బుధవారం తెలంగాణ భవన్‌లో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగ భృతి ఇస్తామంటున్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి నిరుద్యోగుల సంఖ్య ఎంతో తెలుసా అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రశ్నించారు. వరంగల్‌కు చెందిన కాంగ్రెస్ నేత, కుడా మాజీ చైర్మన్ చెరుకుపల్లి శ్రీనివాస్‌రెడ్డి బుధవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్ ఈయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇస్తారో లెక్క చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ వస్తే చీకట్లు తప్ప కరెంటు ఉండదని, తినడాని కి బువ్వ ఉండదని, పరిపాలన చేసే తెలివి లేదని అన్నవాళ్లే ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధిని పొగుడుతున్నారని చెప్పారు.
ఎండాకాలం వస్తే కరెంటు లేక పంటలు ఎండిపోయేవని, పరిశ్రమలకు వారానికి 2 రోజులు కరెంటు ఇవ్వకుండా వేధించేవారని గుర్తుచేశారు. వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగా ణ ఒక్కటేనన్నారు. నాడు ఎరువుల కోసం చెప్పులు లైన్లలో పెట్టి ఎండలో వెళ్లి తెచ్చుకునే పరిస్థితి అని, విత్తనాలను పోలీసుస్టేషన్లలో ఇచ్చేవారని ఎద్దేవా చేశారు. దేశాని కి అన్నం పెడుతున్న రైతన్నలకు 17 వేల కోట్ల రుణమాఫీ చేశామని గుర్తు చేశారు.
రాబందు.. రైతుబంధు
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు పథకాన్ని చూసి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆశ్చర్యపోయారని, పెట్టుబడి కింద ఇచ్చే డబ్బులను రైతులు తిరిగి చెల్లించాలా అని అడిగారని చెప్పారు. గతంలో రాబందు ప్రభుత్వాలు ఉండేవని, ఇప్పుడు ఉన్నది రైతు బంధు ప్రభుత్వమని పేర్కొన్నారు. రైతు సమన్వయ కమిటీలతో రైతులకు ఇబ్బందులు లేకుం డా చేస్తున్నామని తెలిపారు. 1956కు ముందు నల్లగొండలో ఫ్లోరోసిస్ లేదని, పాలించిన నాయకుల అసమర్థత వల్లే అది వచ్చిందన్నారు. ఇంటింటికీ తాగు నీళ్లు ఇస్తామని, ఇవ్వలేకుంటే ఓట్లు అడగబోమని ప్రకటించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులకు పూర్వవైభవం తెస్తున్నామన్నారు. వరంగల్‌కి రూ.300 కోట్లు బడ్జెట్‌లో కేటాయించామని, అన్ని ప్రాంతాలకు నిధులు ఇస్తున్నామని చెప్పారు.
గల్లీ ప్రజలే టీఆర్‌ఎస్‌కు బాసులు
ఎన్నికలు దగ్గర పడుతుండటంతో సహనం నశించి, భవిష్యత్తు లేదనే భయంతో కాంగ్రెస్ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. ఎన్నికల సమయంలో కొట్లాడుదామని, మిగిలిన సమయంలో అభివృద్ధి చేసుకుందామని సూచించారు. గడ్డం పెంచిన వారంతా గబ్బర్‌సింగ్‌లు అవుతారా అని ఉత్తమ్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. ఢిల్లీ చెప్పుచేతల్లో ఉంటూ రాష్ట్రాన్ని పట్టించుకోని కాంగ్రెస్ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడటం సరికాదని హితవుపలికారు. ఢిల్లీలో టీఆర్‌ఎస్‌కు అధిష్టానం లేదని, గల్లీలో ఉన్న ప్రజలే టీఆర్‌ఎస్‌కు బాసులని వ్యాఖ్యానించారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో రూ.2 లక్షల రుణమాఫీ అని కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని, దీని గురించి గతంలో రాహుల్ గాంధీతో చెప్పించినా ప్రజలు నమ్మలేదన్నారు.
కాంగ్రెస్‌లో అన్ని కేసులున్న వారూ ఉన్నారని, వారిని ప్రజలు ఎలా సహిస్తారని ప్రశ్నించారు. దేశంలో అందరినీ మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. ఎన్నో త్యాగాలు చేసి, పోరాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేసేదాకా కేసీఆర్ నాయకత్వంలోనే నడవాలన్నారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ అధ్యక్షత వహించారు. ఎంపీ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment