ఎక్కడ తేడా..? | Telangana Lok Sabha Congress MP Candidates Waiting For Results | Sakshi
Sakshi News home page

ఎక్కడ తేడా..?

Published Sat, Apr 13 2019 11:18 AM | Last Updated on Sat, Apr 13 2019 11:18 AM

Telangana Lok Sabha Congress MP Candidates Waiting For Results - Sakshi

ఓటు వేయడానికి బారులు తీరిన మహిళలు(ఫైల్‌)

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: కరీంనగర్‌ పార్లమెంటు ఎన్నికల ఓటింగ్‌ సరళిపై తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వం పూర్తిస్థాయిలో విశ్లేషిస్తోంది. తెలం గాణలో టీఆర్‌ఎస్‌ గెలుస్తుందని ఆ పార్టీ అంచనాలు వేసిన సీట్లలో కరీంనగర్‌ జిల్లాలోని కరీంనగర్, పెద్దపల్లి రెండు స్థానాలు ఉన్నప్పటికీ... బీజేపీ బలం పెరగడంపై ఆరా తీస్తోంది. ప్రధానంగా కరీంనగర్‌లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన బండి సంజయ్‌ దాదాపు అన్ని నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌కు గట్టిపోటీ ఇవ్వడాన్ని ఆ పార్టీ జీర్ణించుకోలేకపోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో వేలాది ఓట్ల మెజారిటీ వచ్చిన నియోజకవర్గాల్లో సైతం కమల వికాసం గురించి చర్చలు జరుగుతుండడంపై ఆ పార్టీ ముఖ్య నేతల్లో ఆందోళనకు కారణమవుతోంది.

గ్రామాల నుంచి మండల, అసెంబ్లీ స్థాయిల వరకు పటిష్టమైన యంత్రాంగం టీఆర్‌ఎస్‌ సొంతమైతే... పట్టణాల్లో తప్ప పల్లెల్లో పెద్దగా ప్రభావం చూపని పార్టీగా బీజేపీ ఉంది. కాంగ్రెస్‌కు ఉన్న ఓటుబ్యాంకు కూడా గ్రామాల్లో బీజేపీకి లేదు. అలాంటి పార్టీ గెలిచేస్తోంది అనే ప్రచారం జరగడానికి గల కారణాలను టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకత్వంతోపాటు ఎమ్మెల్యేలు కూడా విశ్లేషించే పనిలో పడ్డారు. ఏడుగురు ఎమ్మెల్యేలు, 90 శాతానికి పైగా జెడ్‌పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు టీఆర్‌ఎస్‌ వాళ్లే ఉండగా, బీజేపీ గెలిచిపోతుందనే ప్రచారం ఎందుకు జరుగుతోందని ఆ పార్టీ నేతలు తల పట్టుకుంటున్నారు. గ్రామాల వారీగా సేకరించిన లెక్కల ప్రకారం టీఆర్‌ఎస్‌ 2లక్షల మెజారిటీతో గెలుస్తుందని చెపుతున్నప్పటికీ, అంతు చిక్కని పోలింగ్‌ సరళితో ఆందోళన వ్యక్తమవుతోంది.

ఏడుగురు ఎమ్మెల్యేలు  టీఆర్‌ఎస్‌ వాళ్లే ఉన్నా... 
కరీంనగర్‌ పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలే ఉన్నారు. అధిష్టానం నుంచి వచ్చిన కచ్చితమైన ఆదేశాలతోపాటు ప్రతీ ఒక్క ఎమ్మెల్యే టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వినోద్‌కుమార్‌ విజయం కోసం అహోరాత్రులు శ్రమించారనడంలో ఎలాంటి తేడా లేదు. రాష్ట్ర వైద్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ 20 రోజులుగా వినోద్‌కుమార్‌ గెలుపు కోసం ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూనే ప్రచారంలో నిమగ్నమయ్యారు. మంత్రి, ఎమ్మెల్యేల సతీమణులు, కుటుంబసభ్యులు కూడా కరీంనగర్‌ తదితర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యేల వరకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కోసం శ్రమించినా, రెండో శ్రేణి నాయకుల్లో కొందరు బీజేపీకి పరోక్షంగా మద్ధతు పలికినట్లు తెలుస్తోంది.

కరీంనగర్‌ కార్పొరేషన్‌లోని కొందరు కార్పొరేటర్లతోపాటు గ్రామాల్లో కొందరు ప్రజాప్రతినిధులు కూడా బీజేపీకి అనుకూలంగా వ్యవహరించారనే సమాచారాన్ని ఆ పార్టీ నేతలు ఇప్పటికే సేకరించారు. మంత్రి ఈటెల ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌కు స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశాలను బీజేపీ నేతలు కూడా తోసిపారేయడం లేదు. ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌ టీఆర్‌ఎస్‌కు పోటీ ఇచ్చారే తప్ప బీజేపీ కాదనేది స్పష్టమవుతోంది. అలాగే సిరిసిల్ల, హుస్నాబాద్‌లలో కూడా టీఆర్‌ఎస్‌కు మొగ్గు ఉంటుందని చెబుతున్నారు. మిగతా నాలుగు నియోజకవర్గాల్లో మాత్రం టీఆర్‌ఎస్‌తో బీజేపీ నువ్వా నేనా అనే స్థాయిలో ఢీకొట్టిందని పోలింగ్‌ సరళిని బట్టి అర్థమవుతోంది.

కరీంనగర్‌ అసెంబ్లీ పరిస్థితులకు  మిగతా చోట్లకు తేడా ఉన్నా...
కరీంనగర్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌లో బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్‌ 2009, 2014లలో పోటీ చేసి ఓడిపోయారు. 48వ డివిజన్‌ కార్పొరేటర్‌గా కూడా వ్యవహరిస్తున్న సంజయ్‌కు కరీంనగర్‌లో గట్టిపట్టు ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే గెలిచినంత పనిచేసిన సంజయ్‌ 14వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక్కడ మైనారిటీ వర్గం బలంగా ఉండడంతో మెజారిటీ వర్గాల్లో బీజేపీ పట్ల సానుకూలత ఉంది.

కానీ గ్రామీణ ఓటర్లు అధికంగా ఉండే మానకొండూరు, చొప్పదండి, వేములవాడ నియోజకవర్గాల్లో బీజేపీకి ఓట్లు పడ్డట్టు వస్తున్న సమాచారం టీఆర్‌ఎస్‌ నేతలకు మింగుడు పడడం లేదు. ఈ నియోజకవర్గాల్లో పట్టణ ప్రాంతాలతోపాటు గ్రామాల్లో కూడా బీజేపీకి ఓట్లు పడ్డాయా అన్నదే ఇప్పుడు టీఆర్‌ఎస్‌ వర్గాలు ఆరా తీస్తున్న అంశం. కేసీఆర్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఓట్లు రాలుస్తాయని టీఆర్‌ఎస్‌ భావిస్తుండగా, యువత, కొత్త ఓటర్ల ప్రభావం ఆయా కుటుంబాలపై పడిందని, బీజేపీకి గ్రామాల్లో కూడా ఆధిక్యత లభిస్తుందని ఆ పార్టీ అభ్యర్థి బండి సంజయ్‌ ‘సాక్షి ప్రతినిధి’తో వ్యాఖ్యానించారు.

హిందుత్వం, మోదీ ప్రచారాస్త్రాలుగా..
కరీంనగర్‌ అసెంబ్లీలో ఓడిపోయిన తరువాత బండి సంజయ్‌ పార్లమెంటుపైనే ప్రధాన దృష్టి కేంద్రీకరించారు. కరీంనగర్‌లో 60వేల ఓట్లు కురిపించిన హిందుత్వ నినాదాన్ని గ్రామ స్థాయిలో విస్తరించేందుకు అప్పటి నుంచే పావులు కదిపారు. పార్లమెంటు పరిధిలోని బీజేపీ నేతలు, అనుబంధంగా పనిచేసే ఏబీవీపీ, విశ్వహిందూ పరిషత్, ఆరెస్సెస్‌ వంటి సంస్థల నాయకులతో సంబంధాలు పెంచుకొని చాపకింది నీరులా విస్తరించే ప్రయత్నం చేశారు.

రెండుసార్లు ఓడిపోయాడనే సానుభూతితోపాటు హిందుత్వ నినాదం కూడా బలంగా వ్యాపింపజేయడంలో కృతకృత్యులయ్యారు. వీటికి తోడు దేశ సరిహద్దుల్లో చోటు చేసుకున్న యుద్ధ వాతావరణం, మోదీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు యువతకు బీజేపీని కొంత దగ్గరికి చేర్చింది. ఈ ఎన్నికలు ముఖ్యమంత్రిని నిర్ణయించేందుకు కాదనే వాదన కూడా కొంత పనిచేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. వీటన్నింటి పరిణామాల్లో పెరిగిన బీజేపీ ఓట్లు సంజయ్‌ను గట్టెక్కిస్తాయో లేదో తెలియదు గానీ గులాబీ శిబిరంలో మాత్రం తెలియని ఆందోళనకు కారణమవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement