సీఎం చంద్రశేఖర్ రావు
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పార్టీ నిర్మాణంపై దృష్టి సారించారు. నియోజకవర్గాల్లో నేతలందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా పార్టీనే సుప్రీం అన్న దిశగా నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. కొన్ని నియోజకవర్గాల్లోని పార్టీ నేతల్లో అసంతృప్తి చాయలు ఉన్నట్టు సీఎం దృష్టికి వచ్చింది.
ఎన్నికల తరుణంలో ఏ స్థాయి నాయకుడు పార్టీని వీడినా ఎంతోకొంత నష్టం తప్పదని, పార్టీ కోసం పనిచేసిన వారు ఏ స్థాయిలో ఉన్నా కాపాడుకోవాలని కేసీఆర్‌కు పలు విజ్ఞప్తులు అందాయి.
దీంతో పార్టీ నిర్మాణంపై సీఎం దృష్టి సారించారు. ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో అధ్యయనం చేయాల్సిందిగా మంత్రి కేటీఆర్‌కు సూచించారు. అందుబాటులో ఉన్న పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులతో కేటీఆర్ సమావేశమైనట్టుగా తెలుస్తోంది. ప్లీనరీ వేదికగా ఆయన పలు కీలకాంశాలను ప్రకటించే అవకాశం ఉంది.
అందరితో కలిసి..
టీఆర్‌ఎస్‌కు సొంతంగా గెలిచిన 65 మంది ఎమ్మెల్యేలకుతోడు ఇతర పార్టీల నుంచి చేరిన 25 మందితో కలిపి మొత్తం 90 మంది శాసనసభ్యులున్నారు. ఇందులో కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు, పార్టీ ఇన్‌చార్జిలకు మధ్య విభేదాలున్నట్టుగా అధినాయకత్వం గుర్తించింది. నేతలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నిఘా వర్గాల ద్వారా కూడా ఇదే సమాచారం అందింది. దీంతో అసంతృప్తి నేతలను మరింత చురుగ్గా పార్టీ కార్యక్రమాల్లో మమేకం చేసేలా చర్యలు తీసుకోవాలని టీఆర్‌ఎస్ అధినాయకత్వం భావిస్తోంది. ప్రభుత్వ యంత్రాంగానికి సమాంతరంగా పార్టీ నిర్మాణం చేసే దిశగా సమాలోచనలు జరుగుతున్నాయి. పార్టీ తీసుకున్న నిర్ణయానికి ఎమ్మెల్యే కూడా కట్టుబడి ఉండేలా నిర్మాణం, యంత్రాంగం ఏర్పాటు చేస్తే బాగుంటుందని పలువురు ముఖ్య నేతలు కోరుతున్నారు.
ప్లీనరీ బాధ్యతలన్నీ కేటీఆర్‌కే..
ఎన్నికలకు ఏడాది మాత్రమే మిగిలి ఉన్న సమయంలో జరుగుతున్న టీఆర్‌ఎస్ ప్లీనరీ బాధ్యతలన్నీ మంత్రి కేటీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఆయన సన్నిహితులైన హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, మైనంపల్లి హన్మంతరావు, కర్నె ప్రభాకర్, టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు వేదిక వద్దే ఉంటూ ఏర్పాట్లను చేస్తున్నారు.
కాగా, బుధవారం మంత్రులు ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించారు. పార్టీకి చెందిన 13 వేల మంది ప్రతినిధులతో పాటు 20 దేశాల ఎన్నారై ప్రతినిధులు హాజరవుతున్నారని ఈటల చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment