రాజ్యసభ అభ్యర్థిగా నేడు సింఘ్వి నామినేషన్‌ | Telangana Congress Endorses Singhvi for Rajya Sabha Bypoll: Nomination on August 19th | Sakshi
Sakshi News home page

రాజ్యసభ అభ్యర్థిగా నేడు సింఘ్వి నామినేషన్‌

Published Mon, Aug 19 2024 4:36 AM | Last Updated on Mon, Aug 19 2024 7:39 AM

Telangana Congress Endorses Singhvi for Rajya Sabha Bypoll: Nomination on August 19th

హాజరుకానున్న సీఎం రేవంత్‌రెడ్డి 

సీఎల్పీ సమావేశంలో సింఘ్విని పరిచయం చేసిన సీఎం

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్యేల కోటా రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్‌ తరఫున సీనియర్‌ నాయకుడు అభిషేక్‌ మను సింఘ్వి సోమవారం నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఉదయం 10 గంటలకు ఆయన అసెంబ్లీ ప్రాంగణంలో తన నామినేషన్‌ పత్రాలను రిటరి్నంగ్‌ అధికారికి అందజేస్తారని, ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరవుతారని గాంధీభవన్‌ వర్గాలు వెల్లడించాయి. కాగా ఆదివారం సాయంత్రం నానక్‌రామ్‌గూడలోని షెరటాన్‌ హోటల్‌లో జరిగిన కాంగ్రెస్‌ శాసనసభాపక్షం (సీఎలీ్ప) సమావేశంలో రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు సింఘ్విని రేవంత్‌ పరిచయం చేశారు.

ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు డి.శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొన్నారు. సింఘ్విని తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎంపిక చేసినందుకు కాంగ్రెస్‌ అధిష్టానానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానాన్ని ఆమోదించారు.  

సింఘ్వి వాదనలతో రాష్ట్రానికి ప్రయోజనం: సీఎం 
సీఎల్పీ సమావేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రాజ్యసభ అభ్యర్థిగా సింఘ్విని ప్రతిపాదించిన వెంటనే ఆమోదించినందుకు పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర పునరి్వభజన చట్టం అమలులో అనేక రాజ్యాంగ, న్యాయ చిక్కులు, అవాంతరాలు ఉత్పన్నమయ్యాయని, ఈ చట్టంలోని అంశాలపై చట్టసభలతో పాటు సుప్రీంకోర్టులో బలంగా వాదనలు వినిపించాల్సిన అవసరం ఉందని అన్నారు. అపరిష్కృత అంశాలపై వాదించేందుకు వీలుగా న్యాయ కోవిదుడు సింఘ్విని తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపాలని కోరామని చెప్పారు. తన రాజ్యసభ సభ్యత్వానికి పెద్ద మనసుతో రాజీనామా చేసిన కేకే క్రమశిక్షణ గల కాంగ్రెస్‌ కార్యకర్తగా వ్యవహరించారని ప్రశంసించారు.  

త్వరలోనే రైతు కృతజ్ఞత సభ 
త్వరలోనే రైతు కృతజ్ఞత సభ ఉంటుందని సీఎం చెప్పారు. సీఎల్పీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మా ట్లాడారు. ఈనెల 20న రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించాలని అనుకున్నా వీలు కాలేదని చెప్పారు. రైతు కృతజ్ఞత సభ,రాజీవ్‌గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమంపై త్వరలో ఢిల్లీ పెద్దలతో మాట్లాడి తేదీలు వెల్లడిస్తామని అన్నారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ..దేశంలోని ప్రముఖ న్యాయవాదుల్లో సింఘ్వి ఒకరని, ఆయన రాష్ట్రం  నుంచి రాజ్యసభకు పోటీ చేయడం సంతోషంగా ఉందన్నారు. 

తెలంగాణ హక్కులపై మాట్లాడుతూనే ఉంటా: సింఘ్వి
సింఘ్వి మాట్లాడుతూ తనను తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించినందుకు ఏఐసీసీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర  హక్కుల విషయంలో తాను మాట్లాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. 

శంషాబాద్‌లో ఘన స్వాగతం
సింఘ్వి ఆదివారం ఉదయం శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. సింఘ్వి అక్కడి నుంచి నేరుగా  మాజీ ఎంపీ కె.కేశవరావు నివాసానికి వెళ్లారు.  అక్కడ కొద్దిసేపు ఉన్న సింఘ్వి ఆ తర్వాత సీనియర్‌ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నివాసానికి వెళ్లారు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్‌ సింఘ్విని కలిసి కర్మన్‌ఘాట్‌ హనుమాన్‌ ప్రసాదాన్ని అందజేశారు. తర్వాత సింఘ్వి ప్రజాభవన్‌కు వచ్చారు. సింఘ్వి దంపతులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్వాగతం పలికారు. అక్కడి నుంచి జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి వెళ్లిన సింఘ్వి ఆయనతో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు.

మహిళా సాధికారతే లక్ష్యం: సీఎం రేవంత్‌
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర మహిళలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మహిళల సాధికా రతతో పాటు వారిని కోటీశ్వరులను చేసే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తోందని చెప్పారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ మహిళలకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా శుభాకాంక్షలు తెలియజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement