సిరిసిల్లలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్
సాక్షి, సిరిసిల్ల: గత 60 ఏళ్ల పాలనలో పాలకులు రైతులకు చుక్కలు చూపెడితే తాము చెక్కులు పంచుతున్నామని ఐటీ, మునిసిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట, ముస్తాబాద్‌లో శుక్రవారం రైతుబంధు పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుబంధు కార్యక్రమం దేశంలో సరికొత్త హరిత విప్లవానికి నాంది పలుకుతోందని చెప్పారు. ఈ విప్లవం దేశవ్యాప్తంగా పాకి ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచుతుందని జోస్యం చెప్పారు. గతంలో వారికి రాని ఆలోచనలు తమకు వస్తున్నందుకు ప్రతిపక్షాలు ఓర్వలేక కుయుక్తులు పన్నుతున్నాయని విమర్శించారు. రైతుబంధుపై పత్రికల్లో ఇచ్చిన ప్రకటనలపై ప్రతిపక్షాల ఆరోపణలపై స్పందిస్తూ.. దశాబ్దాలుగా జై జవాన్, జై కిసాన్ అంటూ నినాదాలివ్వడమే కానీ రైతుల కోసం ఎవరూ చేసిందేమీ లేదని విమర్శించారు. దేశవ్యాప్తంగా రైతులను చైతన్యవంతుల్ని చేయడానికే తాము వాణిజ్య ప్రకటనలు ఇస్తామని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా రైతుబంధుపై చర్చ జరుగుతోందని పేర్కొన్నారు.
తనకున్న 40 ఎకరాలకు వచ్చే పెట్టుబడి సాయాన్ని వెనక్కి ఇస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. తెలంగాణ వస్తే ఏమొస్తదని అన్నవాళ్లకు ఈ రోజు కళ్ల ముందున్నది కనబడుతలేదా అని ఆయన ప్రశ్నించారు. దేశంలో 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, గతంలో 4 లక్షల గోదాంలు ఉంటే ఇప్పుడు 22 లక్షల గోదాంలను నిర్మించామని వివరించారు. నకిలీ విత్తనాలు తయారుచేసే వారిపై పీడీ యాక్ట్‌ను ప్రయోగిస్తున్నామని తెలిపారు. 800 కోట్ల రూపాయల నీటి తీరువాను సీఎం రద్దు చేశారని వివరించారు. ఒక రైతుబిడ్డ సీఎం అయితే ఎట్లా ఉంటదో కేసీఆర్ చేసి చూపిస్తున్నారని చెప్పారు. జూన్ 2 నుంచి మరో అద్భుతమైన కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుందని తెలిపారు. రైతు కుటుంబంలో చనిపోయిన ఇంటిపెద్దకు రూ.5 లక్షల బీమా వర్తించేలా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
చిన్నారి చేయూత రూ.30 వేలు కేటీఆర్‌కు అందజేత
గంభీరావుపేట: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతులకు పెట్టుబడి సాయం అందించాలనే ఉద్దేశంతో ప్రారంభించిన రైతు బంధు పథకానికి ఓ చిన్నారి తన వంతు ఆర్థిక సాయాన్ని అందించింది. సిరిసిల్లకు చెందిన సెస్ ఉద్యోగి రాజేందర్ కూతురు అక్షిత స్థానిక కేంద్రీయ విద్యాలయంలో ఏడో తరగతి చదువుతోంది. తాను దాచుకున్న రూ.30 వేల సొమ్మును మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా కలెక్టర్ కృష్ణభాస్కర్‌కు అందించింది. ఆ చిన్నారిని మంత్రి కేటీఆర్ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment