soft drink
-
‘రస్నా’ ఫౌండర్ కన్నుమూత, ‘మిస్ యూ’ అంటున్న అభిమానులు
సాక్షి, ముంబై: గ్లోబల్ సాఫ్ట్ డ్రింక్ మార్కెట్లో సంచలనం సృష్టించిన దేశీయ శీతల పానీయం ‘రస్నా’ వ్యవస్థాపకుడు అరిజ్ పిరోజ్షా ఖంబట్టా కన్నుమూశారు. 85 సంవత్సరాల వయస్సులో శనివారం మరణించినట్లు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో కంపెనీ తెలిపింది. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో అహ్మదాబాద్‌లో మరణించినట్లు ప్రకటించింది. అరిజ్ ఖంబట్టా బెనివలెంట్ ట్రస్ట్, రస్నా ఫౌండేషన్‌కు ఛైర్మన్‌గా కూడా ఉన్నారు. పలువురు వ్యాపార దిగ్గజాలు ఖంబట్టా మృతిపై సంతాపం ప్రకటించారు.ఐకానిక్ డ్రింక్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన మిమ్మల్ని మరువలేం.. మిస్ యూ సార్ అంటూ అభిమానులు ఆయనకు నివాళి అర్పిస్తున్నారు. 1980-90లలో ఏ నోట విన్నా ‘ఐ లవ్ యూ రస్నా’ అన్న మాట వినబడేది. ఫంక్షన్ ఏదైనా, సందర్భంగా ఏదైనా రస్నా నాలేని పార్టీ లేదంటే అతిశయోక్తి కాదు. మ్యాంగో, ఆరెంజ్, నింబూ ఇలా పలు ఫ్లేవర్లలో ప్రపంచవ్యాప్తంగా 60 దేశాల్లో పాపులర్ అయిన డ్రింక్ రస్నా మార్కెట్ లీడర్‌గా ఉంది. 1970 లలో అధిక ధరలకు విక్రయించే శీతల పానీయాల ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా రస్నా బహుళ ప్రజాదరణ పొందింది. దేశంలోని 18 లక్షల రిటైల్ ఔట్లెట్లలో సామాన్యులకు సైతం అందుబాటులో ధరలో పాపులర్ బ్రాండ్‌గా నిలిచింది. అరిజ్ కు భార్య పెర్సిస్ , పిల్లలు పిరుజ్, డెల్నా రుజాన్, కోడలు బినైషా , మనవళ్లు అర్జీన్, అర్జాద్, అవన్, అరీజ్, ఫిరోజా, అర్నావాజ్ ఉన్నారు. దశాబ్దాల క్రితం అరిజ్ తండ్రి ఫిరోజా ఖంబట్టా నిరాడంబరమైన వ్యాపారాన్ని ప్రారంభించారు. దీని వ్యవస్థాపక ఛైర్మన్ అరీజ్నేతృత్వంలో రస్నా ది ఇంటర్నేషనల్ టేస్ట్ అండ్ క్వాలిటీ ఇన్స్టిట్యూట్, బెల్జియం కేన్స్ లయన్స్ లండన్, మోండే సెలక్షన్ అవార్డు, మాస్టర్ బ్రాండ్ ది వరల్డ్ బ్రాండ్ కాంగ్రెస్ అవార్డు, ITQI సుపీరియర్ టేస్ట్ అండ్ క్వాలిటీ అవార్డుతో సహా ప్రతిష్టాత్మకమైన సుపీరియర్ టేస్ట్ అవార్డ్ 2008తో సహా పలు అవార్డులను గెలుచుకుంది. -
బిలియన్ డాలర్ బ్రాండ్‌గా స్ప్రైట్
న్యూఢిల్లీ: నిమ్మ రసం రుచిని తలపించే సాఫ్ట్‌డ్రింక్ స్ప్రైట్.. భారత మార్కెట్లో బిలియన్ డాలరు (దాదాపు రూ. 8,300 కోట్లు) బ్రాండుగా ఎదిగింది. బ్రాండ్ మాతృ సంస్థ కోక–కోలా కంపెనీ చైర్మన్ జేమ్స్ క్విన్సీ ఈ విషయం వెల్లడించారు. 2022 మూడో త్రైమాసికంలో భారత మార్కెట్లో అమ్మకాల పరిమాణం గణనీయంగా పెరిగిందని ఆయన తెలిపారు. ప్రథమార్ధంలో కోక–కోలా మార్కెట్ షేరును పెంచుకోవడం కొనసాగిందని పేర్కొన్నారు. స్థానిక పరిస్థితులకు, సందర్భాలకు అనుగుణంగా నిర్వహించిన ప్రచార కార్యక్రమాలు, ప్రకటనలతో స్ప్రైట్ బిలియన్ డాలర్ బ్రాండుగా మారిందని క్విన్సీ వివరించారు. కోక–కోలాకు అంతర్జాతీయంగా భారత్ అయిదో అతి పెద్ద మార్కెట్. దేశీ సాఫ్ట్ డ్రింక్ థమ్స్ అప్ 2021లో బిలియన్ డాలర్ బ్రాండ్‌గా చేరిందని ఈ ఏడాది జనవరిలో కంపెనీ ప్రకటించింది. చదవండి: షాపింగ్ బంద్, యూపీఐ లావాదేవీలు ఢమాల్.. ఏమయ్యా విరాట్ కోహ్లీ ఇదంతా నీ వల్లే! -
మెక్ డొనాల్డ్స్ నిర్వాకం: కూల్ డ్రింకులో చచ్చిన బల్లి..చివరికి
అహ్మదాబాద్: కూల్ డ్రింక్స్‌లో పురుగు మందుల అవశేషాలున్నాయని అనేక రిపోర్టులు చెబుతున్నా పట్టించుకోని శీతల పానీయాల ప్రియులకు మరో షాకింగ్ న్యూస్. తాజాగా అహ్మదాబాద్‌లోని మెక్ డొనాల్డ్స్ రెస్టారెంట్‌కు వెళ్లిన ఇద్దరు స్నేహితులకు చేదు అనుభవం ఎదురైంది. భార్గవ జోషి అనే వ్యక్తి ఆర్డర్ చేసిన కూల్ డ్రింకులో చచ్చిన బల్లి దర్శనమిచ్చింది. బల్లిని చూసి షాకైన భార్గవ జోషి రెస్టారెంట్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లి, ఇందేంటని నిలదీశాడు. అయితే ఈ వ్యవహారాన్ని లైట్ తీసుకున్న సిబ్బంది డబ్బులు వాపస్ ఇస్తాం అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారు. దీంత కడుపు మండి మున్సిపల్ అధికారులకు చేరేలా చేశాడు. ఈ సందర్భంగా తాను వీడియోను పోలీసులకు, అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ట్యాగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు భార్గవ జోషి. అంతే క్షణాల్లో ఈ వీడియో వైరల్ అయింది. ఈ వ్యవహారంపై అహ్మదాబాద్ పురపాలక శాఖ స్పందించింది. మెక్ డొనాల్డ్స్ అవుట్ లెట్లో తనిఖీలు చేపట్టిన అధికారులు రెస్టారెంట్ అవుట్ లెట్‌కు సీల్ వేశారు. కూల్ డ్రింకు శాంపిల్స్ ను పబ్లిక్ హెల్త్ ల్యాబ్‌కి పంపించినట్టు వెల్లడించారు. Here is video of this incidents happens with me...@McDonalds pic.twitter.com/UiUsaqjVn0 — Bhargav joshi (@Bhargav21001250) May 21, 2022 -
సహజసిద్ధ జీవనధార... ‘నీరా’
బహుళ జాతి సంస్థల శీతలపానీయాల ప్రచా రం ముందు తట్టుకోలేక తలవంచిన అరుదైన దేశీయ ఆరోగ్య పానీ యాల్లో నీరా ఒకటి. తాటి, ఈత, ఖర్జూరా, జీరిక, కొబ్బరి వంటి నిట్టనిలువుగా పెరిగే చెట్ల నుంచి కారే తీయటి పానీయం నీరా. ఆల్క హాల్ ఏమాత్రం లేని నీరా ఎన్నో పోషకవిలువలు కలిగిన దేశీయ పానీయం. తెలంగాణ, కేరళ, తమిళనాడు, బిహార్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో వాడుకలో ఉన్న నీరా, దాని అనుబంధ ఉత్పత్తులు 1990ల తర్వాత బహుళ జాతి కంపెనీలు, కార్పొరేట్ సంస్థల పోటీని తట్టుకోలేక పరిశ్రమే మూతపడిపోవడం విచారకరం. ఆహార అలవాట్లు మారటంతో ప్రజల ఆరోగ్యాలు దెబ్బతిని రోగాల బారిన పడటం ఎక్కువైంది. ఈ నేపథ్యంలో పాత ఆహార అలవాట్లు మళ్లీ ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. కాబట్టి ప్రకృతి సహజ పానీయమైన నీరాను దాని అనుబంధ ఉత్పత్తులను మళ్లీ మార్కెట్లోకి తీసుకువస్తే ప్రజారోగ్యానికి చక్కటి పునాది ఏర్పడే అవకాశం ఎంతైనా ఉంది. నీరాను అన్ని వయసుల వారు స్త్రీలు, గర్భిణీ స్త్రీలు, పిల్లలు కూడా తాగవచ్చు. తెలంగాణలో కోటికి పైగా ఉన్న తాటిచెట్లు, ఈత చెట్లనుంచి తీస్తున్న నీరాను తియ్యటి కల్లుగా పిల్చుకుంటూ నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు సేవిస్తున్నారు. అయితే నీరాకు, కల్లుకు వ్యత్యాసముంది. సహజసిద్ధమైన పోషక విలువలు గల తీయటి ఆహార పానీయం ‘నీరా’. దీంట్లో విశేషం ఏమిటంటే, అప్పుడే చెట్ల నుంచి తీసిన నీరాలో ఆల్కహాల్ అస్సలు ఉండదు. తాజాగా చెట్లనుంచి సేకరించిన నీరాలో సుక్రోసు, ప్రోటీన్సు, ఆస్కార్బిక్ యాసిడ్, థయామిన్, రిబోప్లెవిన్, విటమిన్ సి, పాలలో కంటే ఎక్కువ కెలోరీల శక్తి, పోలిక్ యాసిడ్, ఇతర విటమిన్లు కూడా ఉన్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. నీరాను ప్రధానంగా తాటి, ఈత చెట్ల నుంచి తీస్తారు. ప్రతిరోజూ సూర్యాస్తమయం తర్వాత కుండను తాటి, ఈత చెట్లకు కట్టి సూర్యోదయం కన్నా ముందే కుండను దింపి వెంటనే అతి తక్కువ ఉష్ణోగ్రతలో నిల్వ ఉంచుతారు. సూర్యోదయం తర్వాత తీసినా, ఎండ, గాలి ఎక్కువగా తగిలినా తొందరగా పులిసిపోతుంది. ప్రధానంగా ఉష్ణమండల ప్రాంతాలైన భారత్ వంటి అనేక దేశాల ప్రజలకు నీరా ఆరోగ్య ప్రదాయిని అని చెప్పాలి. ఉష్ణమండల దేశాల్లో మనుషులు త్వరగా అలసిపోయి శరీరం పోషకాలను వేగంగా కోల్పోతారు కనుక ఈ నీరాను సేవించడం వల్ల తక్షణ శక్తి శరీరానికి అందుతుంది. శరీరానికి త్వరగా శక్తిని అందించే ఈ రీహైడ్రేషన్ ప్రక్రియ శరీరానికి చలవ చేస్తుంది. మూత్ర సంబంధిత వ్యాధులు, కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు ఈ నీరా సేవించడం వల్ల త్వరగా నయం అయినట్లు ఆధారాలున్నాయి. కామెర్లవ్యాధికి ఇది ఔషధంగా పని చేస్తుంది. జీర్ణశక్తిని పెంచి, మలబద్దకాన్ని పోగొట్టే నీరాను సేవిస్తే గ్యాస్ట్రిక్ సమస్య తొందరగా తగ్గుతుంది. ఇటీవల ఉస్మానియా యూని వర్సిటీ సూక్ష్మ జీవ శాస్త్ర విభాగం చేసిన పరిశోధనల్లో నీరా కేన్సర్ నివారణకు ఉపయోగపడుతుందని తేల్చడంతో దీని వివరాలు అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి కూడా. మధుమేహ రోగులకు నీరా వరం లాంటిది. తెలంగాణ ప్రభుత్వం నీరాను ఆల్కహాల్ లేని పానీయంగా ప్రకటిస్తూ ఎక్సైజ్ చట్టంలో మార్పులు చేయాలి. చెట్లను నీరాకోసం ప్రత్యేకంగా కేటాయిస్తూ, నీరా సేకరణకు, రవాణాకు, అమ్మకానికి అనుమతులి వ్వాలి. తద్వారా గీతవృత్తిలో ఉన్న పలువురు గౌడ యువకులకు ఉపాధి లభించడంతోపాటు రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన ఆరోగ్యకరమైన ప్రకృతి పానీయం అందుబాటులోకి వస్తుంది. నీరాకు సహజపానీయంగా ప్రచారం కల్పించి మధ్యతరగతి, ఉన్నత స్థాయి వారికి కూడా అందుబాటులోకి వచ్చే విధంగా ప్రభుత్వం వివిధ పట్టణాల్లో కస్టమర్ లైన్‌ని అందుబాటులోకి తేవాలి. గీత కార్మికుల ఆర్థిక అభివృద్ధి రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కూడా దోహదకారి. (తెలంగాణ ప్రభుత్వం నీరా అమ్మకాలను అనుమతిస్తూ ఇటీవలే జీవోఎంఎస్ 116ని జారీ చేసిన సందర్భంగా) వ్యాసకర్త: డా. ఆనంద్ గోపగోని, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఓయూ మొబైల్: 98482 56042 -
ప్రభుత్వమే నీరాను ప్రోత్సహిస్తుంది
హైదరాబాద్: ప్రభుత్వమే నీరాను ప్రోత్సహిస్తుందని, సాఫ్ట్‌డ్రింక్‌గా తయారు చేసి మార్కెటింగ్‌కు అవకాశం కల్పిస్తుందని ఐటీ, పురపాలక మంత్రి కె.తారక రామారావు తెలిపారు. గీత కార్మికుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. గీత కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్రంలో 3.70 కోట్ల ఈత, తాటి, గిరిక, ఖర్జూర మొక్కలను నాటుతున్నట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లా హిమాయత్‌సాగర్ ప్రధాన రహదారి వద్ద ఉన్న రాష్ట్ర ఎక్సైజ్ పోలీస్ అకాడమీలో శుక్రవారం ఈత మొక్కలు నాటే కార్యక్రమం, గౌడ ఆత్మీయ సదస్సులో మంత్రి మాట్లాడారు. కుల వృత్తులకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రోత్సహిస్తోందని, రూ.43 వేల కోట్ల సంక్షేమ పథకాలతో దేశంలోనే రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని తెలిపారు. కడియం నర్సరీ నుంచి 12 వేల గిరిక, తాటి చెట్లను సిరిసిల్లకు తెప్పించామని, వీటిని పైలట్ ప్రాజెక్టుగా నాటి సంరక్షిస్తున్నామని చెప్పారు. తాటి, ఈత చెట్టును నరికితే జరిమానాను రూ.150 నుంచి రూ.2 వేలకు పెంచామన్నారు. గౌడ కులస్తుల కోసం ఐదు ఎకరాల స్థలం, రూ.5 కోట్లు అందించామని, సొసైటీల బకాయిలను రద్దు చేశామని తెలిపారు. వైన్‌షాపు టెండర్లలో రిజర్వేషన్, ఇతర వృత్తుల్లోకి వెళ్లేవారికి రుణాలు అందించే విషయాలను సీఎంకు వివరిస్తామన్నారు. గత ప్రభుత్వం జంట నగరాల్లో బంద్ చేయించిన 103 సొసైటీలను తిరిగి ప్రారంభించి 50 వేల కుటుంబాలకు ఉపాధి చూపామని కేటీఆర్ పేర్కొన్నారు. చరిత్రలో నిలిచిన సర్దార్ కేసీఆర్: స్వామిగౌడ్ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ మాట్లాడుతూ గ్రామంలో ఒక గీత కార్మికుడు బాగుపడితే అనుబంధంగా 16 కులాలకు చెందిన వారు అభివృద్ధి చెందుతారన్నారు. తాటి చెట్టుపై పూర్తి హక్కును గౌడ సోదరులకు ఇవ్వాలన్నారు. ప్రైవేటు పట్టా భూముల్లో ఉన్న చెట్లపై యజమానులు రూ.1,000 వరకు అద్దె, కల్లు తీసుకోవడంతో గీత కార్మికుడు నష్టపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. 350 ఏళ్ల క్రితం సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ చెట్టుపై పన్ను రద్దు చేయాలని ఉద్యమం చేపట్టారని, ఇప్పుడు సర్దార్ కేసీఆర్ పన్నును రద్దు చేసి చరిత్రలో నిలిచారని కొనియాడారు. చిచ్చా... రచ్చ చేసిండ్రు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎంత సన్నిహితంగా ఉన్నప్పటికీ తన మనసులోని మాటలను చెప్పలేక పోతున్నానని ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం తనకు ఎక్సైజ్ శాఖను అప్పగించి కులసోదరులకు ఏదైనా చేయమని సలహా ఇచ్చారని, కానీ, వారికి ఏమి చేయలేక పోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాల్లో ఉన్న గీతకార్మికుల పరిస్థితి అధ్వానంగా మారిందని, వీరికి న్యాయం చేయాలన్నారు. ఈ విషయాలను విన్న కేటీఆర్ ‘చిచ్చా... రచ్చ చేసిండ్రు’ అంటూ ప్రసంగాన్ని ప్రారంభిం చారు. గౌడ కులస్తులపట్ల ఆవేదనతో మాట్లాడా రని, దీనిని అర్థం చేసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, గాంధీ, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎక్కడైనా ఒకటే రేటు
♦ స్నాక్స్, సాఫ్ట్‌డ్రింక్‌ల రేట్లపై కేంద్రం నోటిఫికేషన్ ♦ మాల్స్, ఎయిర్‌పోర్ట్‌లలో అధిక ధరలతో విక్రయాలకు చెక్ ♦ 2018 జనవరి 1 నుంచి కొత్త విధానం అమల్లోకి న్యూఢిల్లీ: శీతల పానీయాలు, స్నాక్స్ మొదలైన వాటిని ఎక్కడైనా ఒకే ఎంఆర్పీకి విక్రయించాలని, ప్రదేశాన్ని బట్టి అధిక ధరలకు అమ్మరాదని కేంద్రం స్పష్టం చేసింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చేలా ద్వంద్వ ఎంఆర్పీ (గరిష్ట చిల్లర ధర) విధానాన్ని నిషేధిస్తూ కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ తాజాగా ఆదేశాలు విడుదల చేసింది. దీంతో జనవరి 1 నుంచి విమానాశ్రయాలు, హోటళ్లు, మాల్స్ వంటి ప్రీమియం ప్రాంతాల్లో స్నాక్స్, సాఫ్ట్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ మొదలైన వాటిని అధిక రేటుకు విక్రయించడానికి ఉండదు. మహారాష్ట్ర లీగల్ మెట్రోలజీ ఆర్గనైజేషన్ (ఎల్ఎంవో) విజ్ఞప్తి మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ద్వంద్వ ఎంఆర్పీ విధానాలు పాటించొద్దంటూ కోకకోలా, పెప్సీ, రెడ్ బుల్ తదితర వినియోగవస్తువుల తయారీ కంపెనీలకు ఆన్లైన్ షాపింగ్ సంస్థలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లకు ఎల్ఎంవో కొత్తగా నోటీసులు జారీ చేసింది. గతంలో కూడా ఇలాంటి నోటీసులు ఇచ్చినప్పటికీ.. ఆయా కంపెనీలు వివిధ మార్గాల్లో వీటిని దాటవేసేవని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం కిరాణా దుకాణాల్లో మొదలైన వాటిల్లో విక్రయించే స్నాక్స్, సాఫ్ట్ డ్రింక్స్ లాంటి వాటి రేట్లకు.. మాల్స్, హోటల్స్, ఎయిర్‌పోర్ట్‌లాంటి ప్రదేశాల్లో విక్రయించే ధర మధ్య వ్యత్యాసముంటోంది. ప్రీమియం ప్రదేశాల్లో అమ్మే వాటికి వేరుగా అధిక ఎంఆర్పీ ముద్రించి కంపెనీలు సరఫరా చేయడం జరుగుతోంది. ఈ విధానాలు కూడదంటూ గతంలోనూ అనేక సార్లు ఆదేశించినా ఇలాంటి రెండు రకాల ఎంఆర్పీ విధానంపై నిర్ధిష్ట చట్టంలో ప్రత్యేక నిబంధనలేమీ లేవంటూ పెద్ద కంపెనీలు కోర్టులకెళ్లి ఉత్తర్వులు తెచ్చుకునేవని ఎల్ఎంవో కంట్రోలర్ అమితాబ్ గుప్తా తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఒకే ఉత్పత్తికి రెండు రకాల ఎంఆర్పీలు విధించకుండా సదరు చట్టాన్ని సవరించినట్లు చెప్పారు. ఒకవేళ కంపెనీలు ఉత్తర్వులను ఉల్లంఘిస్తే... తమకు ఫిర్యాదు చేయాలని కొనుగోలుదారులకు సూచించారు. -
దాతృత్వంలో డాన్!
నల్లవాళ్లలో ఆయనంత ఉన్నవారెవరూ లేరు... అని అంటోంది ప్రపంచం. తన దాతృత్వంతో తనంతటి మనసున్న వాళ్లు కూడా ఎవరూ లేరని నిరూపించుకొన్నాడాయన. ఆయన పేరు అలికో డాన్గోట్. నైజీరియాకు చెందిన ఈ వ్యాపారవేత్త ఫోర్బ్స్ ఎంపిక చేసిన ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో 23 వస్థానంలో ఉన్నారు. టాప్ 25లో నిలిచిన తొలి ఆఫ్రికన్‌గా గుర్తింపు పొందారు. అదే సమయంలో భారీస్థాయిలో తన ఆస్తులను ఆఫ్రికన్ల అభ్యున్నతి కోసం ఖర్చుపెడుతున్న వ్యక్తిగా కూడా డాన్గోట్కు గుర్తింపు వచ్చింది. సినిమాల్లో హీరోలు చిన్న వ్యాపారం మొదలుపెట్టి కోటీశ్వరులుగా ఎదిగిపోవడాన్ని చూసి మనమంతా ఆశ్చర్యపోతాం కానీ... అలా అత్యంత సాధారణస్థితి నుంచి కోటీశ్వరులుగా ఎదిగిన వారు నిజజీవితంలో కూడా ఉంటారనేదానికి ఒకానొక నిరూపణ అలికో డాన్గోట్. ఈ నైజీరియన్ 1977లో ఒక చిన్న వ్యాపారంతో కెరీర్ మొదలుపెట్టాడు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆయన వ్యాపారమే జీవనాధారంగా, ఆ వ్యాపారాన్నే పెకైదగడానికి నిచ్చెనగా చేసుకొని ఎదిగాడు. ప్రస్తుతం వేల, లక్షల కోట్లకు అధిపతి అయ్యాడు. 24 బిలియన్ డాలర్లు...ఫుడ్ ప్రాసింగ్ యూనిట్లు, సాఫ్ట్‌డ్రింక్ ప్రోడక్ట్‌లు, బ్రేవరీస్ కంపెనీలు, సిమెంట్ ఫ్యాక్టరీలు, వేల మంది ఉద్యోగులు, ఐదు ఆఫ్రికన్ దేశాల్లో వ్యాపార సామ్రాజ్యం... ఇదీ డాన్గోట్ స్థాయి. 1981లో తన వ్యాపార సంస్థలన్నింటికీ కలిపి డాన్గోట్ గ్రూప్‌గా పేరు పెట్టాడాయన. ఇప్పుడు ఆఫ్రికాలోనే ఇది ఒక ప్రముఖమైన వ్యాపార సంస్థ. డాన్గోట్ సంపాదన తీరు ఇలా ఉంటే... ఈయన దాతృత్వంలో కూడా ఇంతే ఘనమైన స్థాయిలో ఉన్నారు. ఈ ఏడాదిలో 120 కోట్ల మొత్తాన్ని సేవాకార్యక్రమాల కోసం వినియోగించేందుకు నిర్ణయం తీసుకొన్నారు. ‘డాన్గోట్ ఫౌండేషన్’ ద్వారా ఆప్రికాలో అభివృద్ధి కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తామని ఆయన ప్రకటించారు. భవిష్యత్తులో తమ సేవాకార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామని ఆయన అన్నారు. ఈ విధంగా కేవలం ఆస్తుల సంపాదనతోనే కాకుండా ఇలాంటి దాతృత్వంతో కూడా ఆయన డాన్ అనిపించుకొన్నారు. -
‘ఫాంటా మామ్’ ఆవిర్భావం
అన్నానగర్ : శీతల పానీయదారుల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రముఖ సాఫ్టుడ్రింక్ ఉత్పత్తిదారు కోకో కోలా ఇండియా తన ఉత్పత్తుల్లోని ‘ఫాంటా’ పానీయం ద్వారా ‘స్నాక్ టైం- ఫాంటా టైం’ అనే నినాదంతో ఒక వినోదాత్మక యానిమేషన్ పాత్రను ‘ఫాంటామామ్’ పేరుతో అన్ని చానల్స్‌లోనూ, ఫ్రింట్ మీడియాలో ప్రచారానికి వుంచిందని కోకో కోలా మార్కెటింగ్ విభాగం ఉపాధ్యక్షుడు దేవబాత్ర ముఖర్జీ విలేకరులకు తెలిపారు. వినోదంతో పాటుగా విజ్ఞానాన్ని కూడా పంచే ఈ కార్టూన్ వ్యాపార ప్రకటనను ఓ అండ్ ఎం అడ్వర్టైజింగ్ సంస్థ ఈసీడీ అజయ్గవాట్, ఎస్సీడీ శైలేందర్ మహాజన్ రూపొందించారన్నారు. ‘నోమూడ్’ యానిమేషన్ ఈ లఘుచిత్రాన్ని రూపొందించడంలో ఎంతో శ్రద్ధ వహించిందన్నారు. ఇందులోని గీతాన్ని అమితాబ్ భట్టాచార్య రాయగా, సంగీతాన్ని విజయ్ ఆంటోని అందించారన్నారు. ఈ వ్యాపార ప్రకటన ద్వారా వచ్చే ఆదాయాన్ని సపోర్టు మై స్కూల్ ప్రోగ్రామ్, పరివర్తన్, ప్రగతి వంటి సాంఘీక సంక్షేమ పథకాలను అందచేస్తామన్నారు. ఈ సొమ్ములో కొంతభాగాన్ని ఁఫైవ్ బీ వై ట్వంటీ ఉన్నతి* అనే పథకం కింద దేశంలో సాగుతున్న మామిడి పంటల రక్షణ కోసం వినియోగిస్తామన్నారు. -
గోలీ సోడాతో గోల్ కొట్టారు!
గోదావరికెళితే ఆర్టోస్ కూల్‌డ్రింక్ తాగాల్సిందే 50 ఏళ్ల కిందట ఆరంభం... ఏటా రూ.15 కోట్ల వ్యాపారం కోక్... కొంటామన్నా విక్రయించడానికి యాజమాన్యం నో 5 ఫ్లేవర్స్‌లో కూల్‌డ్రింక్స్; ఈ ఏడాదిలో మ్యాంగో జ్యూస్ బహుళజాతి సంస్థల పోటీని తట్టుకుని నిలబడటమంటే మాటలు కాదు. అది కూడా కూల్‌డ్రింక్స్ మార్కెట్లో!!! వేల కోట్ల రూపాయల ప్రచారం... టాప్ సెలబ్రిటీలతో ప్రకటనలు... పోటీ పడలేని స్థాయిలో మౌలిక సదుపాయాలు... ఇవన్నీ ఒకెత్తయితే ప్రత్యర్థులు ఊహించని ఆఫర్లిచ్చి వారిని పడేయటం మరొకఎత్తు. థమ్స్ అప్, గోల్డ్‌స్పాట్, లిమ్కా వంటి సూపర్ బ్రాండ్లతో లీడర్‌గా ఉన్న పార్లే సైతం పడిపోయిందంటే ఇలాంటి ఆఫర్ల వల్లే!. అలాంటి ఆఫర్లకు సైతం పడకుండా పోటీని తట్టుకుంటూ... తమ బ్రాండ్‌ను కాపాడుకుంటున్న ‘లోకల్’ మెరుపులు అక్కడక్కడా కనిపిస్తుంటాయి. అలాంటి మెరుపే ఆర్టోస్. ఇది తూగోజీ బ్రాండ్. గోదావరి జిల్లాలకు పరిచయం అక్కర్లేని శీతల పానీయం. హైదరాబాద్, బిజినెస్‌బ్యూరో ఆర్టోస్ది దాదాపు యాభై ఏళ్ల చరిత్ర. ఇక దాన్ని తయారు చేసే ఏఆర్ రాజు డ్రింక్స్దైతే దాదాపు వందేళ్ల చరిత్ర. 1912లో ప్రపంచ యుద్ధం కమ్ముకొస్తున్న సమయంలో బ్రిటిష్ మిలిటరీ పెద్ద ఎత్తున రామచంద్రపురానికి వచ్చేది. వారికి ‘గోలీ సోడా’లు అందించటమే అడ్డూరి రామచంద్రరాజు వ్యాపారం. అలా... వారికి దగ్గరైన రాజు... వారి సహకారంతోనే బ్రిటన్ నుంచి కూల్‌డ్రింక్ తయారీకి సంబంధించిన యంత్రాలను, ముడి సరుకులను తెప్పించుకున్నారు. 1919లో ఏఆర్ రాజు డ్రింక్స్ పేరిట కూల్‌డ్రింక్ వ్యాపారం మొదలుపెట్టారు. అప్పట్లో బ్రిటన్ నుంచి దిగుమతి చేసుకోవడానికి సంబంధించిన ఉత్తరప్రత్యుత్తరాలన్నీ లేఖల రూపంలోనే జరిగాయి. 1955లో పూర్తి ఆటోమిషన్ కావటంతో ‘ఆర్టోస్’ డ్రింక్ బయటకు వచ్చింది. అదే ఏడాది దీనికి సంబంధించిన పేటెంట్ హక్కులను కూడా తీసుకున్నారు. ఇప్పటికీ ఈ కూల్‌డ్రింక్ తయారీకి సంబంధించిన ముడిపదార్థాల మిశ్రమాన్ని వారసత్వంగా వస్తున్న రామచంద్రరాజు కుటుంబం మాత్రమే తయారు చేస్తుంది. కోక్ కొనటానికి ముందుకొచ్చినా... పెప్సీ, కోక్‌లను తట్టుకోలేక దేశీయ దిగ్గజం పార్లేనే థమ్స్ అప్, మజా, లిమ్కా, కిస్మత్, సిట్రా వంటి బ్రాండ్లను అమ్మేసింది. వాటిని కొనుగోలు చేసిన కోక్... ఆ బ్రాండ్ల బదులు తమవి పెట్టాలని చూసినా ఫలితం లేకపోవటంతో... చివరికి థమ్స్ అప్, మజా, లిమ్కాలనే తన బ్రాండ్లుగా విక్రయించటం మొదలుపెట్టింది. ఇదంతా ఎందుకంటే 1960లో ఆర్టోస్ కూడా ఇలాంటి ఒత్తిడే ఎదుర్కొంది. రామచంద్రపురం యూనిట్‌ను కొనుగోలు చేయడానికి కోకాకోలా ముందుకొచ్చింది. విక్రయానికి ఒక దశలో రామచంద్రరాజు సరేనన్నారు. కాకపోతే కొనుగోలు చేసిన అనంతరం ఆర్టోస్ బ్రాండ్‌ను తీసేస్తామని కోక్ చెప్పటంతో ఆయన ఒప్పుకోలేదు. పెపైచ్చు కొత్త రుచులను పరిచయం చేస్తూ బ్రాండ్‌ను మరింత విస్తరించారు. ఒకానొక దశలో విజయవాడ వరకు ఆర్టోస్ విస్తరించింది. ‘‘అప్పట్లో మా కూల్‌డ్రింక్ ధర రూ. 5 కన్నా తక్కువే. దాంతో మా బ్రాండ్‌ను పడగొట్టడానికి పెప్సీ, కోక్‌లు చిన్న బాటిళ్లలో 5 రూపాయల కూల్‌డ్రింక్స్‌ను తెచ్చాయి. ఆ పోటీని మేం తట్టుకోలేకపోయాం. విజయవాడ నుంచి వెనక్కొచ్చేశాం. ఇతర ప్రాంతాలకు విస్తరించాలని ఉంది కానీ పెద్ద కంపెనీల పోటీని తట్టుకోవటం చాలా కష్టం’’ అన్నారు ఆర్టోస్ ఎండీ అడ్డూరి జగన్నాథ వర్మ. ప్రస్తుతం తూర్పుగోదావరితో పాటు పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాలకే ఆర్టోస్ పరిమితమైంది. గ్రామీణ మార్కెట్, నమ్మకమే బలం పెద్ద కంపెనీలను తట్టుకొని నిలబడటానికి విభిన్నమార్కెటింగ్ వ్యూహాన్ని అనుసరించామంటారు వర్మ. ‘‘పెప్సీ, కోక్‌లు ఫ్రిజ్‌లు, ఆఫర్లతో వచ్చి... ఎక్కువ వ్యాపారం జరిగే మార్కెట్లపైనే దృష్టి పెట్టాయి. వాటితో పోటీ కష్టమని భావించిన మేం.. అవి పట్టించుకోని చిన్న షాపులు, గ్రామాలపై దృష్టి పెట్టాం. లాభాలను తగ్గించుకుని షాపు వాళ్లకు ఎక్కువ మార్జిన్లు ఆఫర్ చేశాం. దీంతో గ్రామాల్లో కూల్‌డ్రింక్ అంటే ఆర్టోస్ అనేస్థాయికి చేరాం’’ అని చెప్పారు. కోకాకోలా బాటిల్‌పై రూపాయి కమీషన్‌గా ఇస్తే ఆర్టోస్ రూ. 1.75 ఇస్తోంది. దీంతో చిన్న వ్యాపారులు ఆర్టోస్ విక్రయానికే మొగ్గు చూపుతున్నట్లు వర్మ తెలిపారు. దీనికి తోడు బడా కంపెనీలు అం దించని ద్రాక్ష ఫ్లేవర్‌పై ఆర్టోస్ ప్రధానంగా దృష్టిపెట్టింది. మిగతా కంపెనీలు చిన్న బాటిల్‌ను రూ.10కి విక్రయిస్తుంటే ఆర్టోస్ రూ.8కే ఇస్తోంది. ‘‘ఈ చర్యలన్నీ మా వ్యాపారాన్ని పెంచాయి. గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి పెరగడంతో పదేళ్లుగా చక్కని వృద్ధి నమోదవుతోంది. గతేడాది మేం రూ. 15 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేశాం’’ అని వర్మ తెలియజేశారు. తరాలు మారినా అదే అనుబంధం... కూల్ డ్రింక్‌లతో పాటు సోడా, మంచినీటి వ్యాపారంలోకి కూడా ఆర్టోస్ ప్రవేశించింది. తాజాగా మ్యాంగో డ్రింక్‌ను ప్రవేశపెట్టే యోచనలో ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే నాలుగు సంస్థలతో చర్చలు జరుపుతున్నామని, ఈ సంవత్సరాంతానికి మ్యాంగో డ్రింక్‌ను ప్రవేశపెడతామని తెలిపిన జగన్నాథ వర్మ... ఈ కుటుంబంలో మూడో తరానికి చెందుతారు. వీరభద్రరాజు, పద్మనాభవర్మతో కలిసి ఈయన ఆర్టోస్‌ను నిర్వహిస్తున్నారు. నాలుగో తరానికి చెందిన వీరి వారసులు కూడా చదువులు పూర్తయ్యాక దీన్లో అడుగుపెట్టడానికే సుముఖత వ్యక్తం చేస్తున్నారు. దీనికింకో ఐదేళ్లు పట్టొచ్చు. -
మళ్లీ పార్లే కోలా..
ముంబై: రానున్న వేసవిలో శీతల పానీయాల మార్కెట్ వేడెక్కనున్నది. థమ్సప్, లిమ్కా, గోల్డ్‌స్పాట్ వంటి బ్రాండ్లతో ఒకప్పుడు ఈ మార్కెట్‌ను ఒక ఊపు ఊపిన పార్లే ఆగ్రో కంపెనీ కేఫ్ క్యూబా పేరుతో కాఫీ ఫ్లేవర్‌తో కూడిన కార్బొనేటెడ్ డ్రింక్‌ను మార్కెట్లోకి తెస్తోంది. తన బ్రాండ్లను అంతర్జాతీయ దిగ్గజం, కోక-కోలాకు అమ్మేసిన తర్వాత మళ్లీ 20 ఏళ్లకు పార్లే కంపెనీ ఈ రంగంలోకి ప్రవేశిస్తోంది. ఈ కేఫ్ క్యూబా తమ ఫ్లాగ్షిప్ బ్రాండ్ కాబోతోందని, మార్కెట్లోకి తెచ్చిన ఏడాదిన్నర కాలంలోనే 7 శాతం మార్కెట్ వాటాను, రూ.1,000 కోట్ల టర్నోవర్‌ను సాధించగలదని పార్లే కంపెనీ అంచనా వేస్తోంది. పార్లే ఆగ్రో కంపెనీ థమ్సప్, లిమ్కా, గోల్డ్‌స్పాట్, సిట్రా వంటి బ్రాండ్లతో భారత శీతల పానీయాల మార్కెట్లో సంచలనం సృష్టించింది. 1991లో ఆర్ధిక విధానాల కారణంగా అంతర్జాతీయ దిగ్గజాలు కోక-కోలా, పెప్సిలు భారత్‌లోకి ప్రవేశించాయి. పార్లే బ్రాండ్లను తమకు అమ్మేయాలని కోక-కోలా బేరం పెట్టింది. కోక-కోలా రూ.30-40 కోట్లు ఆఫర్ చేస్తుందని పార్లే భావించింది. కానీ ఈ కంపెనీ రూ.300 కోట్లు ఆఫర్ చేసింది. అప్పట్లో ఈ మొత్తం పెద్ద మొత్తం కిందనే లెక్క. పార్లే ఆ బ్రాండ్లను కోక-కోలాకు 1993లో అమ్మేసింది. పదేళ్ల వరకూ ఈ రంగంలోకి రామంటూ నాన్ కాంపీట్ ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది. థమ్సప్ హవా: థమ్సప్ బ్రాండ్‌ను కోక-కోలా కొనసాగిం చింది. 20 ఏళ్ల తర్వాత కూడా థమ్సప్ హవా కొనసాగుతూనే ఉంది. అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందిన తన కోక్ బ్రాండ్‌ను మాత్రం కోక-కోలా కంపెనీ భారత్‌లో హిట్ చేసుకోలేకపోయింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కోక్ విజయయాత్ర అప్రతిహతంగా కొనసాగుతున్నప్పటికీ, భారత్‌లో మాత్రం దీని స్థానం థమ్సప్ తర్వాతనే ఉంది. పార్లే కంపెనీ బిస్లరీ మినరల్ వాటర్‌ను మార్కెట్లోకి తెచ్చింది. మిన టరల్ వాటర్ అంటే బిస్లరీయే అన్నంతగా అది పాపులర్ అయింది. పదేళ్ల కృషి:ఇక కేఫ్ క్యూబా డ్రింక్‌ను వచ్చే ఏడాది జనవరిలో గాని, ఫిబ్రవరిలో గాని మార్కెట్లోకి తేవాలని పార్లే కంపెనీ యోచిస్తోంది. ప్రస్తుతం కార్బొనేటెడ్ డ్రింక్స్ మార్కెట్లో లెమన్, కోలా, ఆరంజ్ ఫ్లేవర్స్ మాత్రమే ఉన్నాయని పార్లే ఆగ్రో సీఎండీ ప్రకాష్ చౌహాన్ చెప్పారు. ఈ సెగ్మెంట్లో పూర్తిగా భిన్నమైన డ్రింక్‌ను అందించాలనే ఉద్దేశంతో కాఫీ ఫ్లేవర్‌తో కేఫ్ క్యూబాను తెస్తున్నామని వివరించారు. ఈ డ్రింక్‌ను డెవలప్ చేయడానికి తమకు పదేళ్లు పట్టిందని చెప్పారు. కేఫ్ క్యూబా 250 ఎంఎల్ క్యాన్ ధర రూ.20, 250 ఎంఎల్ పెట్ బాటిల్ ధర రూ.15గా ఉండొచ్చని పరిశ్రమ వర్గాల అంచనా. అయితే ధరల వివరాలను చెప్పడానికి చౌహాన్ నిరాకరించారు. కార్బొనేటెడ్ సాఫ్ట్ డ్రింక్ మార్కెట్లో తీవ్రమైన పోటీ ఉందని, అయినప్పటికీ, ధర విషయంలో రాజీపడబోమని, ధర అధికంగానే ఉండొచ్చని చెప్పారు. తమ మొత్తం టర్నోవర్‌లో 40% వాటా ఈ కొత్త డ్రింక్ నుంచే వస్తుందని రూ.2,000 కోట్ల టర్నోవర్ ఉన్న ఈ కంపెనీ అంచనా వేస్తోంది. 2015 కల్లా టర్నోవర్‌ను రూ.5,000 కోట్లకు పెంచుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. కేఫ్ క్యూబాలో డైట్ వేరియంట్‌నూ అందించాలని యోచిస్తోంది. పార్లే కంపెనీ ఫ్రూటీ జ్యూస్ బ్రాండ్‌ను కూడా అందిస్తోంది.