డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో లంబాడాలు బహూకరించిన జ్ఞాపికలతో మంత్రులు కేటీఆర్, నాయిని. చిత్రంలో ఎమ్మెల్యే ప్రభాకర్
సాక్షి, హైదరాబాద్: నీళ్లు, నిధులు, నియామకాల కోసం ప్రభుత్వం కృషి చేస్తుంటే తట్టుకోలేక కొందరు ప్రతిపక్ష నాయకులు తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని మున్సిపల్ మంత్రి కె.తారకరామారావు పరోక్షంగా కాంగ్రెస్ నాయకులనుద్దేశించి విమర్శించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో నాచారం సింగంచెరువు తండాలో నిర్మించిన 176 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు మంత్రి శనివారం ప్రారంభోత్సవం చేశారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలకనుగుణంగా వచ్చే వేసవిలోగా రాష్ట్రంలో 3 లక్షల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మిస్తామని అన్నారు. ఎన్నికలప్పుడు రాజకీయాలు తప్ప మిగతా సమయాల్లో తాము రాజకీయాలు, పక్షపాతం లేకుండా అందరినీ కలుపుకొని పనిచేస్తామని చెప్పారు. పాలమూరు జిల్లాకు తాగు, సాగునీరు తెచ్చే ప్రయత్నం చేస్తుంటే అడ్డుకునేందుకు వాటిపై కేసులు వేస్తున్నారని విమర్శించారు.
అలాంటి నేతలు, పార్టీలను ప్రశ్నించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మిషన్ భగీరథ, కాకతీయ, డబుల్ ఇళ్లు వంటి పథకాలు చేపడుతుంటే అప్పులు చేస్తున్నారంటూ గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు. ప్రజలకుపయోగపడే నిధులు పెట్టుబడి అవుతాయా.. అప్పులవుతాయా? తప్పులవుతాయా ..? అంటూ ప్రశ్నించారు. వారి నిరర్థక మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. స్థానిక యువతకు అవసరమైతే టీఎస్‌ఐపాస్ ద్వారా తగిన శిక్షణనిచ్చి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే పరిశ్రమల రంగంలో 62 వేల యూనిట్లకు లక్షా 24 వేల కోట్ల పెట్టుబడులు రాగా, వాటిల్లో సగానికి పైగా పరిశ్రమలు ప్రారంభమయ్యాయని చెప్పారు. వీటిద్వారా 3.30 లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఐటీ రంగంలో జాతీ య సగటు 9% కాగా, మన రాష్ట్రం 14 శాతంతో ఉందన్నా రు. ఎర్రటి ఎండలోనూ రెప్పపాటు వ్యవధికూడా కరెంటు కోతల్లేకుండా చేసిన విషయా న్ని ప్రజలే చెప్పాలన్నారు.
దేశానికే మోడల్ కానున్న తెలంగాణ..
సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో ఏడాది తర్వాత దేశంలోని అన్ని రాష్ట్రాలకూ తెలంగాణ రాష్ట్రమే నమూ నాగా చర్చ జరుగుతోందని కేటీఆర్ అన్నారు. ఇది తమ ఆత్మవిశ్వాసం తప్ప అహంకారం కాదని స్పష్టం చేశారు. ఒకప్పుడు అభివృద్ధికి నమూనాగా మోదీ ముఖ్యమంత్రిగా ఉన్న గుజరాత్ ఉండేదని, ఇప్పుడు కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ దేశానికే మోడల్ రాష్ట్రం కానుందన్నారు. గతంలోనూ పేదలకు ఇళ్లు నిర్మించినా తూతూమంత్రంగా నిర్మించేవారని, కాగితాల్లోని ఇళ్లు వాస్తవంగా కనపడేవి కావని పేర్కొన్నారు. నగరంలో అన్ని వసతులతో గేటెడ్ కమ్యూనిటీ ఇళ్ల మాదిరిగా నిర్మించిన ఈ ఇళ్లకు యూనిట్‌కు రూ. 8.75 లక్షలు ఖర్చయినా, మార్కెట్ ధర మేరకు కనీసం రూ.30 లక్షలుంటుందన్నారు. రాష్ట్రంలోని 3 లక్షల ఇళ్లకు రూ.18 వేల కోట్లు ఖర్చవుతున్నా ఉచితంగా ఇచ్చిన గౌరవం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. అంతకుముందు ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో దాదాపు రూ. 234 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు.
‘కేటీఆర్‌కు ఎకనమిక్ ఫోరమ్ ఆహ్వానం’
రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్‌లో జరిగే ఇంటర్నేషనల్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశానికి హాజరుకావాలని ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావుకు ఆహ్వానం లభించింది. మే 24 నుంచి 26 వరకు జరిగే ఈ సమావేశాల్లో ప్రపంచ వాణిజ్యవేత్తలు, ప్రభుత్వాల ప్రతినిధులు పాల్గొని, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ గురించి చర్చిస్తారని నిర్వాహకులు తెలిపారు. సమావేశంలో పాల్గొని రాష్ట్ర వాణిజ్య ప్రాధాన్యం, పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వ పాలసీల గురించి వివరించాలని మంత్రిని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment