
శంషాబాద్: ‘ఒకప్పుడు బెంగాల్‌లో ఏది జరుగుతుందో దేశంలో అదే జరుగుతుందనే మాట ఉండేది. ఇప్పుడు తెలంగాణలో ఏం జరుగుతుందో దేశంలో అదే జరగబోతుందనేలా మన రాష్ట్రం దేశానికి మార్గదర్శకంగా మారింది’అని రాష్ట్ర పురపాలక మంత్రి కె.తారకరామారావు అన్నారు. మంగళవారం రాజేంద్రనగర్ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. అనంతరం శంషాబాద్ మినీ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. ప్రజలు అడగని డిమాండ్లు, ప్రతిపక్షాల ఆలోచనకురాని పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారని చెప్పారు. కల్యాణలక్ష్మి పథకం ద్వారా సీఎం కేసీఆర్ పేద ఆడపడుచులకు మేనమామలా మారారన్నారు. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ మనవలు, మనుమరాళ్లు తినే సన్నబియ్యాన్నే ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకూ పెడుతున్న మనసున్న ప్రభుత్వం తమదని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 700 గురుకుల పాఠశాలలు ప్రారంభించిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. దేశచరిత్రలోనే రైతులకు పంట పెట్టుబడి అందజేసి తమ ప్రభుత్వం రైతుబంధుగా మారిందన్నారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి సీఎం కేసీఆర్ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారని చెప్పారు.
కాంగ్రెసోళ్లకు ఆస్కార్ ఇవ్వాలి..
‘గతంలో వాళ్లు పరిపాలనే చెయ్యలేదట.. గిప్పుడే కొత్తగా పార్టీ పెట్టినట్లు బీద అరుపులు అరుస్తున్నరు. వాళ్లు చందమామలా ఇచ్చిన రాష్ట్రాన్ని మనమేదో పాడు చేసినట్లు అరుపులు, బొబ్బలు పెడుతున్నరు. కాంగ్రెసోళ్లకు ఆస్కార్ అవార్డు ఇయ్యాల్సిందే’ అని కేటీఆర్ విమర్శించారు. అసెంబ్లీలో ఒకసారి స్పీకర్ మైక్ ఇస్తే ఇంకా ప్రిపేర్ కాలేదన్న ఉత్తమ్ ఇప్పుడు ఎన్నికలకు రెడీ అంటున్నారని, తీరా ఎన్నికల తేదీ ప్రకటిస్తే తామింకా ప్రిపేర్ కాలేదంటారేమోనని ఎద్దే వా చేశారు. కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి కేటీఆర్ ఓ పిట్ట కథ చెప్పారు. ‘చిన్నప్పటి నుంచీ చెడు అలవాట్లతో పెరిగిన ఓ యువకుడు తల్లిదండ్రులను హతమారుస్తాడు. పోలీసులు అరెస్ట్ చేసి జడ్జి ముందు నిలబెట్టినప్పుడు.. నీకేం శిక్ష వేయాలని న్యాయమూర్తి ప్రశ్నించినప్పుడు.. ‘నేను తల్లి, తండ్రి లేని అనాథను సార్’ అని అమాయకంగా చెప్పినట్లుగా ఉంది కాంగ్రెసోళ్ల తీరు’ అని అన్నారు.
ఐటీ హబ్‌గా రాజేంద్రనగర్..
రాజేంద్రనగర్ నియోజకవర్గం మరో మూడేళ్లలో శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని మించిపోతుందని కేటీఆర్ అన్నారు. బుద్వేల్, కిస్మత్‌పూర్ మధ్య 28 ఐటీ కంపెనీలు రానున్నాయని, దీంతో కిస్మత్‌పూర్ ఏరియా ‘కిస్మత్’మారిపోతుందని చెప్పారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు సిటీతో పాటు ఇక్కడే లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. నియోజకవర్గానికి రూ.200 కోట్ల నిధులను పురపాలక శాఖ ద్వారా విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేటీఆర్ ప్రకటించారు. కార్యక్రమంలో రవాణా మంత్రి పి.మహేందర్‌రెడ్డి, ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, ఎమ్మెల్సీలు నరేందర్‌రెడ్డి, శంభీపూర్‌రాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment