గోలీ సోడాతో గోల్ కొట్టారు! | Artos Soft Drink Industry | Sakshi
Sakshi News home page

గోలీ సోడాతో గోల్ కొట్టారు!

Published Sat, Jan 25 2014 1:59 AM | Last Updated on Sat, Sep 2 2017 2:57 AM

గోలీ సోడాతో గోల్ కొట్టారు!

గోలీ సోడాతో గోల్ కొట్టారు!

  •  గోదావరికెళితే ఆర్టోస్ కూల్‌డ్రింక్ తాగాల్సిందే
  •  50 ఏళ్ల కిందట ఆరంభం... ఏటా రూ.15 కోట్ల వ్యాపారం
  •  కోక్... కొంటామన్నా విక్రయించడానికి యాజమాన్యం నో
  •  5 ఫ్లేవర్స్‌లో కూల్‌డ్రింక్స్; ఈ ఏడాదిలో మ్యాంగో జ్యూస్
  •  
     బహుళజాతి సంస్థల పోటీని తట్టుకుని నిలబడటమంటే మాటలు కాదు. అది కూడా కూల్‌డ్రింక్స్ మార్కెట్లో!!! వేల కోట్ల రూపాయల ప్రచారం... టాప్ సెలబ్రిటీలతో ప్రకటనలు... పోటీ పడలేని స్థాయిలో మౌలిక సదుపాయాలు... ఇవన్నీ ఒకెత్తయితే ప్రత్యర్థులు ఊహించని ఆఫర్లిచ్చి వారిని పడేయటం మరొకఎత్తు. థమ్స్ అప్, గోల్డ్‌స్పాట్, లిమ్కా వంటి సూపర్ బ్రాండ్లతో లీడర్‌గా ఉన్న పార్లే సైతం పడిపోయిందంటే ఇలాంటి ఆఫర్ల వల్లే!. అలాంటి ఆఫర్లకు సైతం పడకుండా పోటీని తట్టుకుంటూ... తమ బ్రాండ్‌ను కాపాడుకుంటున్న ‘లోకల్’ మెరుపులు అక్కడక్కడా కనిపిస్తుంటాయి. అలాంటి మెరుపే ఆర్టోస్. ఇది తూగోజీ బ్రాండ్. గోదావరి జిల్లాలకు పరిచయం అక్కర్లేని శీతల పానీయం.
     
     హైదరాబాద్, బిజినెస్‌బ్యూరో
     ఆర్టోస్‌ది దాదాపు యాభై ఏళ్ల చరిత్ర. ఇక దాన్ని తయారు చేసే ఏఆర్ రాజు డ్రింక్స్‌దైతే దాదాపు వందేళ్ల చరిత్ర. 1912లో ప్రపంచ యుద్ధం కమ్ముకొస్తున్న సమయంలో బ్రిటిష్ మిలిటరీ పెద్ద ఎత్తున రామచంద్రపురానికి వచ్చేది. వారికి ‘గోలీ సోడా’లు అందించటమే అడ్డూరి రామచంద్రరాజు వ్యాపారం. అలా... వారికి దగ్గరైన రాజు... వారి సహకారంతోనే బ్రిటన్ నుంచి కూల్‌డ్రింక్ తయారీకి సంబంధించిన యంత్రాలను, ముడి సరుకులను తెప్పించుకున్నారు. 1919లో ఏఆర్ రాజు డ్రింక్స్ పేరిట కూల్‌డ్రింక్ వ్యాపారం మొదలుపెట్టారు. అప్పట్లో బ్రిటన్ నుంచి దిగుమతి చేసుకోవడానికి సంబంధించిన ఉత్తరప్రత్యుత్తరాలన్నీ లేఖల రూపంలోనే జరిగాయి. 1955లో పూర్తి ఆటోమిషన్ కావటంతో ‘ఆర్టోస్’ డ్రింక్ బయటకు వచ్చింది. అదే ఏడాది దీనికి సంబంధించిన పేటెంట్ హక్కులను కూడా తీసుకున్నారు. ఇప్పటికీ ఈ కూల్‌డ్రింక్ తయారీకి సంబంధించిన ముడిపదార్థాల మిశ్రమాన్ని వారసత్వంగా వస్తున్న రామచంద్రరాజు కుటుంబం మాత్రమే తయారు చేస్తుంది.
     
     కోక్ కొనటానికి ముందుకొచ్చినా...
     పెప్సీ, కోక్‌లను తట్టుకోలేక దేశీయ దిగ్గజం పార్లేనే థమ్స్ అప్, మజా, లిమ్కా, కిస్మత్, సిట్రా వంటి బ్రాండ్‌లను అమ్మేసింది. వాటిని కొనుగోలు చేసిన కోక్... ఆ బ్రాండ్ల బదులు తమవి పెట్టాలని చూసినా ఫలితం లేకపోవటంతో... చివరికి థమ్స్ అప్, మజా, లిమ్కాలనే తన బ్రాండ్లుగా విక్రయించటం మొదలుపెట్టింది. ఇదంతా ఎందుకంటే 1960లో ఆర్టోస్ కూడా ఇలాంటి ఒత్తిడే ఎదుర్కొంది. రామచంద్రపురం యూనిట్‌ను కొనుగోలు చేయడానికి కోకాకోలా ముందుకొచ్చింది. విక్రయానికి ఒక దశలో రామచంద్రరాజు సరేనన్నారు. కాకపోతే కొనుగోలు చేసిన అనంతరం ఆర్టోస్ బ్రాండ్‌ను తీసేస్తామని కోక్ చెప్పటంతో ఆయన ఒప్పుకోలేదు. పెపైచ్చు కొత్త రుచులను పరిచయం చేస్తూ బ్రాండ్‌ను మరింత విస్తరించారు. ఒకానొక దశలో విజయవాడ వరకు ఆర్టోస్ విస్తరించింది. ‘‘అప్పట్లో మా కూల్‌డ్రింక్  ధర రూ. 5 కన్నా తక్కువే. దాంతో మా బ్రాండ్‌ను పడగొట్టడానికి పెప్సీ, కోక్‌లు చిన్న బాటిళ్లలో 5 రూపాయల కూల్‌డ్రింక్స్‌ను తెచ్చాయి. ఆ పోటీని మేం తట్టుకోలేకపోయాం. విజయవాడ నుంచి వెనక్కొచ్చేశాం. ఇతర ప్రాంతాలకు విస్తరించాలని ఉంది కానీ పెద్ద కంపెనీల పోటీని తట్టుకోవటం చాలా కష్టం’’ అన్నారు ఆర్టోస్ ఎండీ అడ్డూరి జగన్నాథ వర్మ. ప్రస్తుతం తూర్పుగోదావరితో పాటు పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాలకే ఆర్టోస్ పరిమితమైంది.
     
     గ్రామీణ మార్కెట్, నమ్మకమే బలం
     పెద్ద కంపెనీలను తట్టుకొని నిలబడటానికి విభిన్నమార్కెటింగ్ వ్యూహాన్ని అనుసరించామంటారు వర్మ. ‘‘పెప్సీ, కోక్‌లు ఫ్రిజ్‌లు, ఆఫర్లతో వచ్చి... ఎక్కువ వ్యాపారం జరిగే మార్కెట్లపైనే దృష్టి పెట్టాయి. వాటితో పోటీ కష్టమని భావించిన మేం.. అవి పట్టించుకోని చిన్న షాపులు, గ్రామాలపై దృష్టి పెట్టాం. లాభాలను తగ్గించుకుని షాపు వాళ్లకు ఎక్కువ మార్జిన్లు ఆఫర్ చేశాం. దీంతో గ్రామాల్లో కూల్‌డ్రింక్ అంటే ఆర్టోస్ అనేస్థాయికి చేరాం’’ అని చెప్పారు. కోకాకోలా బాటిల్‌పై రూపాయి కమీషన్‌గా ఇస్తే ఆర్టోస్ రూ. 1.75 ఇస్తోంది. దీంతో చిన్న వ్యాపారులు ఆర్టోస్ విక్రయానికే   మొగ్గు చూపుతున్నట్లు వర్మ తెలిపారు. దీనికి తోడు బడా కంపెనీలు అం దించని ద్రాక్ష ఫ్లేవర్‌పై ఆర్టోస్ ప్రధానంగా దృష్టిపెట్టింది. మిగతా కంపెనీలు చిన్న బాటిల్‌ను రూ.10కి విక్రయిస్తుంటే ఆర్టోస్ రూ.8కే ఇస్తోంది. ‘‘ఈ చర్యలన్నీ మా వ్యాపారాన్ని పెంచాయి. గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి పెరగడంతో పదేళ్లుగా చక్కని వృద్ధి నమోదవుతోంది. గతేడాది మేం రూ. 15 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేశాం’’ అని వర్మ తెలియజేశారు.
     
     తరాలు మారినా అదే అనుబంధం...
     కూల్ డ్రింక్‌లతో పాటు సోడా, మంచినీటి వ్యాపారంలోకి కూడా ఆర్టోస్ ప్రవేశించింది. తాజాగా మ్యాంగో డ్రింక్‌ను ప్రవేశపెట్టే యోచనలో ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే నాలుగు సంస్థలతో చర్చలు జరుపుతున్నామని, ఈ సంవత్సరాంతానికి మ్యాంగో డ్రింక్‌ను ప్రవేశపెడతామని తెలిపిన జగన్నాథ వర్మ... ఈ కుటుంబంలో మూడో తరానికి చెందుతారు. వీరభద్రరాజు, పద్మనాభవర్మతో కలిసి ఈయన ఆర్టోస్‌ను నిర్వహిస్తున్నారు. నాలుగో తరానికి చెందిన వీరి వారసులు కూడా చదువులు పూర్తయ్యాక దీన్లో అడుగుపెట్టడానికే సుముఖత వ్యక్తం చేస్తున్నారు. దీనికింకో ఐదేళ్లు పట్టొచ్చు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement