దారులన్నీ ‘ప్రగతి’ వైపే.. | Massive crowd to pragathi nivedika sabha | Sakshi
Sakshi News home page

దారులన్నీ ‘ప్రగతి’ వైపే..

Published Sun, Sep 2 2018 2:51 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM

Massive crowd to pragathi nivedika sabha - Sakshi

రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో ‘ప్రగతి నివేదన’కు ముస్తాబవుతున్న సభా ప్రాంగణం

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి/హైదరాబాద్‌: ప్రగతే నినాదంగా.. ఎన్నికల గెలుపే లక్ష్యంగా.. నగారా మోగించేందుకు గులాబీ దండు కదులుతోంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్‌లో దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఆదివారం జరిగే భారీ బహిరంగ సభ సరికొత్త సంచలనాలకు కేంద్ర బిందువుగా మారనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా, ఏ రాజకీయ పార్టీ నిర్వహించని విధంగా 25 లక్షల మంది జన సమీకరణ లక్ష్యంగా నిర్దేశించుకున్న గులాబీ శ్రేణులు రాష్ట్ర నలుమూలల నుంచి కొంగరకలాన్‌ బాట పట్టాయి. జోడేఘాట్‌ మొదలు జోగులాంబ... యాదాద్రి నరసింహుడి మొదలు సిరిసిల్ల రాజన్న... ఇలా దారులన్నీప్రగతి నివేదన వైపు సాగుతున్నాయి. ఇప్పటికే ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలు, పాదయాత్రల ద్వారా సభాస్థలికి జనం చేరుకుంటున్నారు. సభ ఏర్పాట్లను మంత్రి కేటీఆర్‌ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.  

బస్సులన్నీ ఇటే.. 
రాజకీయ యవనికపై కొత్త రికార్డు సృష్టించాలని నిర్ణయించిన టీఆర్‌ఎస్‌ పార్టీ... జన సమీకరణపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులన్నింటినీ ప్రగతి నివేదన సభ కోసమే అద్దెకు తీసుకుంది. సుమారు 7,600 బస్సులను జన సమీకరణకు వినియోగించుకుంటోంది. దీంతో ఆదివారం ప్రజా రవాణాపై తీవ్ర ప్రభావం చూపనుంది. కేవలం ఆర్టీసీయే కాకుండా 50వేల ప్రైవేటు వాహనా లను ఉపయోగించుకుంటోంది. శుక్రవారం సాయం త్రం నుంచే వివిధ జిల్లాల నుంచి వాహనాలు బయల్దేరిన సంగతి తెలిసిందే. అన్నీ కలిపి సుమారు లక్ష వాహనాలు ప్రగతి సభకు తరలివస్తుండటంతో అందుకు తగ్గట్టుగా 18 చోట్ల పార్కింగ్‌ స్థలాలను ఏర్పాటు చేశారు. ఇదిలావుండగా, శనివారం రాత్రి వరకు 2వేల వాహనాలు సభకు చేరుకున్నట్లు రాచకొండ కమిషనర్‌ మహేశ్‌భగవత్‌ తెలిపారు. 

గులాబీ రెపరెపలు 
ఎటు చూసినా గులాబీ రెపరెపలు.. ఏ కూడలి చూసినా నేతల ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయి. ఇటు నాగార్జునసాగర్‌ హైవే మొదలు అటు బెంగళూరు జాతీయ రహదారి వరకు పార్టీ పతాకాలతో నిండిపోయాయి. పోటాపోటీగా స్వాగత తోరణాలు, కటౌట్లు ఏర్పాటు చేయడంతో ఆ ప్రాంతమంతా గులాబీతో ముస్తాబైంది. ఆఖరికి ఔటర్‌ రింగ్‌రోడ్డు కూడా గులాబీ వర్ణశోభితమైంది. 

పోటెత్తనున్న ప్రైవేటు వాహనాలు.. 
ఆర్టీసీ బస్సులు మెజారిటీ సభకు వెళ్లనున్న నేపథ్యంలో ప్రైవేట్‌ వాహనాలు రోడ్లపైకి పోటెత్తనున్నాయి. ముఖ్యంగా ఆ రోజు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు ఉండటంతో ఆటోలు, కార్లు, సొంత వాహనాలు రోడ్లపైకి రానున్నాయి. దీంతో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తే అవకాశముంది. టోల్‌గేట్ల వద్ద వాహనాలు బారులు తీరే అవకాశం ఉండటంతో అదనపు సిబ్బందిని నియమించారు.

సభ నేపథ్యంలో పోలీసుల ఆంక్షలు.. 
కొంగరకలాన్‌లో సభ నేపథ్యంలో ఓఆర్‌ఆర్‌పై ప్రయాణాలను ప్రజలు ఆదివారం ఉదయం 10 నుంచి అర్ధరాత్రి 12 వరకు తాత్కాలికంగా రద్దు చేసుకోవడం శ్రేయస్కరమని పోలీసు శాఖ శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఓఆర్‌ఆర్‌ మీదుగా కూకట్‌పల్లి, గచ్చిబౌలి, పటాన్‌చెరు, ఎల్‌బీ నగర్, సాగర్‌ రోడ్లను మినహాయించి ప్రయాణాలను ప్లాన్‌ చేసుకోవాలని కోరింది. ‘ట్రాక్టర్లు, స్కూటర్లు, ఇతర ద్విచక్ర వాహనాల రాకపోకలు ఓఆర్‌ఆర్‌పై నిషేధం. ఈ సభకు వచ్చే ట్రాక్టర్లు, ఆటోలు, ద్విచక్రవాహనాలు 3న తిరిగి వెళ్లాలి. లారీలు, డీసీఎంలు, బస్సుల ద్వారా సభా ప్రాంగణానికి వచ్చేవారు ఆదివారం మధ్యాహ్నం 12లోపు చేరుకోవాలి. కేటాయించిన స్థలంలో వాహనాలను నిలిపి సభా ప్రాంగణానికి నడుచుకుంటూ వెళ్లాల’ని సూచించింది. ఏదైనా సాయంతో పాటు సందేహాల నివృత్తి కోసం ఆదిభట్ల ట్రాఫిక్‌ కంట్రోల్‌ రూం నంబర్లు 9493549410 సంప్రదించవచ్చని వివరించింది.

తడిసి ముద్దయిన సభాస్థలి...
మహేశ్వరం: ప్రగతి నివేదన సభాప్రాంగణంలో శనివారం రాత్రి వర్షం కురిసింది. చిరు జల్లులతో ప్రారంభమై ఓ మోస్తారు వర్షం కురిసింది. వర్షం కురవడంతో సభా ప్రాంగణం తడిసి ముద్దయింది. ప్రాంగణంలో పరిచిన కార్పెట్లు, సౌండ్‌ సిస్టమ్స్‌ వర్షం నీటితో తడిసిపోయాయి. సభలో ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్‌ భారీ కటౌట్‌ గాలివానకు నేలకొరిగింది. వర్షానికి సభా మైదానం బురదమయంగా మారి వాహనాల రాకపోకలు, నడవడానికి ఇబ్బందిగా మారింది. ఆదివారం ఎండ ఉంటేనే ప్రాంగణం ఆరుతుంది. లేకపోతే ఇబ్బందులు తప్పవు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement