ఏం జరుగుతోంది!  | Congress party is concerned about the party situation in the state | Sakshi
Sakshi News home page

ఏం జరుగుతోంది! 

Published Mon, Jun 24 2019 2:05 AM | Last Updated on Mon, Jun 24 2019 8:31 AM

Congress party is concerned about the party situation in the state - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలపై ఆ పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఎలా ఉందనే అంశంతోపాటు భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలపై సీనియర్‌ నేతలతో చర్చలు జరుపుతోంది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌.సి.కుంతియా ఆదివారమం తా హైదరాబాద్‌లోని ఓ హోటల్‌ వేదికగా అంతర్మథ నం జరిపారు. వలసలకు గల కారణాలు, భవిష్యత్తు లో జరగనున్న ఎన్నికలను ఎదుర్కొనే వ్యూహంపై చర్చతోపాటు బీజేపీలోకి ఎవరెవరు వెళ్లాలనుకుంటున్నారన్న దానిపై ఆయన ఆరా తీసినట్టు తెలుస్తోంది.  

రాహుల్‌ తర్వాతే... 
టీపీసీసీ అధ్యక్ష మార్పుపై కూడా కుంతియాతో రాష్ట్రనేతలు చర్చించారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత నాయకత్వమార్పు జరుగుతుందనే చర్చ పార్టీలో నడుస్తోంద ని, వాస్తవ పరిస్థితి ఏమిటని అడుగగా జాతీయ అధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీ ఉండాలా వద్దా అనేది తేలిన తర్వాతే పీసీసీ అధ్యక్షుల గురించి ఓ కొలిక్కి వస్తుందని, అప్పటివరకు ఎలాంటి మార్పులు ఉండబోవని కుంతియా స్పష్టం చేసినట్టు తెలిసింది. మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడిగా ఎవరుండాలన్న దానిపై కూడా కుంతియా నేతల వద్ద ఆరా తీసినట్టు తెలిసింది.  

వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవి ఇవ్వండి: జగ్గారెడ్డి 
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆదివారం కుంతియాను కలిశారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, రాజకీయ పరిణామాలపై చర్చించిన అనంతరం తనకు టీపీసీసీ వర్కిం గ్‌ ప్రెసిడెంట్‌ పదవి ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పార్టీని జాగ్రత్తగా కాపాడు కోవాల్సిన అవసరం ఉందని, క్షేత్రస్థాయి కార్యకర్తలకు భరోసా కల్పించడానికి తాను కృషి చేస్తానని ఆయన కుంతియాకు తెలిపారు. జగ్గారెడ్డి విజ్ఞప్తి పట్ల కుంతి యా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.  

నిర్ణయం తీసుకోండి.. 
కుంతియాను టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్‌ ఎం.కోదండరెడ్డి కలిసి రాజగోపాల్‌రెడ్డి విషయంలో నిర్ణయం తీసుకోవాలని కోరినట్టు సమాచారం. రాజ గోపాల్‌రెడ్డి పార్టీనుద్దేశించి చేసిన వ్యాఖ్యల నేపథ్యం లో షోకాజ్‌ నోటీసు జారీ చేశామని, దానికి స్పందన లేదని, నోటీసు ఇచ్చిన తర్వాత కూడా మళ్లీ అవే వ్యాఖ్యలు చేశారని వివరించారు. రాజగోపాల్‌రెడ్డి విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. కుంతియాను కలిసినవారిలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, హర్కర వేణుగోపాల్‌రావు ఉన్నారు. 

మున్సిపల్‌ ఎన్నికలపై వ్యూహం ఖరారు 
త్వరలో జరగనున్న మున్సిపల్‌ ఎన్నికలపై టీపీసీసీ దృష్టి సారించింది. దీనికోసం బీసీ ఓటర్ల నమోదుపై దృష్టి సారించాలని నిర్ణయించింది. ఆదివారం రాత్రి సమావేశమైన టీపీసీసీ కోర్‌ కమిటీ పలు నిర్ణయాలు తీసుకుంది. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా నేతృత్వంలో ఈ సమావేశం సాగింది. ఇటీవల కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్‌గాంధీ తన నిర్ణయాన్ని ఉపసహరించుకోవాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. త్వరలో జరగబోయే మున్సిపల్‌ ఎన్నికల కోసం వ్యూహం ఖరారు చేసింది. పొన్నం ప్రభాకర్‌ కన్వీనర్‌గా ఏఐసీసీ కార్యదర్శులు సంపత్, వంశీచంద్‌రెడ్డి సభ్యులుగా ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఖాళీగా ఉన్న నియోజకవర్గాల బాధ్యుల నియామకం వారంరోజుల్లో పూర్తిచేయాలని నిర్ణయించింది. 29న నాగార్జునసాగర్‌లో టీపీసీసీ కార్యవర్గం, డీసీసీ అధ్యక్షులు, ఏఐసీసీ బాధ్యులతో సమావేశం కావాలని నేతలు నిర్ణయించారు. మున్సిపాలిటీలలో బీసీ ఓటర్ల నమోదుపై పార్టీ సీరియస్‌గా పరిశీలించాలని కోర్‌ కమిటీ తీర్మానించింది. 34 శాతం బీసీ రిజర్వేషన్లు ఉండాల్సిందేనని తెలిపింది. పార్టీ అధ్యక్షుల అనుమతి లేకుండా ఎవరు విలేకరుల సమావేశాలు పెట్టవద్దని, పార్టీ అంశాలు ప్రకటించవద్దని ఉత్తమ్‌ హెచ్చరించారు. సమావేశంలో కార్య నిర్వాహక అధ్యక్షులు పొన్నం ప్రభాకర్, కుసుమకుమార్, ఏఐసీసీ కార్యదర్శులు సంపత్, వంశీచంద్‌రెడ్డి, చిన్నారెడ్డి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, సీఎల్పీ మాజీ నేతలు జానారెడ్డి, షబ్బీర్‌ అలీ, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు తదితరులు పాల్గొన్నారు.  

అసంతృప్తులెవరు? 
పార్టీ నుంచి నేతలు ఎందుకు వెళ్లిపోతున్నారనే అంశంపై ఒకరిద్దరు సీనియర్లతో కుంతియా చర్చించారు. భరోసా లేకనే వెళుతున్నట్టు పార్టీ నుంచి వెళ్లిపోయిన నేతలు చెబుతున్నారని, అసలు క్షేత్రస్థాయి పరిస్థితికి, నాయకత్వం దగ్గర ఉన్న సమాచారానికి మధ్య ఉన్న అంతరం ఏమిటన్న దానిపై వారితో మాట్లాడారు. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డితోపాటు బీజేపీలోకి ఎవరెవరు వెళ్లాలనుకుంటున్నారని, పార్టీపట్ల వారికి ఉన్న అసంతృప్తి ఏమిటని అడిగి తెలుసుకున్నారు. సీనియర్లు ఇచ్చిన సలహా మేరకు పార్టీలో ఉన్న అసంతృప్త నేతలతో సంప్రదింపులు జరపాలని, వారు పార్టీని వీడి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement