సాక్షి, జగిత్యాల : జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ ఏనాడు తెలంగాణ సమస్యలను పట్టించుకోలేదని నిజామాబాద్ టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత అన్నారు. దేశం కోసం, ధర్మం కోసం పాటుపడేది కేవలం టీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని, ఈ విషయం గురించి యువత ఆలోచించి ఓటువేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారమిక్కడ ఆమె మాట్లాడుతూ.. బీజేపీ అంటే ప్రస్తుతం భారతీయ జూట్ పార్టీగా మారిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకులు బీజేపీకి ఓటు వేయమని చెప్తున్నారని.. రాష్ట్రంలో ఇక కాంగ్రెస్ పని అయిపోయిందన్నారు. టీఆర్‌ఎస్‌ని ఓడించడానికి ఈ రెండు జాతీయ పార్టీలు ఒక్కటయ్యాయని ఆరోపించారు. కశ్మీర్ సమస్యను పట్టించుకోని బీజేపీ ప్రభుత్వం.. కేవలం రాజకీయ లబ్ది కోసమే దేవుడి పేరు చెప్తోందని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి తనను ఎంపీగా ఆశీర్వదించాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ 2 సంవత్సరాల్లో పూర్తవుతుందని.. దీనితో పాటు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.
కుట్రలో భాగంగానే నామినేషన్లు..
ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ... అసెంబ్లీ ఎన్నికల్లో చావుదెబ్బ కాంగ్రెస్ ,బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో కవితపైన కుట్రపూరితంగా వందల కొద్దీ నామినేషన్లు వేయించారని ఆరోపించారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని పలుమార్లు కవిత ప్రధాని మోదీకి విన్నవించినా ఆయన పెడచెవిన పెట్టారని.. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఐదేళ్లు అధికారంలో ఉండి బీజేపీ ప్రభుత్వం పసుపు బోర్డు ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. ‘తెలంగాణ ప్రభుత్వంపై ప్రజలు నమ్మకంగా ఉన్నారు. భారీ మెజార్టీతో కవిత విజయం సాధిస్తారు. గతంలో ఎంపీగా కవిత చేసిన అభివృద్ధిని చూడండి. బీజేపీ అభ్యర్థి అరవింద్ అనుభవం లేని నాయకుడు. గడిచిన ఐదేళ్ల కాలంలో అరవింద్ ప్రజలకు ఏం చేశారో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని మోడల్ తెలంగాణగా అభివృద్ధి చేయడంలో కేసీఆర్ కృషి అభినందనీయమమని.. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment