విజయశాంతి
తెలంగాణ చెల్లి రాములమ్మ, మెదక్ లోక్సభ సభ్యురాలు విజయశాంతి ఎక్కడ ఉన్నారని అందరూ చర్చించుకుంటున్నారు. మొదటి నుంచి కరుడుగట్టిన తెలంగాణ వాదిగా ఉన్న ఆమె ప్రస్తుతం దశలో ఏమీ మాట్లాడకుండా ఉండటం ఒకింత ఆశ్చర్యం కలిగిస్తోంది.
అన్నయ్య, టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావుకు దూరమైన తరువాత ఆమె పెద్దగా వార్తలలో లేరు. కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరకపోయినా ఆమె ఆ పార్టీతోనే సన్నిహితంగా ఉంటున్నారు. తెలంగాణ ఏర్పాటుపై స్పష్టత వస్తున్న నేపధ్యంలో చెల్లమ్మ దారెటనేది చర్చనీయాంశమైంది. తన రాజకీయ భవిష్యత్తు విషయంలో అమె ప్రస్తుతం మౌనం వహిస్తున్నారు.
తెలంగాణలో ప్రస్తుతం విజయశాంతి ప్రాభవం పెద్దగా కనిపించడంలేదు. ఏదో కొన్ని సందర్భాల్లో తప్ప ఆమె సందడి అంతగా కనిపించడం లేదు. టిఆర్ఎస్ అమెను సస్పెండ్ చేసిన తరువాత కాంగ్రెస్‌కు దగ్గరయ్యారు. అధికారికంగా మాత్రం ఇప్పటికీ ఆమె కాంగ్రెస్‌లో చేరలేదు. ఈ విషయంలో ఆమె ఆలోచనలు ఏవిధంగా ఉన్నాయో అంతుబట్టడంలేదు. మెదక్ ఎంపీగా ఉన్న విజయశాంతి వచ్చే ఎన్నికల్లోనూ ఆ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆ టికెట్ విజయశాంతికి ఇస్తుందా అన్నది సందేహమే. టిఆర్ఎస్ కాంగ్రెస్‌లో విలీనమైనా లేక పొత్తు పెట్టుకున్నా చెల్లెమ్మకు టిక్కెట్ హుళక్కేనని భావిస్తున్నారు.
టిఆర్ఎస్‌లో కీలక పాత్ర పోషించిన చెల్లెమ్మను ఇప్పుడు పట్టించుకునే వారే కరువయ్యారు. చిన్న చిన్న సమావేశలకు హజరవుతున్నా ఆమె పెద్దగా మాట్లాడటం లేదు. తెలంగాణ బిల్లు అసెంబ్లీకి రావడం, వచ్చే నెలలో చర్చ జరిగే అవకాశమున్నా అమె వీటిపై ఇంత వరకూ స్పందించలేదు. మాట్లాడేందుకు మీడియా ప్రయత్నించినా ఆమె అవకాశం ఇవ్వడంలేదు. మొన్న జరిగిన శీతాకాల పార్లమెంట్ సమావేశలకు కూడా ఆమె హాజరుకాలేదు.
వచ్చే ఎన్నికలలో పోటీపై ఆమె గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మెదక్ టికెట్ ఇవ్వని పక్షంలో మళ్లీ ఆమె కమలం వైపు అడుగువేసే అవకాశం ఉందని అంటున్నారు. తన రాజకీయ భవిష్యత్తుపై వచ్చే నెలలో ఆమె కీలక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.