దుమ్ము రేపిన ధూంధాం | Pragathi nivedana sabha grand celebration with 2,000 artists | Sakshi
Sakshi News home page

దుమ్ము రేపిన ధూంధాం

Published Mon, Sep 3 2018 1:28 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM

Pragathi nivedana sabha grand celebration with 2,000 artists - Sakshi

ప్రగతి నివేదన సభలో కళాకారులతో కలసి మంత్రి కేటీఆర్‌ డోలు వాయించారు.రసమయి బాలకిషన్‌తో డోలు కొడుతూ స్టెప్పులేశారు. దీంతో ప్రాంగణమంతా సందడిగా మారింది. అక్కడి టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు కేటీఆర్‌ను ఎత్తుకొని అభినందించారు. అనంతరం కేటీఆర్‌ సభా ప్రాంగణంలో తిరుగుతూ కార్యకర్తలను పలకరించారు.
సాక్షి, హైదరాబాద్‌: హోరెత్తించే పాటలు.. డప్పుల దరువులు.. గజ్జెల మోత.. గుస్సాడీ వేషాలు.. లంబాడీ నృత్యాలతో కొంగరకలాన్‌ సభ హోరెత్తింది. తెలంగాణ సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్‌ బృందం ఆలపించిన పాటలతో సభ ధూంధాంగా సాగింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన మహిళలు, యువకులు, నేతలు.. 2,000 మందికి పైగా కళాకారులతో పాదం కలపడంతో 5 గంటల పాటు సభంతా సందడి నెలకొంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభా వేదికపైకి వచ్చేవరకూ గులాబీ దండు ధూంధాం పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు జనాలను హుషారెత్తించాయి. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై పాటలు పాడి సభికులను ఉత్సాహపరిచారు. గాయని మంగ్లీ ఆడుతూ పాడిన బతుకమ్మపాటలకు సభా వేదిక ముందున్న 1,000 మందికి పైగా మహిళలు బతుకమ్మ ఆడుతూ, కోలాటాలు వేస్తూ నృత్యాలు చేయడం సభకు కొత్త వన్నె తెచ్చింది.  

ఉరకలెత్తిన ఉత్సాహం: శివనాగులు పాడిన రంగస్థలంలోని ‘ఆ గట్టునుంటావా నాగన్న.. ఈ గట్టునుంటావా’పాటకు సభా ప్రాంగణం ఊగిపోయింది. యువకులు డ్యాన్సులతో అదరగొట్టారు. పాటను మళ్లీ పాడించాలని వేదికపై ఉన్న మంత్రులు కోరడంతో శివనాగులు మరోమారు పాట పాడి హుషారు తెచ్చారు. ‘సారా సారమ్మ సారా’, ‘రామా రామా ఎల్లమ్మరో’, ‘వీర తెలంగాణమా.. నాలుగు కోట్ల ప్రాణమా’, ‘లాయిల లల్లాయి.. లల్లాయిలే.. లల్లాయిలే’పాటలూ సభికుల్లో ఉత్సాహం నింపాయి. ఇక తెలంగాణ సంస్కృతి, చారిత్రక వైభవాన్ని చాటుతూ సుమారు 20 నిమిషాల పాటు ప్రదర్శించిన కళారూపాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, హరితహారం, ఆసరా పింఛన్లు వంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను పాటల్లో వినిపించారు. కళాకారుల ఆట–పాటలకు ఎమ్మెల్సీ రాములు నాయక్‌తో పాటు మరికొంత మంది కూడా పాదం కలుపుతూ నృత్యాలు చేశారు. ఎంపీ కవిత, డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌రెడ్డి, ఇతర మంత్రులు కళాకారుల పాటలకు చప్పట్లు కొడుతూ కనిపించారు.  

చంకన బిడ్డ.. చేతిలో జెండా 
చంకన చంటి బిడ్డ.. చేతిలో గులాబీ జెండాలతో వేలాదిగా మహిళలు కొంగరకలాన్‌కు కదం తొక్కారు. పెద్ద సంఖ్యలో ఆడ బిడ్డలు తరలిరావడంతో సభ కళకళలాడింది. టీఆర్‌ఎస్‌ మహిళా నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గులాబీ రంగు చీరలు ధరించి రావడంతో సభా ప్రాంగణం గులాబీమయమైంది. కొంత మంది మహిళలు కేసీఆర్‌ ఫొటోలున్న చెవి కమ్మలు, బొట్టు బిళ్లలు పెట్టుకొచ్చి అభిమానం చాటుకున్నారు. అమ్మ ఒడి, కేసీఆర్‌ కిట్‌ లాంటి పథకాల కింద లబ్ధిపొందిన తల్లులు తమ చంటి బిడ్డలతో తరలిరాగా.. ఆసరా పథకం కింద వృద్ధాప్య పింఛన్లు అందుకుంటున్న మహిళలు ఎంతో శ్రమపడి సుదూర ప్రాంతాల నుంచి సభకు వచ్చి కేసీఆర్‌ పట్ల అభిమానం చాటుకున్నారు. పెద్ద సంఖ్యలో లంబాడీలు, ఆదివాసీ మహిళలు సాంప్రదాయ దుస్తుల్లో వచ్చి నృత్యాలు చేయడం ఆకట్టుకుంది. మహిళలకు ఇబ్బందులు రాకుండా సభా వేదిక ముందు వరుసలో రెండు ప్రత్యేక గ్యాలరీలు కేటాయించారు. మహిళా పోలీసులు భద్రత కల్పించారు. వీరికి వలంటీర్లతో నీరందించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. టీఆర్‌ఎస్‌ మహిళా విభాగం నేతలు, ఆశ వర్కర్లు, అంగన్‌వాడీలు, కార్యకర్తలు ఉత్సాహంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని ఆటపాటలతో అలరించారు. సభా మైదానంలో ఎక్కడికక్కడే మహిళలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబమైన బోనాలు, బతుకమ్మ, కోలాటం ఆడారు.   

పారాచూట్‌తో పూల వర్షం
ప్రగతి నివేదన సభా ప్రాంగణంలో కార్యకర్తలు, నాయకులను ఆకట్టుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దాదాపు నాలుగు వందల ఎకరాల్లో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో కార్యకర్తలు, నాయకులపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పారాచూట్‌తో పూలవర్షం కురిపించారు. పైనుంచి పూలవాన కురవడంతో అందరూ ఆకాశం వైపు చూసి సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు.  

తనయకు తండ్రి సెల్యూట్‌
ఒకే వేదిక వద్ద తండ్రి నాన్‌కేడర్‌ ఎస్పీగా.. కూతురు ఐపీఎస్‌గా బందోబస్తు నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఉమామహేశ్వర శర్మ మల్కాజ్‌గిరి డీసీపీగా పనిచేస్తున్నారు. ఈయన కూతురు సింధూ శర్మ జగిత్యాల ఎస్పీ(ఐపీఎస్‌)గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే వీరిద్దరూ కొంగరకలాన్‌లో జరుగుతున్న ప్రగతి నివేదన సభలో విధులు నిర్వహిస్తూ ఒకరికొకరు తారసపడ్డారు. తండ్రికి 33 ఏళ్ల సర్వీస్‌ ఉన్నప్పటికీ కూతురు ఐపీఎస్‌ అధికారిణి కావడంతో సెల్యూట్‌ కొట్టక తప్పలేదు. ఈ దృశ్యాన్ని చూసిన పోలీసు అధికారులు, ప్రజలు ఒకింత ఆశ్చర్యం, ఆనందానికి గురయ్యారు.  

కేసీఆర్‌ ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం కేసీఆర్‌ కిట్, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మీ లాంటివాటితో పాటు పింఛన్లు, ఆసరా వంటి అనేక సంక్షేమ పథకాలు అమల్లోకి తెచ్చింది. మహిళల రక్షణ కోసం షీ టీమ్స్‌ ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
- అంజమ్మ, హైదర్‌నగర్,కూకట్‌పల్లి 

తెలంగాణ ఏర్పడి సీఎంగా కేసీఆర్‌ బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించింది. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని అభివృద్ధిని నాలుగున్నరేళ్లలో కేసీఆర్‌ ప్రభుత్వం చేసింది. అనేక సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలకు అందాయి.  
– రాధిక,రాజీవ్‌ గృహకల్ప,నిజాంపేట 

కేసీఆర్‌ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారు.అన్ని కుల సంఘాలకు భవనాలతో పాటు ప్రత్యేక నిధులను కూడా విడుదల చేశారు. ఇలా ప్రతి ఒక్కరిని సమపాళ్లలో
చూస్తూ వారి అభివృద్ధికి కృషి చేస్తున్న నాయకుడు కేసీఆర్‌.  
- వెంకటలక్ష్మీ,మూసాపేట

గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి నంబర్‌వన్‌ సీఎంగా ఉండేవారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా ప్రజలకు ఇచ్చిన హామీలకంటే రెట్టింపు పథకాలు అమలు చేస్తున్నారు. 
-కీర్తి రెడి,్డటీఆర్‌ఎస్‌ నేత

ప్రగతి నివేదిన సభను స్వయంగా వీక్షించాలని భావించా. కేవలం దీని కోసమే కువైట్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చా. చాలా సంతోషంగా ఉంది. కేసీఆర్‌పై ఉన్న అభిమానమే నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది. 
-అభిలాష, కువైట్‌

సంక్షేమ పథకాల అమలులో కేసీఆర్‌ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.పేదలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ఆయన అహర్నిశలు కృషి చేస్తున్నారు.వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారం చేపడుతుంది. 
-శ్రీకాంత్‌గౌడ్, కాప్రా

రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ చేసిన అభివృద్ధి పట్ల అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. కులమతాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ముఖ్యంగా ముస్లిం మైనార్టీ ప్రజలకు షాదీ ముబారక్‌ లాంటి పథకాలు ఎంతో మేలు చేశాయి. 
-ఇలియాజ్‌ ఖురేషి,  టీఆర్‌ఎస్, చార్మినార్‌ నియోజకవర్గం కన్వీనర్‌  

సౌకర్యాలు సూపర్‌
ప్రగతి నివేదన సభకు హాజరయ్యే పార్టీ కార్యకర్తలు, అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ ఏర్పాట్లు చేశారు. తాగునీటిని సభా ప్రాంగణంలో అందుబాటులో ఉంచారు. స్వయంగా కార్యకర్తలే వాటర్‌ బాటిళ్లను మోసుకొచ్చారు. సభ ప్రాంగణంలో జొన్న రొట్టెల పంపిణీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎమ్మెల్సీ రాములు నాయక్‌ ఆధ్వర్యంలో బంజారా మహిళలు జొన్నరొట్టెలు, కూరలు తయారు చేసి వచ్చే వాళ్లకు అందిస్తున్నారు. నాయకుల ప్రసంగాలు కార్యకర్తలకు స్పష్టంగా వినిపించేందుకు వేదిక వద్ద ఎనిమిది వైర్‌లెస్‌ మైక్రో కెమెరాలు, ఫోన్లు ఏర్పాటు చేశారు. 3,000 వాట్ల శక్తి గల 88 స్పీకర్లు ఏర్పాటు చేశారు. వేదికపై ఉన్న నేతలను చూసేందుకు 50కిపైగా ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణం విద్యుత్‌ కాంతులతో మెరిసిపోయింది. 800 కేవీఏ విద్యుత్‌ అవసరం ఉంటుందని భావించిన డిస్కం ఆ మేరకు 60పైగా అదనపు ట్రాన్స్‌ఫార్మర్లను అందుబాటులో ఉంచడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. అనారోగ్యానికి గురైన కార్యకర్తలకు యశోద, స్టార్, మల్లారెడ్డి, నారాయణ హృదయాలయ ఆస్పత్రులకు చెందిన సుమారు 300 మంది వైద్య సిబ్బంది సభాస్థలి వద్ద సేవలు అందించారు. హరిత టాయ్‌లెట్లను భారీగానే ఏర్పాటు చేసినా.. అవి కార్యకర్తల అవసరాలు తీర్చలేకపోయాయి. కార్యకర్తలు టాయ్‌లెట్ల ముందు క్యూ కట్టాల్సి వచ్చింది. పార్కింగ్‌ వద్ద ఎలాంటి ఇబ్బంది కనిపించలేదు. అయితే ఓఆర్‌ఆర్‌ నుంచి సభాస్థలికి వెళ్లే మార్గాలన్నీ ద్విచక్రవాహనాలు, జనంతో జామ్‌ అయ్యాయి. దీంతో బస్సులు, కార్లు, ఇతర భారీ వాహనాల్లో సభకు వచ్చిన వారు ఇబ్బంది పడాల్సి వచ్చింది.  
– సాక్షి, హైదరాబాద్‌

పోటెత్తిన వాహనాలు..జంక్షన్లు జామ్‌ 
రోడ్లపైనే నిలిచిపోయిన వాహనాలు 
సభకు చేరకుండానే సగం వెనక్కి 
డ్రైవర్లకు అవగాహన లేకపోవడమే కారణం 
సభకు వెళ్లే దారిలో ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో తిరిగి వెళ్లిపోతున్న బస్సులు  


సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: టీఆర్‌ఎస్‌ ‘ప్రగతి నివేదన’సభకు వాహనాలు పోటెత్తాయి. రాష్ట్రం నలుమూలల నుంచి కొంగరకలాన్‌ బాట పట్టిన ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల్లో సగం సభాస్థలికి చేరకుండానే వెనుదిరిగాయి. కొన్ని మార్గమధ్యంలోనే నిలిచిపోయాయి. కార్యకర్తల అత్యుత్సాహం కూడా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించింది. ఏ రోడ్డు గుండా సభా ప్రాంతానికి వెళ్లాలనే అంశంపై డ్రైవర్లకు అవగాహన లేకపోవడం, రింగ్‌ రోడ్డు జంక్షన్లలో పోలీసులను నియమించకపోవడంతో గందరగోళం తలెత్తింది. ఉత్తర తెలంగాణ, వికారాబాద్, ఖమ్మం తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వాహనాలను ఎక్కడ మళ్లించాలన్న అంశంపై పోలీసులు తికమకపడ్డారు. ఈ ప్రాంతాల గుండా వచ్చిన వాహనాలు ఔటర్‌ జంక్షన్లలో దిగి సర్వీసు రోడ్డు గుండా నిర్దేశిత పార్కింగ్‌ ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వికారాబాద్, బెంగళూరు జాతీయ రహదారి, ముంబై మార్గాల నుంచి వచ్చిన వాహనాలు తుక్కుగూడ దగ్గర దిగాల్సి ఉండగా బొంగ్లూరు జంక్షన్‌లో దిగాయి. మధ్యాహ్నం 2:30 గంటల తర్వాత వాహనాల తాకిడి మరింత పెరగడం.. ఊరేగింపులు, రావడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 

సూచించేవారు లేక... 
పోలీసులు, వాహనాల డ్రైవర్లు స్థానికేతరులు కావడంతో ఏ మార్గాన్ని అనుసరించాలో తెలియక అయోమయంలో పడ్డారు. ఉప్పల్, బోడుప్పల్, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి వచ్చే వాహనాల రద్దీ ఊపందుకుంది. దీనికితోడు ఇబ్రహీంపట్నం నుంచి సాధారణ వాహనాల రాకపోకలు తోడయ్యాయి. వాహనాలు పోటెత్తడంతో రాత్రి ఏడు గంటల వరకు ట్రాఫిక్‌ తిప్పలు తప్పలేదు. దీంతో కార్యకర్తలు అలసటకు గురయ్యారు. కార్యకర్తలు మాత్రం సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న సభాప్రాంగణానికి కాలినడకన చేరుకున్నారు. ఓఆర్‌ఆర్‌కు ఇరువైపులా ఉన్న సర్వీసు రోడ్లు వాహనాలతో నిండిపోయాయి. వంద మీటర్ల దూరం పోవడానికి కనీసం అరగంట సమయం పట్టింది. రావిర్యాల, వండర్‌ లా, ఆదిబట్లకు వెళ్లే జంక్షన్ల వద్ద ట్రాఫిక్‌ తిప్పలు అధికంగా కనిపించాయి. వాహనాలు తిరిగి వెళ్లేటప్పుడు ట్రాఫిక్‌ జామ్‌ మరింత ఎక్కువైంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement