సదస్సులో భాగంగా పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ఆర్‌బీఐ మాజీ గవర్నర్ వైవీ రెడ్డి, మంత్రి కేటీఆర్, చిత్రంలో సెస్ డైరెక్టర్ గాలాబ్, ్రప్రొఫెసర్ సీహెచ్ హనుమంతరావు, సెస్ చైర్మన్ ఆర్ రాధాకృష్ణ
సాక్షి, హైదరాబాద్: అభివృద్ధిలో జాతీయ సగటును తెలంగాణ దాటిపోయిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు పేర్కొన్నారు. తెలంగాణ 10.4% వృద్ధిరేటును సాధించిందన్నారు. సోమవారం సెస్ (సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్)లో ‘సమీకృత అభివృద్ధి – సమస్యలు, సవాళ్లు’అనే అంశంపై అంతర్జాతీయ సదస్సు జరిగింది. ఐపీఈ (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్) సమన్వయంతో జరిగిన ఈ సదస్సుకు మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని వివరించారు. వెనుకబడిన వర్గాలకు సామాజిక, ఆర్థిక సాధికారత కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు.
43% నిధులు సామాజిక సేవకే..
2018–19 వార్షిక బడ్జెట్‌లో సామాజిక సేవా పథకాలకు 43% నిధులు కేటాయించినట్లు కేటీఆర్ తెలిపారు. ఎస్సీ ప్రత్యేకాభివృద్ధి నిధికి రూ.16,400 కోట్లు, గిరిజన ప్రత్యేకాభివృద్ధి నిధికి రూ.9,600 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి రూ.2వేల కోట్లు, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమానికి రూ.1800 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, అమ్మ ఒడి, కేసీఆర్ కిట్, గొర్రెల పంపిణీ, చేపల విత్తనాల పంపిణీతో పాటు నాయీ బ్రాహ్మణ వర్గానికి ప్రత్యేక పథకాలను యుద్ధప్రాతిపదికన అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ఆర్బీఐ మాజీ గవర్నర్ వైవీ రెడ్డి మాట్లాడుతూ.. దేశాభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో ప్రజాప్రతినిధులే కీలక భూమిక పోషిస్తారన్నారు. కోల్‌కతా ఇన్‌స్టిట్యూట్ డెవలప్‌మెంట్ స్టడీస్ ప్రొఫెసర్ అమియా కుమార్ బాగ్చి మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ పార్టీలు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తున్నాయన్నారు. ఈ సదస్సులో సెస్ చైర్మన్ ఆర్ రాధాకృష్ణ, డైరెక్టర్ గాలాబ్, ప్రొఫెసర్ సీహెచ్ హనుమంతరావుతో పాటు వివిధ రంగాల నిపుణులు, మేధావులు పాల్గొన్నారు.
‘రైతు బంధు’ విప్లవాత్మకం..
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘రైతు బంధు’పథకం విప్లవాత్మకమని, ఈ పథకం కింద రైతుకు ఒక్కో ఎకరానికి రూ.4వేల చొప్పున పెట్టుబడి సాయం చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. 2 సార్లు అమలు చేసే ఈ పథకంకింద ఇప్పటివరకు 58 లక్షల మంది రైతులు లబ్ధి పొందినట్లు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనాన్ని అందిస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా 25లక్షల మంది విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకం లబ్ధిదారులుగా ఉన్నారన్నారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధికి నిధులు కేటాయించడమే కాకుండా, పాలనా పరమైన నిర్ణయాల్లోనూ ప్రజాసంక్షేమానికే పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. అభివృద్ధి పథకాలు అందరికీ చేరేలా సమీకృత కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment