హర్దీప్‌సింగ్ పూరీతో మంత్రి కేటీఆర్
సాక్షి, న్యూఢిల్లీ: అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరింత ఆర్ధిక చేయూతనిచ్చి తనవంతు అండగా నిలవాలని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు విజ్ఞప్తి చేశారు. ఐటీ, ఏరోస్పేస్, డిఫెన్స్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, రహదారులు, మెట్రో రైలు విస్తరణ వంటి రంగాల్లో కేంద్రం సహకారం ఇవ్వాలని, రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ప్రగతికి తోడ్పడాలని కోరారు. రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసేందుకు ఢిల్లీకి వచ్చిన మంత్రి కేటీఆర్.. శనివారం కేంద్ర ప్రజా పంపిణీ వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ పూరీతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా అదనపు ధాన్యం సేకరణ, హైదరాబాద్‌లో చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్లు, ఎస్‌ఆర్‌డీపీ, లింకు రోడ్లు, పారిశుధ్యరంగంలో చేపట్టిన సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ వంటి కార్యక్రమాలపై వారితో చర్చించారు. అయితే శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో కేటీఆర్ భేటీ జరగాల్సి ఉన్నా చివరి నిమిషంలో రద్దయింది. ఇందుకు గల కారణాలు తెలియరాలేదు. ఆదివారం ఉదయం కేటీఆర్ హైదరాబాద్‌కు తిరుగుపయనం కానున్నట్టు తెలిసింది.
రోడ్లు, రైల్వే విస్తరణ, పారిశుధ్యానికి నిధులపై హర్దీప్‌పూరీకి విజ్ఞప్తి
► హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు రెండో దశ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలి. లక్డీకాపూల్ నుంచి బీహెచ్‌ఈఎల్ వరకు 26 కిలోమీటర్లు, నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు 5 కిలోమీటర్ల మెట్రోకు ఆమోదంతోపాటు ఆర్థిక సాయం చేయాలి.
► రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగర పరిధిలో చేపట్టిన మిస్సింగ్, లింకు రోడ్ల నిర్మాణ కార్యక్రమాలు విజయవంతంగా నడుస్తున్నాయి. 22 మిస్సింగ్ లింక్ రోడ్లను పూర్తి చేయగా.. మరో 17 రోడ్ల నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. ఇదే రీతిలో ఔటర్ రింగ్ రోడ్డు నుంచి పరిసర పురపాలికలకు మొత్తం 104 అదనపు కారిడార్లను నిర్మించేందుకు రూ.2,400 కోట్ల మేర ఖర్చవుతుంది. కేంద్రం రూ.800 కోట్లను ఈ ప్రాజెక్టు కోసం కేటాయించాలి.
► హైదరాబాద్‌లో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ కోసం స్వచ్ఛ భారత్ మిషన్ లేదా ఇతర కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం కింద రూ.400 కోట్ల ఆర్థిక సాయం అందించాలి.
► రూ.3,050 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి 15శాతం నిధులు అంటే రూ.450 కోట్లను ఆర్థిక సాయంగా అందించాలి.
► హైదరాబాద్ నగర పరిధిలో చేపడుతున్న ఎస్టీపీల నిర్మాణ ఖర్చు దాదాపు రూ.3,722 కోట్లలో.. కేంద్రం కనీసం రూ.744 కోట్లు భరించాలి.
► రాష్ట్రంలో కేంద్రం నిర్దేశించిన సిటిజన్ సెంట్రిక్ రీఫారŠమ్స్ కింద చేపట్టిన బయో మైనింగ్, మానవ వ్యర్ధాల శుద్ధి ప్లాంట్ల ఏర్పాటుకు రూ.750 కోట్లను సాయంగా ఇవ్వాలి.
► గ్రామీణ ఉపాధి హామీ పథకం మాదిరిగా పట్టణ పేదల కోసం ప్రత్యేకంగా ఉపాధి హామీ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమల్లోకి తేవాలి.
► కాగా.. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన శానిటేషన్ హబ్ కార్యక్రమాన్ని ప్రశంసించిన హర్దీప్ సింగ్ పూరీ.. ఈ అంశంపై త్వరలో తమ శాఖ ఢిల్లీలో ఏర్పాటు చేసే సమావేశంలో ప్రజెంటేషన్ ఇవ్వాలని కేటీఆర్‌ను కోరారు.
అదనపు బియ్యం సేకరణపై పీయూష్ గోయల్‌కు..
► ఇటీవలికాలంలో çఅధిక ఉష్ణోగ్రతల కారణంగా ముడిబియ్యాన్ని అందించే పరిస్థితులు లేవు. మైసూర్‌లోని సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సైతం గత రబీ సీజన్‌లో రాష్ట్రంలోని 11 జిల్లాల్లో టెస్ట్ మిల్లింగ్ నిర్వహించి.. ఈ సీజన్‌లో అధికంగా పండించే ఎంటీయూ 1010 రకంలో 48.20శాతం విరుగుడు ఉందని నివేదిక ఇచ్చింది.
► ప్రస్తుత సీజన్‌లో రాష్ట్ర ప్రభుత్వం 66.11 లక్షల టన్నుల వరిని సేకరించింది. కానీ కేంద్రం 10.20 లక్షల టన్నుల పారా బాయిల్డ్ రైస్ తీసుకుంటామన్నది. అంటే 15 లక్షల టన్నుల ధాన్యానికి మాత్రమే అనుమతించింది. మిగతా 51.11 లక్షల టన్నుల ధాన్యాన్ని ఎఫ్‌సీఐకి ముడి బియ్యంగా ఇవ్వాల్సిన పరిస్థితి. అలా ఇచ్చేందుకు ప్రతి లక్ష టన్నులకు రూ.42.08 కోట్లు చొప్పున.. 34.24 లక్షల టన్నుల బియ్యానికి రాష్ట్రంపై రూ.1,441 కోట్ల ఆర్ధిక భారం పడుతుంది. అందువల్ల ఈ రబీ సీజన్‌కు సంబంధించి అదనంగా 20 లక్షల టన్నుల పారా బాయిల్డ్ ఫోర్టిఫైడ్ రైస్ తీసుకోవాలని కోరుతున్నాం.
Comments
Please login to add a commentAdd a comment