మల్కాజిగిరిలో కాంగ్రెస్‌ విజయం | Congress Party Leader Revanth Reddy Won in Malkajgiri | Sakshi
Sakshi News home page

మల్కాజిగిరిలో కాంగ్రెస్‌ విజయం

Published Fri, May 24 2019 8:36 AM | Last Updated on Fri, May 24 2019 8:36 AM

Congress Party Leader Revanth Reddy Won in Malkajgiri - Sakshi

సాక్షి,మేడ్చల్‌జిల్లా: మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి, పీసీసీ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ ఎనుముల రేవంత్‌రెడ్డి విజయం సాధించారు. సమీప టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డిపై 10,919 ఓట్ల మోజారిటీతో గెలుపున ‘హస్త’గతం చేసుకున్నారు. దేశంలో అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజిగిరి లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం 31,49,710 ఓట్లుండగా ఇందులో 15,63,063 (2,955) పోస్టల్‌ బ్యాలెట్‌ కలుపుకుని) ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి రేవంత్‌రెడ్డికి 6,03,748 ఓట్లు, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాజశేఖర్‌రెడ్డికి   5,92,829 ఓట్లు, బీజేపీ అభ్యర్థి రామచందర్‌రావుకు 3,04,282 ఓట్లు వచ్చాయి. మల్కాజిగిరి ఓటర్లు ప్రతి ఎన్నికల్లోనూ విలక్షణమైన తీర్పునిస్తారన్న నానుడి ఉంది. ఒకసారి గెలిచిన పార్టీకి మరోసారి అవకాశమివ్వడం లేదు. 2009లో తొలిసారి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు పట్టం గట్టగా, 2014లో బీజేపీ మద్ధతుతో టీడీపీ విజయం సాధించింది. మల్కాజిగిరి లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌ గెలుపుపై కార్యకర్తలు, కేడర్‌ ఉత్సహంగా ఉన్నాయి. ఇక్కడి నుంచి కాంగ్రెస్‌ పార్టీ గెలవడం ఇది రెండోసారి. 

మూడు సెగ్మెంట్లలో కాంగ్రెస్‌ మెజారిటీ
మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎల్బీనగర్, మల్కాజిగిరి, ఉప్పల్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొదటి రౌండు నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి రేవంత్‌రెడ్డి అధిక్యత చాటారు. ఎల్బీనగర్‌లో 29 వేలు మోజారిటీ రాగా, మల్కాజిగిరిలో 10 వేలు, ఉప్పల్‌లో దాదాపు 9 వేల మోజారీని కాంగ్రెస్‌ సాధించింది. ఈ మూడు నియోజకవర్గాల్లో వచ్చిన మోజారిటితోనే కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించింది. ఈ మూడు అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మోజారిటీని సొంతం చేసుకున్న టీఆర్‌ఎస్‌ లోక్‌సబ ఎన్నికల్లో మాత్రం పూర్తిగా చతికిలపడింది. 

నాలుగింటిలో టీఆర్‌ఎస్‌కు సల్ప అధిక్యత
ఈ సెగ్మెంట్‌లోని మేడ్చల్, కుత్బుల్లాపూర్, కంటోన్మెంట్, కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ సల్ప అధిక్యతను సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీతో పోలిస్తే ఇది చాలా సల్పమే. మేడ్చల్‌లో 9 వేలు, కుత్బుల్లాపూర్‌లో 10 వేలు, కంటోన్మెంట్‌లో 12,500, కూకట్‌పల్లిలో 6 వేల సల్ప అధిక్యతను టీఆర్‌ఎస్‌ ప్రదర్శించింది. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మేడ్చల్‌ నియోజకవర్గంలో 88 వేల మోజారిటీ రాగా, లోక్‌సబ ఎన్నికల్లో 9 వేలే రావడంపై తీవ్ర చర్చ సాగుతోంది.  

ప్రధాన పార్టీల అభ్యర్థులు సాధించిన ఓట్లు ఇలా..

అభ్యర్థి                      పార్టీ                 సాధించిన ఓట్లు  
రేవంత్‌రెడ్డి                కాంగ్రెస్‌                  6,03,748
మర్రి రాజశేఖర్‌రెడ్డి    టీఆర్‌ఎస్‌                 5,92,829
రామచందర్‌రావు       బీజేపీ                    3,04,282
మహేందర్‌రెడ్డి         జనసేన                    28,420
చామకూర రాజయ్య సోషల్‌ జస్టిస్‌ పార్టీ       1351  
డి.భానుమూర్తి        ప్రజాసత్తా పార్టీ            720
బి.బాలమణి        ఇండియా ప్రజా బంధు    1236
నోటా                                                  17,895 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement