సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎక్కడా లేని అవినీతి మంత్రి కె. తారక రామారావు శాఖల పరిధిలోనే జరుగుతోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. దోచుకున్న డబ్బును దాచుకునేందుకే కేటీఆర్ విదేశీ పర్యటనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్ ప్రభుత్వ అవినీతిపై విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్‌తోపాటు అవినీతికి పాల్పడిన ఏ ఒక్కరినీ వదలబోమని హెచ్చరించారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఉత్తమ్ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
ప్రైవేటు సంస్థలకు భూకేటాయింపుల విషయంలో ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోందని, హెటెరో కంపెనీకి రాజధానిలోని మాదాపూర్‌లో రూ. వేల కోట్ల భూమి ఎందుకు ఇచ్చారో తేల్చాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. అలాగే వెల్స్ పన్ గ్రూప్ కంపెనీకి వివిధ జీవోల ద్వారా 800 ఎకరాలు కేటాయించడంతోపాటు రూ. 40 కోట్ల మేర రాయితీలు, మూలధన వ్యయంలో రూ. 80 కోట్ల సబ్సిడీ ఇవ్వడం వెనుక ప్రభుత్వ ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. ఇవి చాలవన్నట్లు వడ్డీ సబ్సిడీ, విద్యుత్ సబ్సిడీ, వంద శాతం జీఎస్టీ సబ్సిడీ ఇచ్చిందని, ఈ కంపెనీకి భూముల కేటాయింపు విషయంలో మంత్రి కేటీఆర్, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్‌లకు ఎంత ముట్టిందో తేల్చాలన్నారు. కేటీఆర్ దోపిడీకి జయేశ్ రంజన్ సహకరిస్తున్నారని ఉత్తమ్ ఆరోపించారు. తెలంగాణ భవిష్యత్‌ను కేసీఆర్ తాకట్టు పెడుతున్నారని, ప్రజలు అప్పుల పాలవుతుంటే, కేసీఆర్ కుటుంబ ఆస్తులు పెరుగుతున్నాయన్నారు.
80 సీట్లు గెలుస్తాం...
తెలంగాణలో ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ 80 సీట్లు గెలుస్తుందని ఉత్తమ్ జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌కు బలం పెరిగిందని సర్వేలే చెబుతున్నాయని, నిన్నటివరకు దక్షణ తెలంగాణలో స్వీప్ చేస్తామని భావించామని, ప్రస్తుతం ఉత్తర తెలంగాణ సైతం స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి చేరికతో ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి అలకబూనారన్న వార్తలపై పార్టీలో చర్చిస్తామన్నారు. ప్రజా చైతన్య బస్సు యాత్రపట్ల పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంతృప్తిగా ఉన్నారని, యాత్రలో పాల్గొంటానని రాహుల్ చెప్పారని ఉత్తమ్ తెలిపారు.
జన్ ఆక్రోశ్ ర్యాలీని జయప్రదం చేయాలి: కుంతియా
ఈ నెల 29న ఢిల్లీలో జరిగే జన్ ఆక్రోశ్ ర్యాలీని పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియా కోరారు. ప్రధాని మోదీ బాధ్యతలు చేపట్టాక దేశంలో నిరుద్యోగం, మహిళలపై హత్యాచారాలు, పెట్రోల్, డీజిల్, సరుకుల ధరలు పెరుగుతూనే ఉన్నాయన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీతో చిన్న వ్యాపారులు పూర్తిగా చితికిపోయారన్నారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో విమాన ప్రమాదం నుంచి రాహుల్ క్షేమంగా బయటపడ్డారని, అయితే ఈ ఘటనపై విచారణ జరపాలని కుంతియా డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో శాసనసభ, మండలిలో ప్రతిపక్ష నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ పాల్గొన్నారు.
అదో అబద్ధాల ప్లీనరీ: పొన్నం
టీఆర్‌ఎస్ ప్లీనరీ వేదికగా అన్నీ అబద్ధాలే చెప్పారని, అదో అబద్ధాల ప్లీనరీ అని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ దుయ్యబట్టారు. ‘రాష్ట్రంలో విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు, దళితులు, గిరిజనులకు ఏమీ చేయని కేసీఆర్... కేంద్రంలో చక్రం తిప్పుతాడా’అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఓ మచ్చర్ పహిల్వాన్ అని, ఆయన్ను చూసి కాంగ్రెస్ భయపడే స్ధితిలో లేదన్నారు. భరత్ అనే నేను సినిమాలా ‘కేసీఆర్ అనే నేను..నా అబద్ధాలు’అని సినిమా తీస్తామన్నారు.
దోచుకున్న డబ్బు దాచుకునేందుకే..
Published Sat, Apr 28 2018 1:21 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment