సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘తెలంగాణ సమాజం కాంగ్రెస్‌కు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉంది. ఏ ఉద్దేశంతోనైతే సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారో.. ఆ ఉద్దేశం నెరవేరే సమయం ఆసన్నమైంది. వచ్చే నెల 2న ఖమ్మంలో నిర్వహించే జనగర్జన సభ ద్వారా మేము కాంగ్రెస్‌లో చేరనున్నాం. బీఆర్‌ఎస్ ఆవిర్భావ సభకు మించి ఈ సభ ఉంటుంది. తెలంగాణ బిడ్డలు కోరకుంటున్న వాటిలో కొన్నింటిని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ తెలియజేస్తారు’ అని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.
అలాగే ప్రజాసమస్యలు తెలుసుకొనేందుకు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 2వ తేదీనే ముగియనున్నందున సభలో భట్టిని రాహుల్ గాంధీ సన్మానిస్తారని తెలిపారు. కాంగ్రెస్‌లో చేరడానికి కారణాలు, సభ ఏర్పాట్లను ఆయన గురువారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
ప్రజాభీష్టం మేరకే..
ఖమ్మంలో నిర్వహించే సభలో అనేక మంది ముఖ్యనేతలు, లక్షలాది కుటుంబాల సమక్షాన రాహుల్ గాంధీ చేతుల మీదుగా కాంగ్రెస్‌లో చేరతాం. ఆరు నెలలుగా అన్ని వర్గాల ప్రజలతోపాటు కవులు, ఉద్యమకారులు, కళాకారులను కలసి, రెండు ప్రముఖ సంస్థలతో సర్వే చేయించి ఏ పార్టీలో చేరితే తెలంగాణను, ప్రజలను మోసం చేసిన కల్వకుంట్ల కుటుంబాన్ని ఇంటికి పంపొచ్చో తెలుసుకున్నాం.
అత్యధికంగా కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందని, కాంగ్రెస్‌కు మా బలం తోడైతే ఉమ్మడి ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లోనే కాక తెలంగాణ అంతటా ప్రభావం వస్తుందని తేలింది. అధికారంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నన్ను, నా కుటుంబాన్ని ఇబ్బంది పెడతాయని తెలిసినా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఇటు మొగ్గు చూపాం.
సరైన వేదిక..
ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్దకు వెళ్లే వరకు సందిగ్ధత ఉంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాం«దీతో మాట్లాడాక మాకు కాంగ్రెస్సే సరైన వేదికగా భావించాం. ఈ సభలో నాతోపాటు వరంగల్, హైదరాబాద్ సిటీకి చెందిన పలువురు నేతలు కాంగ్రెస్‌లో చేరుతారు.
ఆర్టీసీ బస్సులను నిరాకరించారు..
సభకు జనం వచ్చేందుకు ఖమ్మం ఆర్టీసీ రీజియన్‌లోని డిపోల నుంచి వెయ్యి బస్సులు కావాలని కోరాం. అందుకు రూ.1.08 కోట్లు అవుతుందని చెప్పి రెండ్రోజుల క్రితం వరకు ఇస్తామన్నారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి కాంగ్రెస్ తరఫున సహకరించినట్లు అవుతుందనేది మా ఆలోచన. అయితే అధికారంలో ఉన్న నాయకులు మాత్రం సభకు జనం రావొద్దనే దురుద్దేశంతో బస్సులు ఇవ్వకుండా అడ్డుకున్నారు.
ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ కాకున్నా బస్సులు నిరాకరించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ నష్టపోయేలా చేసింది. మమ్మల్ని ఇబ్బంది పెట్టడమేకాక సభను ఫెయిల్ చేయాలని కలలు కంటున్న రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులను ఒకటే హెచ్చరిస్తున్నాం. ఈరోజు మీరు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలోకి రాక తప్పదు. నన్ను, కాంగ్రెస్‌ను అభిమానించే వారంతా స్వచ్ఛందంగా తరలిరావాలి.
సభా స్థలికి వెళ్లాలంటే నాగార్జునసాగర్ కెనాల్ మీదుగా వెళ్లాలి. నా కుమార్తె రిసెప్షన్ సందర్భంగా కెనాల్‌పై ఐరన్ బ్రిడ్జి నిర్మించాం. రిసెప్షన్ ముగిశాక అది నిరుపయోగం కావడంతో బ్రిడ్జి తొలగించాలని అధికారులపై ప్రజాప్రతినిధులు ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీనిపై న్యాయస్థానానికి వెళ్లి స్టే తీసుకొచ్చినా సభకు వాడుకోకుండా చూస్తున్నారు.
కాంగ్రెస్‌కు పట్టం కట్టాలి..
తెలంగాణ బిడ్డల కలలు నిజం కావాలంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలి. ఏ ఉద్దేశంతోనైతే సోనియా తెలంగాణను ఇచ్చారో ఆ ఉద్దేశం నెరవేరే సమయం ఆసన్నమైంది. ప్రజలంతా తెలంగాణ ఇచ్చిన సోనియాకు రుణపడి ఉన్నందున కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చి ఆ రుణం తీర్చుకుందాం.
హామీలతోనే మభ్య పెడుతున్నారు..
కేసీఆర్ సీఎంగా ఏ వాగ్దానాన్నీ పరిపూర్ణంగా అమలు చేయలేదు. అరకొరగా అమలు చేసి వారికి ఇచ్చినట్లుగానే మీకు ఇస్తామని మరొకరికి చెబుతూ మాయమాటలతో కాలం గడుపుతున్నారు. అవే మాయమాటలతో మూడోసారి అ ధికారంలోకి రావాలని చూస్తున్నారు.
ఇప్పటిౖకైనా అడ్డుకోకపోతే సోనియా తెలంగాణను ఇచ్చిన ఉద్దేశం నెరవేరదు. తెలంగాణ ఏర్పాటు సమయాన సోనియాపై విభజన చే యొద్దనే ఒత్తిడి కూడా ఉంది. భవిష్యత్తులో ఏపీలో కాంగ్రెస్ రాదని తెలిసినా ఆత్మబలిదానాలు చేసుకున్న వేలాది మంది యువకుల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment