సమీక్షాసమావేశంలో మంత్రులు హరీశ్, కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: సిరిసిల్ల జిల్లాలోని అప్పర్ మానేరు ప్రాజెక్టును కాళేశ్వరం పరిధిలోకి తీసుకురావాలని గురువారం జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు, పురపాలక మంత్రి కేటీఆర్ నిర్ణయించారు. అప్పర్ మానేరు ప్రాజెక్టు (నర్మాల) 2.2 టీఎంసీల రిజర్వాయర్ కాగా చాలాకాలంగా పూడుకుపోయిన దృష్ట్యా, ఇక్కడ పూడికతీతకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. కాళేశ్వరంలోని ప్యాకేజీలు 9, 10, 11, 12లకు చెందిన టన్నెళ్లు, పంప్‌హౌస్, సర్జ్ పూల్, మెయిన్ కెనాళ్లు,, డిస్ట్రిబ్యూటరీలు ఇతర పనులపై గురువారం అసెంబ్లీ కమిటీ హాలులో సమీక్ష నిర్వహించారు. అప్పర్ మానేరులో పూడికతీత చేయాలని కేటీఆర్ కోరగా, దీనిపై చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు.
నర్మాలకు వెళ్లే కాలువలను రూ.38 కోట్లతో మరమ్మతు చేయనున్నట్టు హరీశ్ చెప్పారు. కాళేశ్వరంలో భాగమైన 9, 10, 11, 12 ప్యాకేజీల పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పనులు జరుగుతున్నట్టుగానే మిగతా ప్యాకేజీల పనులు అదే వేగంతో జరగాలని సూచించారు. ఈ నాలుగు ప్యాకేజీల కింద 3,51,150 ఎకరాలు సిరిసిల్ల, వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగులోకి రానున్నాయని మంత్రులు గుర్తు చేశారు. ప్రాజెక్టులో భాగంగా తలపెట్టిన పనులకు నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. సిరిసిల్ల జిల్లాలో మొత్తం 625 చిన్న తరహా నీటి వనరులున్నాయని, వీలైనన్ని ఎక్కువ చెరువులను నింపడం ద్వారా జిల్లాను మోడల్‌గా మార్చాలని కలెక్టర్ కృష్ణభాస్కర్, ఇరిగేషన్ ఉన్నతాధికారులకు కేటీఆర్ సూచించారు. సమీక్షలో శాసనసభ్యులు చెన్నమనేని రమేశ్, రసమయి బాలకిషన్, ఈఎన్‌సీ మురళీధర్‌రావు, సీఈ హరిరామ్, రిటైర్డ్ ఈఎన్‌సీ విజయప్రకాశ్, లిఫ్టుల సలహాదారు పెంటారెడ్డి పాల్గొన్నారు.
జూన్ కల్లా కాళేశ్వరం పంపుల రన్
ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్ కల్లా కాళేశ్వరం ప్రాజెక్టు పంపుల రన్ నిర్వహించాలని హరీశ్ ఆదేశించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలతో పాటు మూడు పంప్‌హౌస్‌ల పనులను విడిగా మంత్రి సమీక్షించారు. షిప్పింగ్ వల్ల ఆలస్యమయ్యే పక్షంలో ఆయా యంత్రాలను ఎయిర్ కార్గో ద్వారా దిగుమతి చేయాలని ఆదేశించారు. ప్యాకేజీ 6,8 పనులను కూడా సమీక్షించారు. ఇందులో వాడనున్న 139 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం గల పంపు ఆసియా ఖండంలోనే లేదని, చారిత్రక ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటున్న మూడు బ్యారేజీలు, మూడు పంప్‌హౌస్‌ల నిర్మాణం వైపు దేశమంతా చూస్తోందని అన్నారు. సమావేశంలో కాళేశ్వరం సీఈ నల్లా వెంకటేశ్వర్లు, ఎస్‌ఈ సుధాకర్ రెడ్డి, ఈఈ నూనె శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment