సాక్షి, హైదరాబాద్: సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వ్యతిరేకిస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆగిందా, ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్ మాత్రం ఆగుతుందా అని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ఆలోచనా శక్తి, మేధోపటిమకు అనుగుణంగా ఫెడరల్ ఫ్రంట్‌ను తీర్చిదిద్దే ఆలోచనతో ఉన్నట్లు చెప్పారు. అప్పటి వరకు సీతారాం ఏచూరి వంటి వాళ్లు ఏమి మాట్లా డినా, ఏమనుకున్నా పట్టించుకోబోమని, తమ ఆలోచనలు తమకున్నాయన్నారు.
ఈ నెల 27న జరగనున్న టీఆర్‌ఎస్ 17వ ఆవిర్భావ ప్లీనరీ ఏర్పాట్లను మంత్రి జగదీశ్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీలు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి కేటీఆర్ సోమవారం పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లా డుతూ, ఇదే ఏచూరి తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించారన్నారు. ఏచూరి అనుకున్నంత మాత్రాన జరిగేది ఆగదని స్పష్టం చేశారు.
ప్లీనరీకి ఎవరినీ పిలవట్లేదు..
జాతీయ పార్టీల నేతలు, ఇతర రాష్ట్రాల ముఖ్యులెవరూ ప్లీనరీకి రావడం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇతర ప్రాంతాల నుంచి ముఖ్యులు ఎవరినీ ఆహ్వానించడం లేదని, ఇది పూర్తిగా పార్టీ కార్యక్రమంగానే నిర్వహిస్తు న్నామని తెలిపారు. ఇది సాధారణ ఎన్నికల ముందు జరుగుతున్న అతి ముఖ్యమైన ప్లీనరీ అని చెప్పారు.
2019లో ఎన్నికల సమయంలో ప్లీనరీ నిర్వహించుకోలేమని, ఈ సమావేశమే రాజకీయంగా విస్తృతమైనదని పేర్కొన్నారు. దేశంలో ఫెడరల్ వ్యవస్థ స్ఫూర్తి ఉండాలని కోరుకుంటున్నారని, దానికి అనుగుణంగా ప్లీనరీలో నిర్ణయాలుంటాయని వెల్లడించారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, నమూనా దేశానికి మార్గదర్శ కంగా ఉన్నాయన్నారు.
రాష్ట్ర, దేశ రాజకీయాల్లో ప్రధాన భూమిక పోషించే దిశగా ఈ ప్లీనరీ ఉంటుందని చెప్పారు. ప్లీనరీ విజయవంతం కోసం పలు కమిటీలను ఏర్పాటు చేశామన్నా రు. పార్టీ వార్షికోత్సవంలో భవిష్యత్ కార్యాచ రణ, పార్టీ కార్య క్రమాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాల అమలుపై చర్చ, తీర్మానా లుంటాయని కేటీఆర్ వివరించారు.
13 వేల మంది ప్రతినిధులు
ప్లీనరీ ఉదయం 10 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని కేటీఆర్ చెప్పారు. నియోజకవర్గానికి 100 మంది చొప్పున మొత్తం 13 వేల మంది ప్రతినిధులు, 20 దేశాల్లో ఉన్న టీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ ప్రతి నిధులు సమావేశంలో పాల్గొంటారని వెల్లడించారు. సామాన్య ప్రజలకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ప్రతినిధుల నమోదు కోసం 40 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముందుగా నమోదు చేసుకున్న తర్వాతనే ప్లీనరీలో పాల్గొంటారని చెప్పారు. 8 భోజన శాలలు ఏర్పాటు చేశా మని తెలంగాణ వంటకాలు నోరూరిస్తాయ న్నారు. వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్లీనరీలో పాల్గొనే అందరికీ అంబలి, సల్ల (మజ్జిగ), నీరు అందుబాటులో ఉంచుతున్నామన్నారు. శుక్రవారం రోజునే ప్లీనరీ ఉన్నందున ముస్లింలు నమాజ్ చేసుకు నేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.
వైద్య సేవల కోసం డాక్టర్ల బృందం, నాలుగు అంబులెన్స్‌లు, హెల్త్ క్యాంప్‌లను ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థి, యువజన విభాగం నుంచి 500 మంది సుశిక్షుతులైన వారిని ఎంపిక చేశామని, ఇబ్బందులు రాకుండా హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి శిక్షణ, మార్గనిర్దేశనం చేస్తారని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీలు మల్లారెడ్డి, బాల్క సుమన్, ఎమ్మెల్యేలు వివేకానంద, కృష్ణా రావు, సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, కర్నె ప్రభాకర్, టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు తదితరులు పాల్గొన్నారు.
త్వరలోనే మూసీ అందాలు చూస్తారు..
మూసీ సుందరీకరణ త్వరలోనే ప్రారంభమవుతుందని, సుందరీకరించిన తర్వాత సీతారాం ఏచూరిని కూర్చోబెట్టి మూసీ అందాలను చూపిస్తామని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మూసీ నదిలోకి చాలా నీళ్లు వచ్చినట్టు ఎన్నికల నాటికి చాలా ఫ్రంట్ లు వస్తాయంటూ ఏచూరి వ్యాఖ్యానించిన నేపథ్యంలో కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్‌ను, ఇక్కడ మూసీ అందాలను ఏచూరి చూస్తారన్నారు.
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులే మెచ్చుకుంటున్నారని చెప్పారు. దేశంలో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ రెండే రాష్ట్రాల్లో అధికారంలో ఉందని, కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక, పంజాబ్ రాష్ట్రాల మంత్రులే రాష్ట్ర అభివృద్ధిని కీర్తిస్తున్నారన్నారు. బీజేపీ మంత్రులూ పొగుడుతున్నారని, తెలంగాణ అభివృద్ధి నమూనా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment