అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్న వివిధ రకాల హస్తకళాకారులకు శిక్షణ ఇచ్చేందుకు గుండ్లపోచంపల్లి పారిశ్రామిక వాడలో నైపుణ్యాభివృద్ధి శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తా మని పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు చెప్పారు. దీని నిర్వహణ, మౌలిక సదుపాయాలకు నిధులు కేటాయి స్తామన్నారు. అలాగే ఈ పారిశ్రామికవాడలో సంబంధం లేని ఇతర కార్యకలాపాలు నిర్వహిస్తున్న వ్యాపారస్తుల అనుమతులు రద్దు చేయాలని ఆదేశించారు. చేనేత శాఖపై మంత్రి కేటీఆర్ మంగళవారం ఇక్కడ సమీక్ష నిర్వహించారు. పాశమైలారం టెక్స్‌టైల్ పార్కులో మరిన్ని పెట్టుబడులు వచ్చేలా అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. రాష్ట్రంలో చేనేత వస్త్రాలకు మంచి ఆదరణ లభిస్తోందని, వీటిని ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు టెస్కో ఆధ్వర్యంలో విక్రయ కేంద్రాల పెంపు, వెబ్‌సైట్ ఏర్పాటు, రీ బ్రాండింగ్ వంటి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నేతన్నకు చేయూత, చేనేత మిత్ర, లూమ్స్ అప్‌గ్రెడేషన్ వంటి కార్యక్రమాలను లబ్ధిదారుల్లోకి తీసుకెళ్లేందుకు కమ్యూనిటీ కోఆర్డినేటర్లను నియమించుకోవాలన్నారు.
సెప్టెంబర్‌లోగా అందుబాటులోకి బతుకమ్మ చీరలు: చేనేత శాఖ డైరెక్టర్
ఈ ఏడాది బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చేనేత శాఖ డైరెక్టర్ శైలజారామయ్యర్ మంత్రికి నివేదించారు. మొత్తం చీరలను రాష్ట్రంలోనే ఉత్పత్తి చేయిస్తున్నామని, సెప్టెంబర్ మూడో వారంలోగా చీరలను అందుబాటులోకి తెస్తామన్నారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్స్ పార్కులో రోడ్లు, నీళ్లు, కరెంటు వంటి మౌలిక వసతులు పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్ తదితరులు పాల్గొన్నారు.
కేటీఆర్‌ను కలిసిన బ్రిటన్ మంత్రి
సాక్షి, హైదరాబాద్: బ్రిటన్ ప్రభుత్వంలోని ఆసియా, పసిఫిక్ వ్యవహారాల మంత్రి మార్క్ ఫీల్డ్ పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావును మంగళవారం కలిశారు. బ్రిటన్ హై కమిషనర్ డొమినిక్ అస్క్విత్, డిప్యూటీ కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్‌ను కలిసిన అనంతరం క్యాంప్ కార్యాలయంలో మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అవకాశాలు, ఇక్కడ ఏర్పాటు చేస్తున్న పారిశ్రామికవాడల విశేషాలను కేటీఆర్ బ్రిటన్ మంత్రికి తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment