మళ్లీ పార్లే కోలా..
ముంబై: రానున్న వేసవిలో శీతల పానీయాల మార్కెట్ వేడెక్కనున్నది. థమ్సప్, లిమ్కా, గోల్డ్‌స్పాట్ వంటి బ్రాండ్లతో ఒకప్పుడు ఈ మార్కెట్‌ను ఒక ఊపు ఊపిన పార్లే ఆగ్రో కంపెనీ కేఫ్ క్యూబా పేరుతో కాఫీ ఫ్లేవర్‌తో కూడిన కార్బొనేటెడ్ డ్రింక్‌ను మార్కెట్లోకి తెస్తోంది. తన బ్రాండ్లను అంతర్జాతీయ దిగ్గజం, కోక-కోలాకు అమ్మేసిన తర్వాత మళ్లీ 20 ఏళ్లకు పార్లే కంపెనీ ఈ రంగంలోకి ప్రవేశిస్తోంది. ఈ కేఫ్ క్యూబా తమ ఫ్లాగ్‌షిప్ బ్రాండ్ కాబోతోందని, మార్కెట్లోకి తెచ్చిన ఏడాదిన్నర కాలంలోనే 7 శాతం మార్కెట్ వాటాను, రూ.1,000 కోట్ల టర్నోవర్‌ను సాధించగలదని పార్లే కంపెనీ అంచనా వేస్తోంది.
పార్లే ఆగ్రో కంపెనీ థమ్సప్, లిమ్కా, గోల్డ్‌స్పాట్, సిట్రా వంటి బ్రాండ్‌లతో భారత శీతల పానీయాల మార్కెట్లో సంచలనం సృష్టించింది. 1991లో ఆర్ధిక విధానాల కారణంగా అంతర్జాతీయ దిగ్గజాలు కోక-కోలా, పెప్సిలు భారత్‌లోకి ప్రవేశించాయి. పార్లే బ్రాండ్‌లను తమకు అమ్మేయాలని కోక-కోలా బేరం పెట్టింది. కోక-కోలా రూ.30-40 కోట్లు ఆఫర్ చేస్తుందని పార్లే భావించింది. కానీ ఈ కంపెనీ రూ.300 కోట్లు ఆఫర్ చేసింది. అప్పట్లో ఈ మొత్తం పెద్ద మొత్తం కిందనే లెక్క. పార్లే ఆ బ్రాండ్లను కోక-కోలాకు 1993లో అమ్మేసింది. పదేళ్ల వరకూ ఈ రంగంలోకి రామంటూ నాన్ కాంపీట్ ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది.
థమ్సప్ హవా: థమ్సప్ బ్రాండ్‌ను కోక-కోలా కొనసాగిం చింది. 20 ఏళ్ల తర్వాత కూడా థమ్సప్ హవా కొనసాగుతూనే ఉంది. అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందిన తన కోక్ బ్రాండ్‌ను మాత్రం కోక-కోలా కంపెనీ భారత్‌లో హిట్ చేసుకోలేకపోయింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కోక్ విజయయాత్ర అప్రతిహతంగా కొనసాగుతున్నప్పటికీ, భారత్‌లో మాత్రం దీని స్థానం థమ్సప్ తర్వాతనే ఉంది. పార్లే కంపెనీ బిస్లరీ మినరల్ వాటర్‌ను మార్కెట్లోకి తెచ్చింది. మిన టరల్ వాటర్ అంటే బిస్లరీయే అన్నంతగా అది పాపులర్ అయింది.
పదేళ్ల కృషి:ఇక కేఫ్ క్యూబా డ్రింక్‌ను వచ్చే ఏడాది జనవరిలో గాని, ఫిబ్రవరిలో గాని మార్కెట్లోకి తేవాలని పార్లే కంపెనీ యోచిస్తోంది. ప్రస్తుతం కార్బొనేటెడ్ డ్రింక్స్ మార్కెట్లో లెమన్, కోలా, ఆరంజ్ ఫ్లేవర్స్ మాత్రమే ఉన్నాయని పార్లే ఆగ్రో సీఎండీ ప్రకాష్ చౌహాన్ చెప్పారు. ఈ సెగ్మెంట్లో పూర్తిగా భిన్నమైన డ్రింక్‌ను అందించాలనే ఉద్దేశంతో కాఫీ ఫ్లేవర్‌తో కేఫ్ క్యూబాను తెస్తున్నామని వివరించారు. ఈ డ్రింక్‌ను డెవలప్ చేయడానికి తమకు పదేళ్లు పట్టిందని చెప్పారు. కేఫ్ క్యూబా 250 ఎంఎల్ క్యాన్ ధర రూ.20, 250 ఎంఎల్ పెట్ బాటిల్ ధర రూ.15గా ఉండొచ్చని పరిశ్రమ వర్గాల అంచనా. అయితే ధరల వివరాలను చెప్పడానికి చౌహాన్ నిరాకరించారు.
కార్బొనేటెడ్ సాఫ్ట్ డ్రింక్ మార్కెట్‌లో తీవ్రమైన పోటీ ఉందని, అయినప్పటికీ, ధర విషయంలో రాజీపడబోమని, ధర అధికంగానే ఉండొచ్చని చెప్పారు. తమ మొత్తం టర్నోవర్‌లో 40% వాటా ఈ కొత్త డ్రింక్ నుంచే వస్తుందని రూ.2,000 కోట్ల టర్నోవర్ ఉన్న ఈ కంపెనీ అంచనా వేస్తోంది. 2015 కల్లా టర్నోవర్‌ను రూ.5,000 కోట్లకు పెంచుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. కేఫ్ క్యూబాలో డైట్ వేరియంట్‌నూ అందించాలని యోచిస్తోంది. పార్లే కంపెనీ ఫ్రూటీ జ్యూస్ బ్రాండ్‌ను కూడా అందిస్తోంది.