సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సమగ్రాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వివరిస్తే బాగుందంటూ వెన్నుతట్టారని పురపాలక మంత్రి కె.తారకరామారావు చెప్పారు. మున్సిపల్ బాండ్ల ప్రక్రియను ప్రధానే సూచించారని, దాంతో హైదరాబాద్ అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందని చెప్పారని వివరించారు. గురువారం అసెంబ్లీలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బాండ్ల నిధుల వినియోగంపై ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, మాగంటి గోపీనాథ్.. టీ హబ్ రెండేళ్ల విజయాలపై ఎమ్మెల్యేలు బి.గణేశ్‌గుప్తా, పువ్వాడ అజయ్‌కుమార్, గ్యాదరి కిశోర్‌కుమార్ అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానమిచ్చారు. ‘మెట్రో రైలు ప్రారంభోత్సవం కోసం గత నవంబర్‌లో ప్రధాని మోదీ హైదరాబాద్ వచ్చారు.
ఆ సందర్భంలో ఆయనతో చర్చించే అవకాశం దొరికింది. గుజరాత్ సీఎం గా పని చేసినపుడు అహ్మదాబాద్ అభివృద్ధి కోసం మున్సిపల్ బాండ్ల ప్రక్రియ చేపట్టామని, హైదరాబాద్‌లోనూ అలా చేయమని మోదీ సూచించారు. బాండ్ల రూపంలో హైదరాబాద్ అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ భారీ రెవెన్యూ సమీకరణ, ఏఏ క్రెడిట్ రేటింగ్ ఆధారంగా బాండ్ల రూపంలో రూ.1,000 కోట్ల జారీకి ప్రతి పాదించింది. ఆర్థిక వ్యూహాత్మక రోడ్డు అభివృద్ధి కార్యక్రమం (ఎస్‌ఆర్‌డీపీ) కింద తొలి దశలో రూ.200 కోట్లు సమీకరించింది. ఆ నిధులను ఎస్‌ఆర్‌డీపీ కింద పూర్తిగా రాజధాని రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు వినియోగిస్తాం. సగటు ప్రయాణ వేగాన్ని గంటకు 15 నుంచి 35 కిలోమీటర్లకు పెంచడం, ఇంధన వినియోగం, వాయు కాలుష్యం తగ్గించడం లక్ష్యంగా అభివృద్ధి చేస్తాం’అని చెప్పారు.
ఐటీలో హైదరాబాద్ ప్రత్యేకం..
ఐటీ రంగంలో హైదరాబాద్‌కు ప్రత్యేకత ఉందని, హైదరాబాద్‌లోని టీ–హబ్ 2017 నవంబర్ 5తో రెండేళ్లు పూర్తి చేసుకుందని మంత్రి కేటీఆర్ చెప్పారు. ‘టీ–హబ్ ప్రపంచంలోనే పెద్ద ఇంక్యుబేషన్ సెంటర్. ఐటీ, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, బ్యాంకింగ్, రవాణా రంగాల అభివృద్ధికి దోహదపడుతుంది. విద్యాశాఖతో కలసి ఇంటర్ స్థాయిలోనే ఆవిష్కరణలకు ఊతం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా మన యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం. చేనేత కోసం ఆసుయంత్రం తయారు చేసిన చింతకింది మల్లేశంకు రూ.కోటి ఇచ్చాం. వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్‌లో ఐటీ హబ్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం’అని వివరించారు.
మోదీ వెన్నుతట్టారు
Published Fri, Mar 23 2018 2:27 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM
Advertisement
Advertisement