విజయశాంతి
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం శక్తివంచనలేకుండా నిజాయితీగా పోరాడిన మెదక్ లోక్సభ సభ్యురాలు విజయశాంతికి కష్టకాలం వచ్చింది. తను దేనికోసం పోరాడారో అది సాధించే సమయానికి రాములమ్మ టిఆర్ఎస్తో తెగతెంపులు చేసుకున్నారు. రాజకీయ పార్టీల కూడలి వద్ద ఎటువైపు వెళ్లాలా? అని చూస్తున్నారు. ఏ పార్టీలో చేరాలా? అన్న ఆలోచనలో పడ్డారు. ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు రాజకీయ నాయకులు తగిన వ్యూహాలు రచించుకోకతప్పదు. అదే క్రమంలో ఆమె తన రాజకీయ భవిష్యత్‌ను పదిలపరుచుకోవడం కోసం తన ప్రయత్నాలు తను చేస్తున్నారు. రాజకీయాలంటే ఎన్నికలు - ఎన్నికలంటే నియోజకవర్గాలు - వాటిలో గెలిచే నియోజకవర్గాలు... ఆ ప్రకారంగా వ్యూహం ఉండాలి. ఆరు నూరైనా, టిఆర్ఎస్ ఎన్ని ఇబ్బందులు పెట్టినా తన నియోజవకర్గం మెదక్ అని ఆమె ఖరాఖండీగా చెబుతూ వచ్చారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. దాంతో ఆమె నియోజకవర్గం విషయంలో కొత్త ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం.
హీరోయిన్గా విజయశాంతి ఆటపాటలే కాకుండా హావభావాలతో అద్బుతంగా నటించారు. హీరోలకు తీసిపోనివిధంగా, కొన్ని సందర్భాలలో హీరోలకు పోటీగా కొన్ని చిత్రాలలో ప్రధాన పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించారు. దక్షిణభారత సినీ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగారు. ఆ తరువాత రాజకీయాలలోకి ప్రవేశించి టిఆర్ఎస్ అధ్యక్షుడు, అన్నయ్య కెసిఆర్ అండదండలతో మెదక్ ఎంపీగా గెలిచారు. టిఆర్ఎస్ సెక్రటరీ జనరల్గా ప్రధాన భూమిక పోషించారు. 2014 ఎన్నికలలో కూడా ఆమె మెదక్ నుంచే పోటీ చేయాలని అనుకున్నారు. అయితే ఆ సీటు తనకు వచ్చే పరిస్థితి లేదని ఆమెకు తెలిసిపోయింది. దాంతో ఆమె నిరాశకు లోనయ్యారు. రాజకీయాలు ఏ రకంగా మారుతుంటాయో ఆమెకు అర్ధమైపోయింది.
అన్న కెసిఆర్తో తెగతెంపులు - టిఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ తర్వాత ఆమె ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కలిశారు. అప్పట్లో ఆమె కాంగ్రెస్లో చేరుతున్నాట్లు వార్తలు వచ్చాయి. కానీ చేరలేదు. ఎటువంటి పరిస్థితులలోనైనా మెదక్ నుంచే పోటీ చేయాలని ఆమె అనుకున్నారు. మెదక్ నుంచి కెసిఆర్ పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. రాములమ్మ కాంగ్రెస్లో చేరి కెసిఆర్పైనైనా పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఆమె కాంగ్రెస్లో చేరిన తరువాత, టిఆర్ఎస్ కాంగ్రెస్లో విలీనం అయితే అటువంటి అవకాశం ఉండదు. మెదక్ స్థానం కోసమే ఆమె కాంగ్రెస్లో చేరాలని అనుకుంటున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఆ తరువాత ఆమె ఆలోచనలో మార్పు వచ్చినట్లు సమాచారం.
మెదక్ స్థానం నుంచి కెసిఆర్ పోటీ చేస్తారనే వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో విజయశాంతి నియోజకవర్గాన్ని మార్చాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె దృష్టి ఇప్పుడు రంగారెడ్డి జిల్లా మల్కాజ్‌గిరి లోక్సభ స్థానంపై పడింది. ఇక్కడ నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశాలుంటాయని విజయశాంతి భావిస్తున్నారు. ఈ స్థానంలో టిఆర్ఎస్ బలహీనంగా ఉంది. సెటిలర్ల సంఖ్య అధికంగా ఉంది. ఈ నేపధ్యంలో ఇక్కడ నుంచి ఏ పార్టీ తరఫున పోటీ చేసినా గెలిచే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని విజయశాంతి ఆలోచనగా తెలుస్తోంది. నియోజకవర్గ మార్పు పరిస్థితి ఇలా ఉంటే, ఏ పార్టీలో చేరాలన్న విషయంలో ఆమె ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. పార్టీ విషయంలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌లో టిఆర్ఎస్ విలీనంగానీ లేక ఆ పార్టీతో పొత్తుగానీ పెట్టుకుంటుందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అంతే కాక కాంగ్రెస్ నేతల నుంచి తగిన ప్రోత్సాహం కూడా లేదని తెలుస్తోంది. ఈ పరిస్థితులలో ఆమె బిజెపిలో చేరే అవకాశం ఉందని అంటున్నారు. కాంగ్రెస్, బిజెపి రెండు వైపుల చూస్తున్నందున ఆమె అటు సోనియా గాంధీని, ఇటు నరేంద్రమోడీనీ ఒకే స్థాయిలో పొగుడుతున్నారన్నది విశ్లేషకుల భావన. ఈ నేపధ్యంలో విజయశాంతి ఏ పార్టీలో చేరతారనేది కొద్దిరోజులలో తేలనుంది.