సాక్షి, సిరిసిల్ల: ‘మీ చేతగానితనం వల్లే ప్రజలు టీఆర్‌ఎస్‌కు అధికారం ఇచ్చారు. మీరే బాగుంటే తమకు ఈ అవకాశం వచ్చేది కాదు’ అని మునిసిపల్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు ప్రతిపక్షాలనుద్దేశించి వ్యాఖ్యానించారు. రాజన్న సిరిసిల్లలో గురువారం నిర్వహించిన రైతుబంధు పథకం అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఎలాగూ గెలవలేమని తెలిసి ప్రతిపక్షాలు తమ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయని, ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తున్నాయని మండిపడ్డారు.
మీ పాలనలో ఆ హామీలు ఎందుకు అమలు చేయలేదని, అసలు మిమ్మల్ని ప్రజలు నమ్మేస్థితిలో లేరని చెప్పారు. రైతు సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందన్నారు. అన్నదాతలు బ్యాంకులను అప్పు కోసం యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు. సబ్బు, పేస్టు తదితర ప్రతీ వస్తువుకు ధర నిర్ణయించే అవకాశం ఉత్పత్తిదారులకు ఉందని, కానీ తమ ఉత్పత్తులకు ధర నిర్ణయించే అవకాశం రైతుకు లేదని ఆవేదన వ్యక్తంచేశారు.
అందుకే రైతు చేతుల్ని బలోపేతం చేసేందుకే తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. స్వామినాథన్ సిఫారసులను అమలు చేయడానికి సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో పని చేస్తున్నారన్నారు. గతంలో అప్పు చెల్లించకపోతే రైతుల ఇంటి తలుపులు ఎత్తుకెళ్లిన తీరును చూశామని, ఇప్పుడు దేశంలోనే ఎవరూ చేయని విధంగా సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించడానికి రైతుబంధు పథకం ద్వారా రైతుకు అవసరమైన పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నామని మంత్రి వివరించారు.
స్వామినాథన్ సిఫారసుల్లో ఒకటైన నాణ్యమైన కరెంటును నిరంతరం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వెల్లడించారు. ఒకప్పుడు కరెంటు కావాలని రైతులు ధర్నాలు చేస్తే ఇప్పుడు 10 గంటలు కరెంటు చాలని ధర్నా చేసే పరిస్థితి వచ్చిందంటే ఇది గుణాత్మక మార్పు కాదా అని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. భూ రికార్డుల ప్రక్షాళనలో రాజన్న సిరిసిల్ల జిల్లాను నంబర్ వన్‌గా నిలిపినందుకు అధికారులను అభినందించారు.
హరీశ్.. వాయువేగంతో ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నారు
తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని, పెద్దఎత్తున చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రతీ నీటిబొట్టును సాగుకు యోగ్యమైన భూమికి అందించడానికి మంత్రి హరీశ్‌రావు వాయువేగంతో ప్రాజెక్టుల పనులు పూర్తి చేస్తున్నారని కితాబిచ్చారు. ప్రాజెక్టులను సందర్శించిన కేంద్ర జలవనరుల సంఘం చీఫ్ ఇంజినీర్లు వాటిని చూసి అబ్బురపడుతున్నారని చెప్పారు.
తనకు వ్యవసాయంలో ప్రత్యక్ష అనుభవం లేదని, కానీ మనం పండించిన పంట అందరికీ ఉపయోగపడుతుందంటే అందులోని తృప్తి వేరని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే, రసమయి బాలకిషన్ ఆటపాటలతో సందడి చేశారు. టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్, జాయింట్ కలెక్టర్ యాస్మిన్‌బాషా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment