లేదని స్థానిక ప్రజాప్రతినిధులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు మంజూరు చేసే బాధ్యత తనదని, పనిచేయడం స్థానిక నాయకుల బాధ్యతని చెప్పారు. మొదటిసారిగా తెర్లమద్ది నుంచే తాను ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించానని, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎన్ని నిధులైనా మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment