రాష్ట్రంలో పోలీసు యూనివర్సిటీ!
⇔ పోలీసు అకాడమీని వర్సిటీగా మార్చేందుకు పోలీసుశాఖ యోచన
⇔ సిబ్బందికి ప్రొఫెషనల్ కోర్సులను అందుబాటులోకి తెచ్చేందుకే...
⇔ శిక్షణ సమయాన్నే కోర్సులుగా తెచ్చేలా త్వరలో సర్కారుకు ప్రతిపాదన
⇔ ప్రభుత్వ ఆమోదం లభించగానే యూజీసీ అనుమతికి దరఖాస్తు
సాక్షి, హైదరాబాద్: వృత్తి నైపుణ్యం, దర్యాప్తులో ప్రొఫెషనలిజం, చురుకుదనం వంటి అంశాలను పోలీసు సిబ్బందికి నాణ్యమైన కోర్సులుగా అందించేందుకు పోలీసుశాఖ సొంతంగా యూనివర్సిటీ ఏర్పాటుకు యోచిస్తోంది. ఫ్రెండ్లీ, వరల్డ్‌క్లాస్ పోలీసింగ్‌ను అందిపుచ్చుకునేందుకు పోలీసు కోర్సులను అందుబాటులోకి తేవా లని భావిస్తోంది. ఇందుకోసం హైదరా బాద్‌లోని రాజబహదూర్ వెంక ట్రామిరెడ్డి పోలీసు అకాడమీని యూనివర్సిటీగా మార్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
శిక్షణ కార్యక్రమాలే కోర్సులుగా...
హైదరాబాద్ శివారులోని హిమాయత్‌సాగర్ వద్ద 148 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పోలీసు అకాడమీలో ప్రస్తుతం కొత్తగా నియమితు లయ్యే ఎస్సై, కానిస్టేబుళ్లకు 9 నెలలపాటు శిక్షణ ఇస్తున్నారు. అలాగే ఇన్–సర్వీస్ శిక్షణలో భాగంగా అధికారులు, సిబ్బందికి వారం నుంచి 3 నెలల వ్యవధి ఉండే కోర్సుల్లో తర్ఫీదు ఇస్తున్నారు. వాటితోపాటు దర్యాప్తు, ఇంటలిజెన్స్, మావోయిజం, మేనేజ్‌మెంట్, లీడర్‌షిప్, ప్లాటూన్ కమాండర్స్, రిఫ్రెష్‌మెంట్, ట్రాఫిక్ నియంత్రణ, ఎన్‌ఫోర్స్‌మెంట్, ఫీల్డ్ వర్క్‌షాప్, స్ట్రెస్ మేనేజ్‌మెంట్, సెల్ఫ్ హీలింగ్ వంటి 35 రకాల కోర్సులను ఇన్–సర్వీస్ ట్రైనింగ్‌గా అందిస్తున్నారు. అయితే ఇప్పుడు యూనివర్సిటీ ఏర్పాటు చేసి నేరుగా ఒక్కో అంశానికి కాలవ్యవధి విధించి డిప్లొమా, పీజీ డిప్లొమా, డిగ్రీ, పీజీ కోర్సులు, స్పెషలైజేషన్ కోర్సులను అందుబాటులోకి తెచ్చేలా ఉన్నతాధికారులు కార్యచరణ రూపొందిస్తున్నారు.
త్వరలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు..
పోలీసు యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి త్వరలోనే ప్రతిపాదనలు పంపనున్నట్లు ఉన్నతాధి కారులు ‘సాక్షి’కి తెలిపారు. ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగానే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) అనుమతి కోసం ప్రతిపాదనలు పంపిస్తామన్నారు. యూజీసీ ఆమోదం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు చట్టం తేవాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం పోలీసు అకాడమీకి కేటాయిస్తున్న నిధులను పెంచితే సిబ్బంది, అధికారులకు వృత్తిరీత్యా కీలకంగా మారే అంశాలపై కోర్సులు అందించేందుకు వీలు కలుగుతుం దని ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు.
రాజ్‌స్తాన్‌లో తొలిసారిగా...
దేశంలోనే మొట్టమొదటిసారిగా రాజ్‌స్తాన్ ప్రభుత్వం జోధ్‌పూర్‌లో ‘సర్దార్ పటేల్ యూనివర్సిటీ ఆఫ్ పోలీస్, సెక్యూరిటీ అండ్ క్రిమినల్ జస్టిస్’ను ఏర్పాటు చేసింది. సోషల్ సైన్స్‌లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుతోపాటు ఎంటెక్ సైబర్ సెక్యూరిటీ, ఎంఏ/ఎంఎస్సీ అప్‌లైడ్ క్రిమినాలజీ, ఎల్‌ఎల్‌ఎం/ఎంఏ క్రిమినల్ లా వంటి వివిధ రకాల కోర్సులను అందిస్తోంది. వీటితోపాటు పోలీస్ వృత్తికి తోడ్పడే పద్నాలుగు రకాల డిప్లొమా, పీజీ డిప్లొమా తదితర కోర్సులను అందుబాటులోకి తెచ్చింది.
9 నెలల పీజీ డిప్లొమా...
నూతన ఎస్సైలు, కానిస్టేబుళ్లకు ఇచ్చే 9 నెలల శిక్షణను పీజీ డిప్లొమా కోర్సుగా చేసి పాసింగ్ అవుట్ పరేడ్ సమయం లోనే కాన్వొకేషన్ నిర్వహించి సర్టిఫికెట్లు ఇచ్చేలా అధికారులు కసరత్తు చేస్తు న్నారు. అలాగే రెండేళ్లకోసారి ప్రతి నాన్‌క్యాడర్ ఎస్పీ నుంచి కానిస్టేబుల్ వరకు ఏదో ఒక కోర్సు చేసేలా షెడ్యూల్ రూపొందిం చాలని యోచిస్తున్నారు.