
సాక్షి,హైదరాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీని గెలిపించేలా ఇప్పటినుంచే నేతలంతా కృషి చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి ఆర్‌సీ కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు సూచించారు. పంచాయతీ, లోక్‌సభ ఎన్నికలకు కార్యకర్తలను సిద్ధం చేయాలని ఆదేశించారు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులకు అసెంబ్లీ పరిధిలో పోటీ చేసిన అభ్యర్థులే అండగా నిలవాలని సూచించారు. గాంధీభవన్‌లో శుక్రవారం ఆరు పార్లమెంట్ నియోజకవర్గాలపై నిర్వహించిన సమీక్షకు ఏఐసీసీ ఇన్‌చార్జ్ కార్యదర్శి శ్రీనివాసన్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్‌లు పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమ్‌కుమార్, సీనియర్‌నేతలు షబ్బీర్ అలీ, జీవన్‌రెడ్డి, దామోదర రాజనర్సింహా తదితరులు హాజరయ్యారు.
ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంగనర్, వరంగల్, జహీరాబాద్, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఈ సమీక్షకు హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను నియోజకవర్గాల వారీగా అడిగి తెలుసు కున్నారు. ఎంపీలుగా పోటీకి ఆసక్తి ఉన్న ఆశావహుల పేర్లను తమకు రెండు, మూడు రోజుల్లో సూచించాలని కోరారు. ఈ నెల 25లోపు అధిష్టానం సూచన మేరకు జాబితాను సిద్ధం చేస్తామని తెలిపారు. పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు 33 డీసీసీలు భర్తీకి చేయాల్సి ఉన్నందున, సరైన నేతల పేర్లను సూచించాలన్నారు. ]
సీనియర్ నేతలు దూరం..
పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేసి నేతలను సమాయత్తం చేయాలని అధిష్టానం ఆదేశించినప్పటికీ పార్టీ సీనియర్ నేతలెవరూ ఈ ఆదేశాలను అంతగా పట్టించుకోలేదు. పార్టీ వర్కింగ్ ప్రెసి డెంట్‌లు రేవంత్‌రెడ్డి, అజారుద్దీన్‌లు, మధుయాష్కీ గౌడ్, సుదర్శన్‌రెడ్డి, గీతారెడ్డి, సురేశ్ షెట్కార్, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఆదిలాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, గండ్ర వెంకటరమణరెడ్డి వంటి సీనియర్ నేతలు ఈ సమీక్షకు హాజరుకాలేదు.
పోటీచేసిన అభ్యర్థులే ఇన్‌ఛార్జిలు: ఉత్తమ్
అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులే పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికల బాధ్యతలు చేపట్టాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు. జనవరి 14లోగా బూత్, మండల్, బ్లాక్ స్థాయిల్లో అన్ని కమిటీలను వేయాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment