తెలుగుతెరపై సూపర్స్టార్ హీరోయిన్ | Super Star heroine on Telugu screen | Sakshi
Sakshi News home page

తెలుగుతెరపై సూపర్స్టార్ హీరోయిన్

Published Tue, Jun 24 2014 6:43 PM | Last Updated on Mon, Aug 13 2018 4:19 PM

విజయశాంతి - Sakshi

విజయశాంతి

 తెలుగుతెరపై సూపర్ స్టార్ హోదాను అందుకున్న నటి విజయశాంతి. గ్లామర్ క్వీన్గా వెలిగిపోతూనే అభినయానికి ప్రాధాన్యమున్న పాత్రల్లోనూ విశ్వరూపం చూపించింది. ఈ రోజు లేడీ సూపర్ స్టార్గా తెలుగు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న విజయశాంతి పుట్టిన రోజు.  అప్పటి ప్రముఖ హీరోయిన్లు జయసుధ, జయప్రదలు అభినయంతో,  శ్రీదేవి, మాధవిలు తమ అందచందాలతో తెలుగు తెరను ఏలుతున్న రోజులు అవి. అప్పుడే విజయశాంతి సినీ ప్రస్థానం ప్రారంభమైంది. తెలుగు తెరపై అప్పటికే పాతుకుపోయిన కధానాయికలను సవాలు చేస్తూ ఒక దశాబ్దానికి పైగా వెండితెర రాణిగా వెలిగిపోయింది.

విజయశాంతి  ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటూ ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగింది. 1984 నుండి 1985 వరకూ రెండుపడవల ప్రయాణంలా సాగింది ఆమె సినీ ప్రయాణం. ఒక వైపు నేటి భారతంతో వచ్చిన ఉత్తమ నటి పేరును నిలిపే పాత్రలు, మరో వైపు సగటు సినీ వీక్షకులనలరించే గ్లామర్ పాత్రలను అలవోకగా పోషిస్తూ రాధ, సుహాసిని, రజని, రాధిక వంటి కథానాయికలను వెనక్కునెట్టి 1986 నాటికి తెలుగుతెరపై తనదైన ముద్ర వేసింది. 1986 తరువాత వరుసగా ఐదేళ్లపాటు ఒకదాని వెనుక ఒకటిగా విజయవంతమైన చిత్రాల్లో నటిస్తూ విజయపధంలో దూసుకుపోయింది. పడమటి సంధ్యారాగం, స్వయంకృషి, జానకి రాముడు, కొడుకు దిద్దిన కాపురం, శత్రువు, ముద్దాయి వంటి విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ హీరోలతో సమానమైన ఇమేజ్ సంపాదించింది.

భారత నారి, కర్తవ్యం చిత్రాలకు ఉత్తమ నటిగా మరో రెండు నంది అవార్డులనూ గెలుచుకోవటమే కాకుండా, కర్తవ్యం చిత్రానికి భారత ప్రభుత్వం నుండి ఊర్వశి అవార్డును కూడా కైవసం చేసుకుంది. సాధారణంగా ఉత్తమ అవార్డులు గెలుచుకునే చిత్రాలు ప్రేక్షకులకు ఎవరికీ అర్ధం కాని ఆర్ట్ ఫిల్మ్స్ మాత్రమే అయి ఉంటాయనే అపప్రధను చెరిపేస్తూ తెలుగు, తమిళ బాక్సాఫీసులను కొల్లగొట్టిన కర్తవ్యం చిత్రానికి ఆమె ఈ ఘనత సాధించడం విశేషం.  తర్వాత నందమూరి నట వారసుడు బాలకృష్ణతోనే ఎక్కువ సినిమాల్లో నటించింది. అందరు హీరోల సరసన నటించి మెప్పించినా బాలకృష్ణ సరసన విజయశాంతి నటిస్తుందంటే మాత్రం ఆ సినిమాకు ఓ స్పెషల్ క్రేజ్ వచ్చేది. ఈ జంటమొత్తం 17 చిత్రాల్లో  నటించడం విశేషం.

 టి.కృష్ణ దర్శకత్వం వహించిన ఆరు ఆణిముత్యాల్లోనూ విజయశాంతే కధానాయిక. ఇక విజయశాంతి నటించిన ఎక్కువ చిత్రాలకు దర్శకుడు కోడి రామకృష్ణ. ఈయన దర్శకత్వంలో 12 చిత్రాలలో నటించింది. రాఘవేంద్ర రావు, కోదండరామి రెడ్డిల దర్శకత్వంలో 10 చిత్రాల్లోనూ, దాసరి నారాయణ రావు దర్శకత్వంలో 6 చిత్రాల్లోనూ నటించింది. వీటితో పాటు సూర్యా మూవీస్ పతాకంపై కర్తవ్యం, ఆశయం, నిప్పురవ్వ చిత్రాలు కూడా నిర్మించింది.

ఒసేయ్ రాములమ్మా తరువాత విజయశాంతిని విజయాలు పలకరించటం మానేశాయి. 2000వ సంవత్సరం నుండి ఆమె నటించే చిత్రాల సంఖ్య క్రమంగా తగ్గిపోతూ వచ్చింది. రాజకీయరంగంపై ఆసక్తితో విజయశాంతి సినిమా రంగంపై నుంచి దృష్టి మళ్లించింది. కారణాలేమైనా తెలుగుతెరకు ఒక అద్భుత నటి దూరమయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement