
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలెప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు స్పష్టం చేశారు. జమిలి ఎన్నికలను స్వాగతిస్తామని పేర్కొన్నారు. డిసెంబర్‌లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయా అని ట్విట్టర్‌లో ఓ అభిమాని ప్రశ్నించగా ఈ మేరకు బదులిచ్చారు. ఆదివారం ట్విట్టర్ వేదికగా కేటీఆర్ నెటిజన్లతో సంభాషించారు. వారడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. జాతీయ, రాష్ట్ర రాజకీయాలు, పథకాలు, వ్యక్తిగత ఇష్టాయిష్టాలు తదితర అంశాలపై సూటిగా, చతురతతో సమాధానాలిచ్చి ఆకట్టుకున్నారు. పలు ప్రశ్నలకు సమాధానాలిలా ఉన్నాయి.
నచ్చిన నాయకుడు కేసీఆర్
నచ్చిన రాజకీయ నాయకుడు ఎవరని ఒకరు ప్రశ్నించగా సీఎం కేసీఆర్ అంటూ కేటీఆర్ బదులిచ్చారు. ప్రపంచ స్థాయిలో బరాక్ ఒబామా ఇష్టమైన నాయకుడని పేర్కొన్నారు. తెలంగాణకు తదుపరి సీఎం కేసీఆరేనని చెప్పారు. ‘ 2024లో జరిగే ఎన్నికల్లో మీరు ఏపీ నుంచి పోటీ చేయాలని నాలాంటి చాలా మంది యువకులు కోరుకుంటున్నారు. మీరేమం టారు?’అని ఒకరు ప్రశ్నించగా.. ‘భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు’అని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఎన్ని సీట్లు వస్తా యని అని ఓ నెటిజన్ ప్రశ్నించగా... ‘ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సీట్ల కంటే ఎక్కువ ఏం కావాలి? ఎన్నిక ల్లో అద్భుత విజయమే మా లక్ష్యం’ అని అన్నారు. ప్రజలు వామపక్ష పార్టీలను ఎప్పుడో వదిలేశారని మరో ప్రశ్నకు బదులిచ్చారు. వచ్చే ఎన్నికల్లో నల్లగొండ జిల్లాలో అన్ని అసెంబ్లీ స్థానాలు గెలుస్తా మన్నారు. జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాలని, దేశానికి మీ లాంటి వారి సేవలు అవసర మని ఓ అభిమాని కోరగా ప్రణాళికలు వేసుకుని వెళ్లడం కుదరదన్నారు. కేసీఆర్, వైఎస్సార్‌లలో ఎవరు ఉత్తమ సీఎం అని ప్రశ్నించగా ప్రశ్నలోనే సమాధానముందన్నారు. శాంతిభద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదంటూ తాజాగా పోలీసులు చేసిన నగర బహిష్కరణలను కేటీఆర్ సమర్థించారు.
త్వరలో నిజామాబాద్, కరీంనగర్‌లో ఐటీ టవర్లు
రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన వెంటనే బుద్వేల్‌లో ఐటీ క్లస్టర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన జరుపుతా మని కేటీఆర్ చెప్పారు. నిజామాబాద్, కరీంనగర్‌ల లో ఐటీ టవర్ల నిర్మాణాన్ని త్వరలో ప్రారంభిస్తామన్నారు. ప్రైవేటు బడుల్లో ఫీజుల వసూళ్లపై కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. సులభతర వాణిజ్యం (ఈఓడీబీ)లో తెలంగాణ కేవలం 0.09 శాతం స్కోరుతో వెనుకబడి తొలి ర్యాంకును కోల్పోయిందంటూ తొలి ర్యాంకు సాధించిన ఏపీకి అభినందనలు తెలిపారు. గత నాలుగేళ్లలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాలన విధానాలు దేశంలోని ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా మారాయని చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి రైతుబంధు లాంటి కార్యక్రమాన్ని ఎన్నడూ అమలు చేయలేదన్నారు. హైదరాబాద్‌లోని రోడ్ల పరిస్థితిపై తనకూ ఆందోళనగా ఉందని, ఇంతకంటే మెరుగ్గా రోడ్లను తీర్చిదిద్దగలిగితే బాగుండేదని అనిపిస్తోందని పేర్కొన్నారు. నగర రోడ్లను బాగు చేయడం అంతులేని ప్రయత్నంగా మారిందని వ్యాఖ్యానించారు. నిజాం కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు కదా.. ఎలా అనిపిస్తోందని ఒకరు అడగ్గా.. అది అద్భుతమైన కాలేజీ అని కొనియాడారు. దేశానికి బలమంతా యువతేనని తెలిపారు. జూలై 24న తన పుట్టిన రోజు సందర్భంగా కేకులు, పోస్టర్లు కాకుండా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
ఇష్టమైన బీరా.. చెప్పను!
ఇష్టమైన క్రికెటర్ ఎవరు.. ధోనీనా, కోహ్లీనా.. అని ఓ నెటిజన్ ప్రశ్నించగా రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండుల్కర్ అని కేటీఆర్ బదులిచ్చారు. తాను వారి తరానికి చెందిన వాడినని పేర్కొన్నారు. ఇష్టమైన ఫుట్‌బాల్ క్రీడాకారుడు లయోనెల్ మెస్సీ, ఇష్టమైన టెన్నిస్ ప్లేయర్ ఫెదరర్ అని చెప్పారు. ఏ బీరు అంటే ఇష్టమని ఓ అభిమాని ప్రశ్నించగా.. ‘చెప్పను..’ అని కేటీఆర్ చమత్కరించారు. రోడ్ సైడ్ లభించే ఆహారంలో చైనీస్ ఫుడ్ ఇష్టమన్నారు. అదివారం ఫ్రాన్స్, క్రొయేషియా మధ్య జరుగుతున్న ఫుట్‌బాల్ ప్రపంచ కప్ ఫైనల్‌ను ప్రస్తావిస్తూ.. క్రొయేషియాకే ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తోందని కేటీఆర్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment