
సాక్షి, హైదరాబాద్: రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదని ఉత్తరప్రదేశ్, బిహార్ ఉప ఎన్నికల ఫలితాలతో మరోసారి తేలిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కె.తారకరామారావు వ్యాఖ్యానించారు. గురువారం బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు లాబీల్లో తనను కలసిన విలేకరులతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. బీజేపీని ఢిల్లీలో, రాష్ట్రంలో కూర్చోబెట్టిన ప్రజలు.. ఉప ఎన్నికల్లో ఓడించి ఏదీ శాశ్వతం కాదనే సంకేతాన్ని స్పష్టంగా ఇచ్చారని అన్నారు. కేంద్రంలో, ఉత్తరప్రదేశ్‌లో అధికారంలో ఉన్న బీజేపీ ఓడిపోతే, మరో జాతీయ పార్టీ ధరావతును కూడా కోల్పోయిందన్నారు.
ఉత్తరాదిన కీలకమైన రెండు పెద్ద రాష్ట్రాలు ఉత్తర్‌ప్రదేశ్, బిహార్‌లలో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం పొందడం ద్వారా ప్రాంతీయ పార్టీలకే ప్రజాదరణ ఉందన్న విషయం తేలిపోతున్నదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ప్రజలు ఇకపై నమ్మరని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కొత్త ఫ్రంట్ ఏర్పాటు కావాలని ప్రజలు దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్నారని చెప్పారు. తెలంగాణ బిడ్డగా రాష్ట్రాన్ని సాధించి రుణం తీర్చుకున్నారని, భారత పౌరుడిగా కొత్త ఫ్రంట్ ఏర్పాటు చేసి భారతమాత రుణం తీర్చుకోవడానికి కేసీఆర్ సిద్ధమవుతున్నారని కేటీఆర్ చెప్పారు. దేశమంతా తెలంగాణ వైపు చూస్తోందన్నారు. సామాన్య ప్రజలకు ఏం కావాలో అదే కేసీఆర్ అజెండా అని కేటీఆర్ వివరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తే ప్రజలెవరూ పట్టించుకునే పరిస్థితి లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment