ఆ బాంబులు తుస్సుమనలేదు.. ప్రజలను మోసగించేందుకే కేటీఆర్ పాదయాత్ర డ్రామాలు
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
వర్ధన్నపేట/తొర్రూరు: తుప్పు బాంబు కాదు.. లక్ష్మీబాంబు కాదు.. రాజకీయ ఆటంబాంబు పేలబోతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుగా బీఆర్‌ఎస్ నేత (కేటీఆర్) తీరు ఉందన్నారు. తనను జైలుకు పంపిస్తారని.. జైలులో జిమ్ చేసి పాదయాత్ర చేస్తానని కేటీఆర్ చెప్పడాన్ని మంత్రి ఎద్దేవా చేశారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలో గురువారం వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమానికి మంత్రి పొంగులేటి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
ఆయా చోట్ల మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఎవరినీ జైలుకు పంపించాలనే ఉద్దేశం ప్రభుత్వానిది కాదని, తప్పు చేస్తే ఉపేక్షించడం ఉండదన్నారు. తప్పు చేసిన వాళ్లపై ఆటంబాంబు పేలబోతోందని హెచ్చరించారు. రాష్ట్రంలో పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయన్న తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, ఆ బాంబులు ఇంకా తుస్సుమనలేదని చెప్పారు. కొద్దిరోజుల్లో తాను పేల్చిన బాంబు ఏంటో మీరే చూస్తారని స్పష్టం చేశారు. అరెస్టు చేయాలా.. జీవితకాలం జైలులో పెట్టాలా అనేది చట్టం చూసుకుంటుందన్నారు. తాతలు, తండ్రుల ఆస్తుల్లాగా చట్టాలను అతిక్రమించి సంపాదించారని, వారంతా ఫలితాలు అనుభవిస్తారని చెప్పారు. పేదల సొమ్ము విదేశాలకు పంపుకున్నారని, రూ.55 కోట్లు ఎవరి ద్వారా ఎవరికి పోయిందో, ఎవరి ఖాతాలో వేసుకున్నారో ప్రజల ముందు తమ ప్రభుత్వం పెట్టి చూపిస్తుందన్నారు.
అవి చౌకబారు విమర్శలు
ఈడీ దాడులు చేస్తోందని..అదాని కాళ్లు పట్టుకుంటున్నాడని తనపై కేటీఆర్ చవకబారు విమర్శలు చేస్తున్నాడని మంత్రి పొంగులేటి అన్నారు. తాను ఎవరి కాళ్లు పట్టుకోవాల్సిన అవసరం లేదని, గతంలో బీఆర్‌ఎస్‌లో చేరినప్పుడు మాత్రమే కేసీఆర్ కాళ్లకు నమస్కరించానని చెప్పారు. అది వయసుకు ఇచ్చిన గౌరవంతోనేనన్నారు. పదేళ్లు సామాన్యులను వంచించిన చరిత్ర బీఆర్‌ఎస్‌కే దక్కిందని, పేదల మద్దతు కూడగట్టేందుకు కేటీఆర్ పాదయాత్ర పేరిట డ్రామా చేస్తున్నాడన్నారు.
పాదయాత్ర చేసినా.. మోకాళ్ల యాత్ర చేసినా ప్రజలు వారిని నమ్మబోరని తెలిపారు. వైఎస్సార్ తన హయాంలో 19 లక్షల పైచిలుకు ఇందిరమ్మ ఇళ్లు కట్టించి పేదలకు అండగా నిలిచారని, అదే స్ఫూర్తితో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 20 లక్షల ఇళ్లు కట్టించనుందన్నారు. ఆయా సమావేశాల్లో ఎంపీలు కడియం కావ్య, బలరాంనాయక్, ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్, ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment