హైదరాబాద్: ప్రభుత్వమే నీరాను ప్రోత్సహిస్తుందని, సాఫ్ట్‌డ్రింక్‌గా తయారు చేసి మార్కెటింగ్‌కు అవకాశం కల్పిస్తుందని ఐటీ, పురపాలక మంత్రి కె.తారక రామారావు తెలిపారు. గీత కార్మికుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. గీత కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్రంలో 3.70 కోట్ల ఈత, తాటి, గిరిక, ఖర్జూర మొక్కలను నాటుతున్నట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లా హిమాయత్‌సాగర్ ప్రధాన రహదారి వద్ద ఉన్న రాష్ట్ర ఎక్సైజ్ పోలీస్ అకాడమీలో శుక్రవారం ఈత మొక్కలు నాటే కార్యక్రమం, గౌడ ఆత్మీయ సదస్సులో మంత్రి మాట్లాడారు.
కుల వృత్తులకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రోత్సహిస్తోందని, రూ.43 వేల కోట్ల సంక్షేమ పథకాలతో దేశంలోనే రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని తెలిపారు. కడియం నర్సరీ నుంచి 12 వేల గిరిక, తాటి చెట్లను సిరిసిల్లకు తెప్పించామని, వీటిని పైలట్ ప్రాజెక్టుగా నాటి సంరక్షిస్తున్నామని చెప్పారు. తాటి, ఈత చెట్టును నరికితే జరిమానాను రూ.150 నుంచి రూ.2 వేలకు పెంచామన్నారు.
గౌడ కులస్తుల కోసం ఐదు ఎకరాల స్థలం, రూ.5 కోట్లు అందించామని, సొసైటీల బకాయిలను రద్దు చేశామని తెలిపారు. వైన్‌షాపు టెండర్లలో రిజర్వేషన్, ఇతర వృత్తుల్లోకి వెళ్లేవారికి రుణాలు అందించే విషయాలను సీఎంకు వివరిస్తామన్నారు. గత ప్రభుత్వం జంట నగరాల్లో బంద్ చేయించిన 103 సొసైటీలను తిరిగి ప్రారంభించి 50 వేల కుటుంబాలకు ఉపాధి చూపామని కేటీఆర్ పేర్కొన్నారు.
చరిత్రలో నిలిచిన సర్దార్ కేసీఆర్: స్వామిగౌడ్
శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ మాట్లాడుతూ గ్రామంలో ఒక గీత కార్మికుడు బాగుపడితే అనుబంధంగా 16 కులాలకు చెందిన వారు అభివృద్ధి చెందుతారన్నారు. తాటి చెట్టుపై పూర్తి హక్కును గౌడ సోదరులకు ఇవ్వాలన్నారు. ప్రైవేటు పట్టా భూముల్లో ఉన్న చెట్లపై యజమానులు రూ.1,000 వరకు అద్దె, కల్లు తీసుకోవడంతో గీత కార్మికుడు నష్టపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. 350 ఏళ్ల క్రితం సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ చెట్టుపై పన్ను రద్దు చేయాలని ఉద్యమం చేపట్టారని, ఇప్పుడు సర్దార్ కేసీఆర్ పన్నును రద్దు చేసి చరిత్రలో నిలిచారని కొనియాడారు.
చిచ్చా... రచ్చ చేసిండ్రు
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎంత సన్నిహితంగా ఉన్నప్పటికీ తన మనసులోని మాటలను చెప్పలేక పోతున్నానని ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం తనకు ఎక్సైజ్ శాఖను అప్పగించి కులసోదరులకు ఏదైనా చేయమని సలహా ఇచ్చారని, కానీ, వారికి ఏమి చేయలేక పోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాల్లో ఉన్న గీతకార్మికుల పరిస్థితి అధ్వానంగా మారిందని, వీరికి న్యాయం చేయాలన్నారు.
ఈ విషయాలను విన్న కేటీఆర్ ‘చిచ్చా... రచ్చ చేసిండ్రు’ అంటూ ప్రసంగాన్ని ప్రారంభిం చారు. గౌడ కులస్తులపట్ల ఆవేదనతో మాట్లాడా రని, దీనిని అర్థం చేసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, గాంధీ, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment