
యాదాద్రి భువనగిరి జిల్లా: తెలంగాణాలో భువనగిరి పార్లమెంటు స్థానానికి ప్రత్యేకత ఉందని, తనను గెలిపించేందుకు కృషి చేసిన కార్యకర్తలకు ధన్యవాదాలని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. యాదాద్రిలో బుధవారం కోమటిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. దేశంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా గెలవబోతున్న స్థానం భువనగిరి పార్లమెంటు స్థానమేనని ధీమా వ్యక్తం చేశారు. 80 నుంచి లక్ష మెజారిటీ గెలవబోతున్నామని జోస్యం చెప్పారు. తెలంగాణాలో కాంగ్రెస్ జెండా ఎగరేసేందుకు పనిచేస్తామని అన్నారు. టీఆర్‌ఎస్ క్యాంపు రాజకీయాలపై అసహనం వ్యక్తం చేశారు.
గ్రామాల్లో మంచినీళ్లు లేకపోతే పట్టించుకోని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఒక ఎమ్మెల్సీ ఎన్నిక కోసం క్యాంపు రాజకీయాలు చేస్తున్న తీరు సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ఇంటర్ ఫలితాల అవకతవకలపై స్పందించని విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, గోవా క్యాంపు రాజకీయాలను ఏమనాలని ప్రశ్నించారు. ఆరుగురు మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు కోట్ల రూపాయలు ఖర్చు చేసి క్యాంపు రాజకీయాలు చేస్తూ జల్సాలు చేస్తున్నారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment