ఏఐసీసీ కార్యాలయంలో మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాందీతో పొంగులేటి, జూపల్లి. చిత్రంలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తదితరులు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరవేసే సమయం వచ్చిందని.. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపేద్దామని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు, పార్టీలో చేరబోతున్న సీనియర్లకు ఏఐసీసీ పెద్దలు పిలుపునిచ్చారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణ ఓటర్లలో కాంగ్రెస్ పట్ల విశ్వాసం పెరిగిందని.. దీనిని అనుకూలంగా మల్చుకుని సమష్టి కృషితో కాంగ్రెస్‌ను గెలిపించుకుందామని సూచించారు.
బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య పరస్పర అవగాహన ఉందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, బీఆర్‌ఎస్ సర్కారుపై ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్‌కు అనుకూలంగా మార్చుకునేలా వ్యూహాలను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యేలు గుర్నాథ్‌రెడ్డి, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, తూడి మేఘారెడ్డి సహా 35 మంది నేతలతో ఏఐసీసీ కార్యాలయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ భేటీ అయ్యారు.
ఈ భేటీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తోపాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సీతక్క, పొడెం వీరయ్య, సీనియర్ నేతలు జానారెడ్డి, దామోదర రాజనర్సింహా, మహేశ్‌కుమార్‌గౌడ్, చిన్నారెడ్డి, వంశీచంద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సుమారు అరగంట పాటు జరిగిన ఈ భేటీలో పొంగులేటి, జూపల్లిలను రాహుల్, ఖర్గేలకు రేవంత్‌రెడ్డి పరిచయం చేశారు. తర్వాత వారు మిగతా నేతలను పరిచయం చేశారు.
కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో..
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడారు. తెలంగాణలో ‘ఘర్ వాపసీ’ మొదలైందని, పార్టీని వీడిన నేతలంతా తిరిగి చేరేలా చూడాలని రాష్ట్ర నేతలకు సూచించారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ, నియంత పాలనపై ప్రజలకు విసుగొచ్చిందని, ఈ సర్కారును సాగనంపాలని అంతా నిర్ణయంచుకున్నారని చెప్పారు. బీజేపీ, బీఆర్‌ఎస్ కలసిపోయాయని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని, ఇది కాంగ్రెస్‌కు అనుకూలిస్తుందని వివరించారు.
ప్రస్తుతం కాంగ్రెస్ సమయం వచ్చిందని, దీన్ని అనుకూలంగా మల్చుకుని ‘కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో’ నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రస్తుత అవకాశాన్ని చేజారనీయొద్దని స్పష్టం చేశారు. పార్టీలోకి వచ్చే నేతలకు సముచిత స్థానం ఉంటుందని భరోసా ఇచ్చారు.
సమన్వయంతో ముందుకు వెళ్లాలి
ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయకపోవడం వెనుక డీల్ ఉందని, బీజేపీ–బీఆర్‌ఎస్‌ల అవగాహనలో భాగంగానే అరెస్ట్ ఆగిపోయిందని మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని రాష్ట్ర నేతలను ఆదేశించారు. పాత, కొత్త నేతల మధ్య సమన్వయం, సమష్టి బాధ్యతతో పార్టీని అధికారంలోకి తేవాలని సూచించారు.
ఖమ్మం సభకు రాహుల్..
ఏఐసీసీ పెద్దలతో భేటీలో జూపల్లి, పొంగులేటి కూడా మాట్లాడారు. తెలంగాణలో మార్పు మొదలైందని, బీఆర్‌ఎస్‌ను ఓడించడం కేవలం కాంగ్రెస్‌తోనే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని వివరించారు. ఈసారి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చి సోనియాగాంధీకి బహుమతిగా ఇస్తామన్నారు. జూలై 2న ఖమ్మంలో నిర్వహించే బహిరంగ సభకు రావాలంటూ రాహుల్‌గాందీని వారు ఆహ్వానించగా.. ఆయన సుముఖత తెలిపారు. ఆ సభలోనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. భేటీ అనంతరం జూపల్లి, పొంగులేటి, వారి అనుచరులతో రాహుల్ గ్రూప్ ఫోటోలు దిగారు.
పాలమూరు సభకు ప్రియాంక గాందీ..
రాహుల్, ఖర్గేలతో భేటీ అనంతరం జూపల్లి, పొంగులేటి తదితరులు సోనియాగాంధీ నివాసానికి వెళ్లి ప్రియాంకగాంధీతో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. జూలై 14 లేక 16న మహబూబ్‌నగర్‌లో నిర్వహించే బహిరంగ సభకు రావాలని ప్రియాంక గాందీని జూపల్లి ఆహ్వానించారు. దీనికి ప్రియాంక సమ్మతించారని అనంతరం జూపల్లి తెలిపారు. కష్టపడి పనిచేయాలని, దానికి అనుగుణంగా పదవులు అవే లభిస్తాయని ఆమె పేర్కొన్నట్టు సమాచారం.
ఎన్నికల వ్యూహాలపై నేడు భేటీ
తెలంగాణ ఎన్నికల వ్యూహాలపై చర్చించేందుకు అధిష్టానం పెద్దలు మంగళవారం మరోమారు రాష్ట్ర నేతలతో భేటీ కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు జరిగే ఈ భేటీలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో పాటు, అగ్రనేత రాహుల్‌గాందీ, పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తదితరులు పాల్గొననున్నారు.
రాష్ట్ర నేతల మధ్య ఉన్న భేదాభిప్రాయాలు, ఐక్యతా యత్నాలు, ఎన్నికల వ్యూహాలు, సంస్థాగతంగా బలోపేతం తదితర అంశాలపై అందులో చర్చించనున్నారు. బీఆర్‌ఎస్ సర్కారు అవినీతిని ప్రధాన అస్త్రంగా చేసుకుని పోరాడేలా వ్యూహాన్ని ఖరారు చేయనున్నారని.. పార్టీ ప్రకటిస్తున్న హామీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా కార్యక్రమాలు, సభలపై చర్చించనున్నారని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment