చేసిందంతా చేసి నీతులా..? | Ktr commented over congress | Sakshi
Sakshi News home page

చేసిందంతా చేసి నీతులా..?

Published Tue, Apr 10 2018 1:40 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Ktr commented over congress  - Sakshi

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: రాష్ట్రాన్ని చేసినంత నాశనం చేసిన కాంగ్రెస్‌.. ఇప్పుడు బస్సుయాత్రలంటూ ప్రభుత్వానికి నీతులు చెప్పేందుకు బయలుదేరిందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. జిల్లాలో ఖమ్మం, మధిరలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సోమ వారం మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం రఘునాథపాలెం మండలం శివాయిగూడెం వద్ద ఎమ్మెల్యే పువ్వా డ అజయ్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు.

కాంగ్రెస్‌ నేతల మాటల్ని ప్రజలు విశ్వసించక చాలా కాలమైందని, గడ్డాలు పెంచిన వారంతా గబ్బర్‌సింగ్‌లు కాలేరన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ నేతల తీరు దెయ్యా లు వేదాలు వల్లించినట్లుగా ఉందని విమర్శిం చారు. సీఎం కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధి మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు మంచిగా కనబడిం దన్నారు. ఇక్కడి కాంగ్రెస్‌వారికి అసలు అభివృద్ధే కనపడనట్లుగా ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రూ.5,500 కోట్లను ఆసరా పెన్షనకు ఖర్చు పెట్టి న ఘనత తమ ప్రభుత్వానిదేనని చెప్పారు.

రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరివ్వాలనే లక్ష్యంతో సీతారామ ప్రాజెక్టు, కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల పథకాలను త్వరితంగా పూర్తి చేస్తున్నారన్నారు. తాము అధికారంలోకి వస్తే రైతు లకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని ఉత్తమ్‌ చెబుతున్నారని, అమ్మకు అన్నం పెట్టని వాడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా అని ఎద్దేవా చేశారు.

నిరుద్యోగులకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెబుతున్నారని, రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులున్నారో మీరు ఎలా గుర్తిస్తారని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి ఇస్తే రిటైర్డ్‌ కాబోయే మీ కాంగ్రెస్‌ నాయకులకు ఇవ్వాలి తప్ప.. మీ మాట విని ఓట్లు వేసే యువకులు ఎవరూ లేరన్నారు. కాంగ్రెస్‌ నాయకులు ఎంత గొంతెత్తి అరిచినా వారి చరిత్ర మీ ముందు ఉందన్నారు.

రైతన్నలూ.. ఆలోచించండి
రైతన్నలూ.. ఆలోచించండి.. ఆనాడు వ్యవసా యంలో ఎలా ఉంది..? ఈ రోజు ఎలా ఉందో ఒక్కసారి బేరీజు వేసుకుని చూడాలన్నారు. ఉమ్మడి ఏపీలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఎన్ని శాపనార్థాలు పెట్టారు. తెలంగాణ వస్తే కరెంటే ఉండదన్నారని, ఇప్పుడేమైంది.. మండుటెండ లోనూ 24 గంటలపాటు కరెంటు ఇస్తున్నామన్నారు. తెలంగాణ హక్కు అయిన 1,200 టీఎంసీల నీటిని వాడుకుని సాగునీటికి ఇబ్బంది లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నారని పేర్కొ న్నారు.

దేశం అబ్బురపడి చూసేలా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయని చెప్పారు. మనసున్న సీఎం పాలన ఎలా ఉంటుందో.. రాష్ట్రంలో అమలు జరుగుతున్న సంక్షేమ పథకాలను చూస్తే తెలుస్తుందన్నారు. 1.12 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయనున్నామన్నారు. 2004లో, 2009 ఎన్నికల మేనిఫెస్టోలో కూడా కాంగ్రెస్‌ తండాలను, గూడేలను గ్రామ పంచాయతీలను చేస్తామని హామీ ఇచ్చారని, వారు చేయకపోవడంతో సీఎం  హామీ మేరకు కొత్తగా 2,630 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశామని చెప్పారు.

మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్‌ హయాంలో ప్రజలకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. సభలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మహబూబాబాద్‌ ఎంపీ సీతారాంనాయక్, కలెక్టర్‌ డీఎస్‌.లోకేశ్‌కుమార్, ఎమ్మెల్యే మదన్‌లాల్, ఎమ్మెల్సీలు పూల రవీందర్, బాలసాని లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement