భువనగరి : పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు లైన్‌లో నిల్చున్న ఓటర్లు
సాక్షి, యాదాద్రి : భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి గురువారం జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అయితే గత ఎంపీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటింగ్ బాగా తగ్గింది. డిసెంబర్‌లో జరగిన శాసనసభ ఎన్నికల్లోనూ 90శాతానికి మించి పోలింగ్ నమోదు కాగా లోక్‌సభ ఎన్నికల్లో 75.11శాతానికి పడిపోయింది. అసెంబ్లీ, గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో ఆయా పార్టీల నేతల్లో కనిపించిన జోష్, హడావుడి ఈ ఎన్నికల్లో కనిపించలేదు. ఓటింగ్ శాతం పెంచేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు పూర్తిగా ఫలించలేదు.
మరో వైపు ఎండ తీవ్రత అధికంగా ఉండడం కూడా ఓటింగ్ శాతంపై తీవ్ర ప్రభావం చూపింది. అంతేకాకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో ఇతర ప్రాంతాల్లో ఉంటున్న ఓటర్లకు రవాణా ఇతరత్రా ఖర్చులు ఇచ్చి పోటాపోటీగా తీసుకురావడంతో పోలింగ్ శాతం గణనీయంగా పెరిగింది. ఆ రెండు ఎన్నికల్లో ఓటర్ల ఆలనాపాలనా చూడటంతోపాటు పెద్ద ఎత్తున నజరానాలు, మద్యం, డబ్బు పంపిణీ జరిగింది. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేకపోవడంతో ఓటింగ్‌పై తీవ్ర ప్రభావం చూపింది. చాలా పోలింగ్ కేంద్రాలు ఉదయం నుంచే బోసిపోయాయి.
అత్యధికంగా భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో..
భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఇబ్రహీంపట్నం, మునుగోడు, భువనగిరి, నకిరేకల్(ఎస్సీ), తుంగతుర్తి(ఎస్సీ), ఆలేరు, జనగామ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఇందులో భువనగిరి అసెంబ్లీ సెగ్మెంట్‌లో అత్యధికంగా 81.70 శాతం ఓట్లు పోలయ్యాయి. ఉదయం నుంచే పోలింగ్ మందకొడిగా సాగింది. 7నుంచి 9గంటల వరకు 13శాతం పోలింగ్ నమోదైంది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అతి తక్కువగా 8.20శాతం, జనగామలో 8.37శాతం తుంగతుర్తిలో 18శాతం, మునుగోడులో 16.2శాతం ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 9నుంచి 11గంటల వరకు 26.95శాతం పోలింగ్ నమోదైంది. జనగామలో 16.50శాతం, ఇబ్రహీంపట్నంలో 22శాతం, తుంగతుర్తిలో 37.85శాతం నమోదైంది. 11గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 40.99శాతం పోలింగ్ నమోదు కాగా, అనూహ్యంగా జనగామ నియోజకవర్గంలో పుంజుకుని 48.65శాతం నమోదైంది. మునుగోడులో 44.15శాతం, నకిరేకల్‌లో 33.74శాతం ఓట్లు పోలయ్యాయి.
ఒంటి గంట నుంచి 3 గంటల వరకు 57.41శాతం పోలింగ్ జరిగింది. తుంగతుర్తిలో 66.70శాతం, ఆలేరులో 64.50శాతం, ఇబ్రహీంపట్నంలో 45.60శాతం ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 3నుంచి 5గంటల వరకు 68.25శాతం పోలింగ్ జరిగింది. భువనగిరిలో అత్యధికంగా 81.70శాతం, ఆలేరులో 75.25శాతం, మునుగోడులో 72.50శాతం, తుంగతుర్తిలో 69.13శాతం, ఇబ్రహీంపట్నంలో 65 శాతం, నకిరేకల్‌లో 64.75శాతం, జనగామలో 62.23శాతం ఓట్లు నమోదయ్యాయి. 5 గంటల అనంతరం తెలిసిన వివరాల ప్రకారం భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో 81.70 శాతం, ఆలేరులో 79.96శాతం, ఇబ్రహీంపట్నం 68.57శాతం, మునుగోడు 78.45శాతం, నకిరేకల్ 75.95శాతం, తుంగతుర్తి 72.38 శాతం, జనగామ 68.73శాతం పోలింగ్ ఓటింగ్ నమోదైంది.
అందని పోల్ చిట్టీలు
ఎన్నికల కమిషన్ పోల్ చిట్టీలను ఇంటింటికీ పంపిణీ చేయాలని ఆదేశించింది. కానీ, ఓటర్లందరికీ పోల్ చిట్టీలు అందలేదు. దీంతో చాలా మంది పోలింగ్ కేంద్రాలకు రాలేకపోయారు. అలాగే కొందరికి చిట్టీలు అందినా గుర్తింపు కార్డు కావాలని ఎన్నికల సిబ్బంది చెప్పడంతో వెనుదిరిపోయారు. పోలింగ్ కేంద్రాల వద్ద 11 రకాల గుర్తింపు కార్డుల జాబితాను ప్రదర్శించాల్సి ఉన్నా చాలా చోట్ల అది జరగలేదు. ఆలేరులో పోలింగ్ కేంద్రాల పరిశీలనకు వచ్చిన కేంద్ర ఎన్నికల పరిశీలకుడి దృష్టికి ఓటర్లు ఈవిషయాన్ని తీసుకువచ్చారు. ఆయన వెంటనే గుర్తింపు కార్డులకు సంబంధించిన బ్యానర్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించి వెళ్లారు.
భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంలో ఓట్ల శాతం గణనీయంగా తగ్గింది. 2014లోక్‌సభ, 2018శాసనసభ ఎన్నికలతో పోల్చితే లోక్‌సభ ఎన్నికల పోలింగ్ శాతం పడిపోయింది. 2014లోక్‌సభ ఎన్నికల్లో 79.68శాతం, ప్రస్తుతం 75.11శాతం నమోదైంది. గత పార్లమెంట్ ఎన్నికలతో పోల్చితే 4.57శాతం ఓటింగ్ తగ్గింది. డిసెంబర్ 2018లో శాసనసభ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ పరిధిలో 88.69శాతం ఓట్లు పోలవగా ప్రస్తుతం 75.11శాతం నమోదైంది. మూడు నెలల్లోనే 13.58శాతం ఓటింగ్ తగ్గింది.
తీవ్రమైన ఎండలు
ఎండ తీవ్రత కూడా పోలింగ్ సరళిపై తీవ్ర ప్రభావం చూపింది. ఉదయం 10.30గంటల నుంచే భానుడు భగ్గుమనడంతో జనం పోలింగ్ కేంద్రాలకు రావడానికి అనాసక్తి కనబరిచారు. పోలింగ్ కేంద్రాల వద్ద సరైన వసతులు కూడా లేకపోవడం ఎండలో నిలబడి ఓట్లు వేయడానికి ఆసక్తి చూపలేదు. అరకొరగా వేసిన టెంట్లు, ఓటర్లకు ఇబ్బందులు కలిగించాయి.
Comments
Please login to add a commentAdd a comment